అమెరికన్లు మిల్‌గ్రోమ్‌, విల్సన్‌లను వరించిన అవార్డు

స్టాక్‌హోం, అక్టోబరు 12: అర్థ శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ఈ సారి అమెరికా ఆర్థికవేత్తలకు దక్కింది. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీకి చెందిన ఇద్దరు ఆర్థికవేత్తలు పాల్‌ ఆర్‌. మిల్‌గ్రోమ్‌ (72), రాబర్ట్‌ బి.విల్సన్‌ (83)లకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వేలం సిద్ధాంతాన్ని మెరుగుపర్చడంతో పాటు కొత్త, మెరుగైన వేలం నమూనాలను రూపొందించినందుకు వీరికి నోబెల్‌ దక్కింది. ‘వేలం సిద్ధాంతంలో మిల్‌గ్రోమ్‌, విల్సన్‌ ఆవిష్కరణల వల్ల ప్రపంచ వ్యాప్తంగా విక్రయదారులు, కొనుగోలుదారులతో పాటు పన్ను చెల్లింపుదారులు కూడా ఎంతో లబ్ధి పొందుతున్నారు’ అని నోబెల్‌ కమిటీ సోమవారం పేర్కొంది.

మిల్‌గ్రోమ్‌, విల్సన్‌లు వేలంలో కనుగొన్న కొత్త ప్రక్రియలను రేడియో ఫ్రీక్వెన్సీలు, ఫిషింగ్‌ కోటాలు, విమానాశ్రయ ల్యాండింగ్‌ స్లాట్‌ల విక్రయాల్లోనూ వినియోగిస్తున్నారని తెలిపింది. తాజా ప్రకటనతో వారం రోజులుగా కొనసాగుతున్న నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు ముగిశాయని కమిటీ సెక్రటరీ జనరల్‌ గొరాన్‌ హన్సన్‌ తెలిపారు. 1969 నుంచి అర్థశాస్త్రంలో విశేష సేవలందించిన వారికి నోబెల్‌ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తనకు పురస్కారం దక్కడం పట్ల మిల్‌గ్రోమ్‌ సంతోషం వ్యక్తం చేశారు. విల్సన్‌ నేరుగా ఇంటికి వచ్చి ఈ విషయాన్ని చెప్పారని, తానెంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని చెప్పారు. ఇది తనకు మరపురాని రోజని పేర్కొన్నారు. ఈ సారి నోబెల్‌ పురస్కారాలు అత్యధికంగా అమెరికన్లకే దక్కడం విశేషం. శాంతి బహుమతిని పక్కనపెడితే మొత్తం 11 మంది విజేతల్లో ఏడుగురు అమెరికన్లే కావడం గమనార్హం.

Courtesy Andhrajyothi