ఫోన్లు చేసి రెండు ప్రేమజంటల ఆత్మహత్యాయత్నం
యువతి మృతి.. మరో ముగ్గురు విషమం
నిజామాబాద్‌, భువనగిరి జిల్లాల్లో ఘటనలు
 

ఎడపల్లి, భువనగిరి క్రైమ్‌ : తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని మనస్తాపానికి గురైన రెండు ప్రేమజంటలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాయి. ఘటనలో ఓ యువతి మృతిచెందగా యువకుడు విషమంగా ఉన్నాడు. మరో జంట అపస్మారకస్థితిలోకి వెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన మోహన్‌(22), నవనీత (20) పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పట్నుంచి ప్రేమలో ఉన్నారు. మోహన్‌ పది పూర్తయ్యాక జహీరాబాద్‌లో పాలవ్యాపారం చేస్తున్నాడు. నవనీత డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటోంది. వారి ప్రేమకు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో ఆదివారం ద్విచక్రవాహనంపై ఎడపల్లి మండలంలోని అలీసాగర్‌కు అటవీ ప్రాంతానికి వెళ్లారు.

మోహన్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ‘మీరు మా ప్రేమను ఒప్పుకోవడం లేదు. కాబట్టి మేం విషం తాగి చనిపోతున్నాం’ అని చెప్పి, మజా బాటిల్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. ఎడపల్లి పోలీసులు అలీసాగర్‌ గుట్ట ప్రాంతంలో వారిద్దరి కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. విషం తాగి ఉన్న ప్రేమికులను గమనించిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే నవనీత మృతిచెందింది. మోహన్‌ పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామ కోటూరినవీన్‌, వేసరిగి గ్రామ తౌట స్వాతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నవీన్‌ మెకానిక్‌.

స్వాతి ఇంటర్‌ చదువుతోంది. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోరేమోననే భయంతో శనివారం సాయంత్రం ఇంట్లోంచి పారిపోయి భువనగిరికి చేరారు. ఆదివారం ఉదయం భువనగిరి ఖిల్లాపైకి చేరుకుని బంధువులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటున్నామని నవీన్‌ తన స్నేహితుడికి ఫోన్‌లో చెప్పడంతో అతను పోలీసులకు తెలిపాడు. పట్టణ పోలీసులు అక్కడికి వెళ్లేసరికే వారిద్దరు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకొని తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ గాంధీకి తరలించారు.

Courtesy Nava Telangana