• 20 ఏళ్లన్న పోలీసులు.. ‘బోనఫైడ్‌’ ప్రకారం 18 లోపే
  • చెన్నకేశవులు వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులు
  • జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు
  • ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేసిన కుటుంబ సభ్యులు
  • కానీ, ఆధార్‌ కార్డుల్లో మాత్రం వయసులో వ్యత్యాసం
  • చట్ట ప్రకారం బోనఫైడ్‌ సర్టిఫికెట్టే ప్రామాణికం

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌: దిశ’ను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లా!? ఈ కేసు విచారణలో జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం పాటించాల్సిన నిబంధనలను పాటించకుండానే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారా!? ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు నిందితుల వయసు దాదాపు 20 సంవత్సరాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కానీ, నిందితుల్లో చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ మైనర్లని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తోంది. తమ బిడ్డలు మైనర్లని వారి కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్సీకి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు, వారి వయసు ధ్రువీకరణకు సంబంధించిన బోనఫైడ్‌ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.

శివ, చెన్నకేశవులుకు 18 ఏళ్లలోపే ఉన్నట్లు వారి బోనఫైడ్‌ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ పాఠశాల జారీ చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్ల ప్రకారం.. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నాటికి జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు కాగా, చెన్నకేశవులు వయసు 15ఏళ్ల 7 నెలల 26 రోజులుగా ఉంది. వీరిలో చెన్నకేశవులు 2014 జూలై నుంచి 2015 ఏప్రిల్‌ వరకు ఆరో తరగతి చదివాడని బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. అతని పుట్టిన తేదీని 10.4.2004గా పేర్కొన్నారు. చెన్నకేశవులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాని చికిత్స నిమిత్తం 2018 సెప్టెంబరు 18నే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నకేశవులకు ఇప్పటికే పెళ్లయింది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. మరొక నిందితుడు జొల్లు శివ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లో అతను 2002 ఆగస్టు 15న జన్మించినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ సర్టిఫికెట్‌ను అతని తల్లిదండ్రులు సోమవారమే తీసుకున్నారు.

బోనఫైడే ప్రామాణికం!
అత్యాచారం, హత్య తదితర తీవ్రమైన కేసుల్లో నిందితుల వయసును పాఠశాల మంజూరు చేసే బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా ఎస్సెస్సీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. పంచాయతీ, మునిసిపల్‌ శాఖ జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌ ప్రకారం వయసును లెక్కగడతారు. ఎలాంటి సర్టిఫికెట్‌ లేకపోతే, కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా వయసు నిర్ధారణ పరీక్షలు చేయాలి. అయితే, నిందితుల వాగ్మూలం ప్రకారం వయసును ప్రాథమికంగా నమోదు చేసినట్లు ఓ పోలీస్‌ అధికారి చెప్పారు.

ఆధార్‌ కార్డుల్లో తేడా
జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు వయసు ఆధార్‌ కార్డుల్లో మాత్రం భిన్నంగా ఉంది. వారిద్దరూ 2012 డిసెంబరు 30న ఆధార్‌ కార్డులు పొందారు. అందులో వారు 2001లో జన్మించినట్లు ఉంది. కాగా, వారిద్దరికీ ఓటరు గుర్తింపు కార్డులూ లేవని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ శివ, చెన్నకేశవులుకు ఓటు హక్కు సంబంధిత వివరాలు లేవు. కాగా, ‘దిశ’ హత్యాచార నిందితుల వయసు విషయంపై ఆ కేసు దర్యాప్తు అధికారి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించింది. నిందితుల వయసు విషయం తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు.

Courtesy Andhrajyothi…