సమ్మెపై ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీ కార్మికుడు తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. భవిష్యత్తుపై బెంగతో గుండె పోటుకు గురవుతున్నాడు. ఆదివారం ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గుండె పోటుతో చనిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్‌ ఖాజామియా 16 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఆదివారం ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. సమ్మెపై ప్రభుత్వ వైఖరితో ఆయన తీవ్ర మనోవేదన చెందారని, అందుకే గుండె పోటు వచ్చిందని జేఏసీ నాయకులు ఆరోపించారు.
సత్తుపల్లి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఖాజామియా స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ఖాజామియా అంత్యక్రియల్లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. కేసీఆర్‌ మొండి వైఖరి కారణంగానే కార్మికులు చనిపోతున్నారని అన్నారు. నల్లగొండ డిపోలో ఏడీసీగా పనిచేస్తున్న గోసుకొండ మల్లయ్య ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన మల్లయ్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. జీతం రాకపోవడంతో డయాలసిస్‌ చేయించుకోలేదు. మనోవేదనతో ఆయనకు శనివారం రాత్రి 11.40 గంటలకు గుండె పోటు వచ్చింది. కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున మరణించారు.
courtesy Andhra Jyothy