నెక్కొండ/భైంసా : అప్పుల బాధతో సోమవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంటకు చెందిన వెలిశోజు రాజేందర్‌ (35) పత్తి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురైన రాజేందర్‌ క్రిమిసంహారక మందు తాగాడు. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కోటగిరి అశోక్‌ (45) ఆరు నెలల క్రితం రూ.10 లక్షలు అప్పు చేసి మూడెకరాలను కొనుగోలు చేశాడు. ఓవైపు పంట దిగుబడులు సరిగ్గా రాకపోవడం.. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.