బెంగాల్‌లో ఒకరు, లద్దాఖ్‌లో మరొకరు.. కేరళలో మరో ఐదుగురికి పాజిటివ్‌!

న్యూఢిల్లీ/తిరువనంతపురం/కోల్‌కతా: కరోనా లక్షణాలతో కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఒకరు, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఒకరు మృతి చెందారు. ఇటీవల ఇరాన్‌, సౌదీ అరేబియాల నుంచి తిరిగొచ్చిన వీరిద్దరూ శనివారం స్థానిక ఆస్పత్రుల్లో చేరి, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. కాగా, లద్దాఖ్‌ వ్యక్తి మూత్రనాళ సమస్యలతో, ముర్షీదాబాద్‌ వ్యక్తి తీవ్ర మధుమేహంతో బాధపడుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వీరి శాంపిల్స్‌ ఫలితాల నివేదికలు వచ్చాకే అసలు కారణాలు తెలియనున్నాయి. మరోవైపు కేరళలో మరో ఐదుగురికి ఈ మహమ్మారి సోకినట్లు నిర్ధారణయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 40కి చేరింది. ఇటీవల ఇటలీ వెళ్లివచ్చిన ఇద్దరు దంపతులకు, వారి కుమారుడికి (24) కరోనా సోకిందని కేరళ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ ఆదివారం తిరువనంతపురంలో వెల్లడించారు. పథనంతిట్ట జిల్లా రణ్ణికి చెందిన వీరు.. వారం కిందట తిరిగివచ్చారని.. కానీ విమానాశ్రయంలో ఆరోగ్య పరీక్ష (స్ర్కీనింగ్‌) చేయించుకోకుండా వెళ్లిపోయారని తెలిపారు. వెనిస్‌ నుంచి తాము తిరిగి వచ్చినట్లు ఈ ముగ్గురూ అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేదు. అయితే వారి బంధువులిద్దరు కొద్దిరోజుల కింద ఈ వైరస్‌ లక్షణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం తెలిసింది. పై ముగ్గురూ ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించేందుకు తొలుత నిరాకరించారు. దీంతో అధికారులు బలవంతంగా ఈ నెల 6న వారిని పథనంతిట్ట జనరల్‌ ఆస్పత్రి  ఐసొలేటెడ్‌ వార్డులో ఉంచారు. ఐదుగురి రక్తనమూనాలను పరీక్షించగా.. పాజిటివ్‌ వచ్చినట్లు శనివారం రాత్రి తేలింది.

ఢిల్లీలో 19 కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్ధారణయిన కేసుల సంఖ్య 40కి చేరింది. వీరిలో 19 మంది ఇటాలియన్‌ పర్యాటకులు. ఇందులో 14 మంది ఇటాలియన్లు, ఒక భారతీయుడికి వైరస్‌ ఉందని గత వారం ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్‌ కేంద్రం ధ్రువీకరించింది. జైపూర్‌లో ఇద్దరికి, లద్దాఖ్‌లో ఇద్దరికి, ఘజియాబాద్‌లో ఒకరికి, తమిళనాడులో ఒకరికి, గురుగ్రాంలో ఓ పేటీఎం ఉద్యోగికి కూడా వైరస్‌ నిర్ధారణ అయింది. ఇక గత నెలలో భారత్‌కు వచ్చిన 495 మంది ఇరాన్‌ టూరిస్టుల జాడ తెలియడం లేదు. దీంతో కేంద్రప్రభుత్వం పెద్దఎత్తున గాలింపు చేపట్టింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ఇరాన్‌లో కరోనా వైరస్‌ రాకముందే వారు ఇక్కడకు వచ్చారని  కేంద్ర పర్యాటక, విదేశీ వ్యవహారాల శాఖలు వెల్లడించాయి.

Courtesy Andhrajyothi