‘దిశ’ సంఘటన తర్వాత డౌన్‌లోడ్లు
30 వేలు పెరిగిన డయల్‌ 100 ఫోన్‌కాల్స్‌

హైదరాబాద్‌: ‘దిశ’ అమానవీయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడంతో పాటు యువతులు, మహిళల భద్రతపై అవగాహన నేర్పింది.ఆపద సమయాల్లో బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసేకన్నా ముందుగా ‘హాక్‌ ఐ’ మొబైల్‌ అప్లికేషన్‌లోని ఎస్‌.ఒ.ఎస్‌(సేవ్‌ అవర్‌ సోల్‌) మీటను నొక్కితే చాలు అంటూ పోలీస్‌శాఖ ప్రచారం చేయడం సత్ఫలితాలనిచ్చింది.

డీజీపీ మహేందర్‌రెడ్డి సహా పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, వీసీ సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌లు పత్రికలు, ప్రసార సాధనాల్లో ప్రజలను అభ్యర్థించడంతో మొబైల్‌ ఫోన్‌లు ఉన్నవారు స్పందించారు. కేవలం రెండు రోజుల్లో 2.5 లక్షల మొబైల్స్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘దిశ’ హత్యోదంతం తర్వాతే ఈ సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుందని డీజీపీ కార్యాలయం పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. వారిలో 70 శాతం మంది రాజధాని వాసులేనన్నారు. శని, ఆదివారాల్లో గంటకు ఆరువేల మంది హాక్‌ ఐ మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పోలీస్‌ అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది ఎస్‌.ఒ.ఎస్‌. మీటను నొక్కి పోలీసులు తమను గుర్తిస్తున్నారా? లేదా? అని పరిశీలించారని వివరించారు. కొందరు యువతులు తాము వెళ్తున్న ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే ముందు ఎస్‌.ఒ.ఎస్‌. మీటను నొక్కి గమ్యస్థానాలను చేరుకున్నాక క్షేమంగా చేరుకున్నామంటూ సంక్షిప్త సందేశాలను పంపించారని పేర్కొన్నారు.

డయల్‌ 100… రోజుకు 80 వేలు
పిల్లలు సహా యువకులు, విద్యార్థినులు, మహిళలు డయల్‌ 100కు ఫోన్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 50 వేల మంది డయల్‌ 100ను సంప్రదిస్తుండగా… నాలుగైదు రోజుల నుంచి ఫోన్లు చేసేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. శని, ఆది, సోమవారాల్లో రోజుకు సగటున 80వేల మంది డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. అంటే 30వేల కాల్స్‌ పెరిగాయి. దీంతో మరో అయిదుగురిని ఫోన్‌ కాల్స్‌ స్వీకరించేందుకు అదనంగా నియమించారు. డయల్‌ 100కు వస్తున్న ఫోన్‌కాల్స్‌ను పోలీసులు ఎప్పటికప్పుడు విశ్లేషించి సంఘటన స్థలాలకు వెళ్తున్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Courtesy Eenadu…