– మంగళూరులో సుమారు 2 వేల మందిపై కేసులు
– వారి ఆహర్యం ద్వారా అంచనా వేశాం : ఫిర్యాదుదారులు
– పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్‌

బెంగళూరు : ‘పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని వారి వేషధారణ ద్వారా గుర్తించొచ్చు’ అని ప్రధాని మోడీ చెప్పిన మాటలను కర్నాటక పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గానీ.. సీఏఏకు వ్యతిరేకంగా మంగళూరులో సుమారు 2వేల మందికి పైగా ముస్లింలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ఎఫ్‌ఐఆర్‌లో ‘గుర్తు తెలియని నిందితులు’గా పేర్కొన్న వారిలో ఎక్కువ మంది ముస్లింలే ఉండటం గమనార్హం. పోలీసులు వీరిపై దేశద్రోహం, ఆస్తుల ధ్వంసం, చట్టవ్యతిరేక కార్యకలాపాల వంటి తీవ్ర నేరారోపణ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసులే గాక పలువురు ఫిర్యాదుదారులతోనూ తమ దుకాణాలను ‘ముస్లింలే ధ్వంసం చేశారని’ ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదు చేయించారని ముస్లిం సంఘాల నాయకులు వాపోతున్నారు.

సీఏఏను నిరసిస్తూ ఈనెల 19న మంగళూరులో శాంతియుతంగా చేపట్టిన నిరసనలు.. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా హింసాత్మకమ య్యాయి. ముందుగా ర్యాలీలకు అనుమతినిచ్చిన పోలీసులు, బీజేపీ సర్కారు.. రాత్రికి రాత్రే మాట మార్చి రాష్ట్రవ్యాప్తంగా 144వ సెక్షన్‌ను విధించింది. ప్రజలు గుంపులుగా కనబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఆగ్రహించిన హక్కుల కార్యకర్తలు, ప్రజలు భారీగా రోడ్లమీదకు వచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. నిరసనకారులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వందలాది మంది గాయపడగా, ఇద్దరు పౌరులు మృతి చెందారు. అనంతరం పోలీసులు ఈ అల్లర్లకు ముస్లింలను బాధ్యులను చేస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఈ ఘటన తర్వాత 24 ఎఫ్‌ఐఆర్‌లలో గుర్తుతెలియని నిందితులుగా పేర్కొన్న వారిలో 2 వేలకు మందికి పైగా ముస్లింలపై కేసులు నమోదుచేశారు. వీరిలో నాలుగు రోజుల క్రితమే 24 మందిని అరెస్టు చేశారు.

కాగా, తన దుకాణాన్ని ముస్లింలు ధ్వంసం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎం. మనోహర కిని (మంగళూరు)ని దీనిపై స్పందన కోరగా ఆయన మాట్లాడుతూ.. ‘పలువురు ముస్లిం యువకులు నా దుకాణాన్ని ధ్వంసం చేశారు’ అని తెలిపాడు. అయితే ‘అల్లర్లు జరిగినప్పడు మీరు అక్కడ ఉన్నారా..?’ అని అడిగితే మాత్రం తాను అక్కడ లేనని సమాధానమిచ్చాడు. మరో ఘటనలో భవానీ వీధికి చెందిన నగల షాపు యజమాని రవీంద్ర నిక్కం స్పందిస్తూ.. సుమారు 60 మంది ముస్లింలు తన దుకాణాన్ని ధ్వంసం చేసేప్పుడు తాను చూశానని అన్నారు. అయితే వారు ముస్లింలేనా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఆహర్యం ద్వారా వారిని ముస్లింలని గుర్తించాను. వారు ముస్లింలవలే పాయింట్లను మీదకు మలుచుకున్నారు. అంతేగాక బ్యారీ భాష (కర్నాటకలో పలువురు ముస్లింలు మాట్లాడే భాష.. ప్రత్యేకించి దక్షిణ కన్నడ జిల్లాలో) మాట్లాడుకున్నారు’ అని తెలిపారు. దీంతో పోలీసులు కూడా గుర్తుతెలియని ముస్లింలపైనే కేసులు నమోదుచేశారు. మంగళూరు ఉత్తర పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎన్‌. మహేశ్‌ కూడా ఘటనజరిగిన రోజు తాను పెట్రోలింగ్‌కు వెళ్తే సుమారు 1500 మంది ముస్లింలు తన వాహనంపై దాడి చేశారనీ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణతో వారిందరి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇదిలాఉండగా 19న జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన ఇద్దరి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లలో ఉండటం గమనార్హం.

ఇదిలాఉండగా బీజేపీ సర్కారు, పోలీసులు సీఏఏ ఆందోళనలకు మతం రంగు పులుముతున్నారని హక్కుల కార్యకర్తలు, బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై మంగళూరు పోలీసు కమిషనర్‌ హర్ష మాట్లాడుతూ.. ‘ఎఫ్‌ఐఆర్‌ అనేది ఫిర్యాదుదారు అంచనాపై నమోదు చేసే ప్రాథమిక పత్రంలాంటిది. అయితే ఈ కేసులో మాత్రం ముస్లిం సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అందుకే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను చేర్చారు’ అని సమర్థించుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయనీ, వారు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హెచ్‌.ఆర్‌. రాజేశ్వరి దేవిని వివరణ కోరగా.. 66 మంది పోలీసులు తమకు తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి వచ్చిన మాట వాస్తవమేననీ, కానీ వారిని అదే రోజు చికిత్స చేసి ఇంటికి పంపించామని తెలిపారు. వారి గాయాలూ ఏమంత పెద్దవి కాదని వివరించారు. మరోవైపు పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బాధితులు ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(Courtesy Nava Telangana)