• జపాన్‌ నౌకలో ఉన్నవారికి సోకిన కొవిడ్‌-19
  • నౌకలో వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 175కు
  • చైనాలో కరోనా మృతుల సంఖ్య 1113కు!
  • 44,653 మందికి వైరస్‌.. చైనాకు ఆవల 397 మందికి!

బీజింగ్‌, న్యూఢిల్లీ: దాదాపు వారం రోజులుగా జపాన్‌ తీరంలో ఉన్న డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కొవిడ్‌-19 (నావెల్‌ కరోనా) వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 175కు చేరింది. అందులో ఇద్దరు భారతీయులకు వైరస్‌ సోకినట్టు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆ నౌకలో 1045 మంది సిబ్బంది సహా మొత్తం 3711 మంది ఉన్నారు. సిబ్బందిలో 132 మంది, ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు. వైరస్‌ సోకిన 175 మందినీ జపాన్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నౌకలో భద్రతాధికారిగా పనిచేస్తున్న సోనాలీ ఠాకూర్‌ కేంద్రం సాయం కోసం విజ్ఞప్తి చేశారు. వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని.. అది తమకు కూడా సోకుతుందేమోనని భయంగా ఉందని, అలా జరక్కముందే భారత్‌కు వెళ్లాలనుకుంటున్నామని ఆమె తెలిపారు. భారత ప్రభుత్వం తమను తీసుకెళ్లి కావాలంటే ఇండియాలో విడిగా ఉంచాలని లేదా కనీసం వైద్యసిబ్బందిని తమవద్దకు పంపాలని ఆమె వేడుకున్నారు. మరోవైపు.. చైనాలో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 1,113కు చేరింది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 44,653కు పెరిగింది. 8,204 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చైనాకు ఆవల వివిధ దేశాల్లో 397 మంది దాకా ఈ వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ కారణంగా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దేశంలోని విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాల్సిందిగా చైనా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు కూడా ‘వుయ్‌ లింక్‌’, ‘డింగ్‌ టాక్‌’ వంటి యాప్‌ల ద్వారా ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. దీంతో వాటి వినియోగం కొన్ని పదుల రెట్లు పెరిగిపోయింది. కాగా.. కరోనా వైరస్‌ ముప్పును కేంద్రం సీరియ్‌సగా తీసుకోవట్లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ విమర్శించారు.

Courtesy Andhrajyothi