భారత దేశం సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా మూఢ నమ్మకాల జాడ్యం మాత్రం పోవడం లేదు. దురాచారాలతో దుర్మార్గాలకు పాల్పుడుతున్న ఘటనలు దేశంలో ఇంకా వెలుగు చూస్తుండటమే దీనికి తిరుగులేని రుజువు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మూఢుల అకృత్యాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అంధ విశ్వాసాలతో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న దారుణోదంతాలు ఉత్తరప్రదేశ్‌, ఒడిశాల రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. దేవుడు కోరిక మేరకు చంపామంటూ హంతకులు చెప్పడం మూఢనమ్మకాలకు పరాకాష్ట.

 
దేవుడు కోరినందుకే చంపేశా..

యూపీలోని బులంద్‌ష‌హర్‌లోని ప‌గోనా గ్రామంలో ఏప్రిల్‌ 27న స్థానిక శివా‌లయం లోప‌ల జగదీష్‌‌, షేర్‌ సింగ్‌‌ అనే ఇద్ద‌రు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలతో సంబంధం ఉన్న మురారీ అలియాస్‌ రాజు అనే వ్యక్తిని తర్వాత రోజు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అర్థనగ్నంగా.. మత్తులో తూగుతున్న అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. బంగు మత్తులో శివాలయంలో పడుకుని ఉన్న సాధువులపై కర్రలతో దాడి చేసి చంపినట్లు పోలీసుల ఎదుట నిందితుడు ఒప్పుకున్నాడు. తనకు సాధువులకు ఎటువంటి గొడవ జరగలేదని, దేవుడు కోరినందుకే రెండు హత్యలు చేశానని రాజు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

దేవత చెప్పిందని..
ఒడిశాలోని కటక్‌ జిల్లా బందాహుదా గ్రామంలో మే 27న మరో దారుణం వెలుగు చూసింది. మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మే సన్‌సారి ఓజా( 72) అనే పూజారి స్థానిక బుద్ద బ్రాహ్మణి దేవి గుడిలో ఓ వ్యక్తి అతి కిరాతకంగా తల నరికి చంపాడు. నరబలి ఇస్తే కరోనా మహమ్మారిని మాయం చేస్తానని దేవత స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో పూజారి వెల్లడించాడు. దేవత ఆదేశాల ప్రకారమే ఈ దురగతానికి పాల్పడినట్టు చెప్పాడు. పూజ కోసం ఆలయానికి వచ్చిన సరోజ్‌ కుమార్‌ ప్రధాన్(55)ను గొడ్డలితో నరికి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పూజారి ఓజాపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్నారు.