22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా
వీరిలో 19 మంది లేఖలను స్పీకర్‌కు అందజేసిన బీజేపీ నేతలు
బెంగళూరు నుంచి భోపాల్‌కు ప్రత్యేక విమానంలో లేఖలు
ఆమోదించినా, వేటేసినా మైనారిటీలోకి కమల్‌నాథ్‌ సర్కారు
నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానన్న స్పీకర్‌ ప్రజాపతి
ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న కమలనాథులు
సీఎం రేసులో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నరోత్తమ్‌ మిశ్రా
బీజేపీలోకి జ్యోతిరాదిత్య.. రేపు చేరనున్న యువనేత

మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటాం. పూర్తి కాలం మా ప్రభుత్వం కొనసాగుతుంది.
సీఎం కమల్‌నాథ్‌

ఇండోర్‌, బెంగళూరు, మార్చి: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కారు సంక్షోభంలో పడింది! ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో 107 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ.. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి కీలక నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా.. పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. బెంగళూరుకు సమీపంలోని దేవనహళ్లి వద్ద ఒక రిసార్టులో బస చేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలు.. మంగళవారం మధ్యాహ్నం తమ పదవులకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల క్రితమే నలుగురు ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకోగా.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పెరుగుతూ వచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేసిన కొద్దిసేపటికే హోటల్‌ ప్రాంగణంలో తమ రాజీనామా లేఖలతో 19 మంది ఎమ్మెల్యేలు ఫొటో దిగారు.

రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపుతున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామా లేఖలను భోపాల్‌లో స్పీకర్‌కు బీజేపీ నేతల బృందం సమర్పించడం విశేషం. బీజేపీ సీనియర్‌ నేత భూపేంద్ర సింగ్‌ ఆ రాజీనామా లేఖలను ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి భోపాల్‌కు తీసుకెళ్లి స్పీకర్‌ ప్రజాపతికి ఇచ్చారు. ఆ తర్వాత భోపాల్‌లో మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. రాజీనామా చేసే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య త్వరలో 30కి చేరుతుందని బీజేపీ నేతలు తెలిపారు. ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు తనకు అందాయని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని స్పీకర్‌ ప్రజాపతి తెలిపారు. ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామా లేఖలను ఈమెయిల్‌ ద్వారా మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీటాండన్‌కు పంపారు. అయితే.. ప్రస్తుతం లఖ్‌నవులో ఉన్న లాల్జీటాండన్‌.. మధ్యప్రదేశ్‌ రాజకీయ పరిణామాలను గమనిస్తున్నానని.. ప్రస్తుతానికి తాను ప్రేక్షకుణ్ని మాత్రమేనని, ఏ నిర్ణయమైనా భోపాల్‌కు వెళ్లాకే తీసుకుంటానని చెప్పారు. కాగా.. మంత్రుల రాజీనామా విషయం తెలియగానే వారిని తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ లేఖ రాశారు. ఎమ్మెల్యేల రాజీనామాలను గనుక ఆమోదిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206 అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం 104కు తగ్గుతుంది. ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల  కాంగ్రెస్‌ బలం 92కు తగ్గుతుంది. ఇన్నాళ్లూ ఆ పార్టీకి మద్దతిచ్చిన బీఎస్పీ (ఇద్దరు ఎమ్మెల్యేలు), ఎస్పీ (ఒక ఎమ్మెల్యే) నలుగురు స్వతంత్రులను కలిపినా కూడా 99కి పరిమితమవుతుంది. కానీ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌ సింగ్‌ కుశ్వాహ, ఎస్పీ ఎమ్మెల్యే రాజేశ్‌ శుక్లా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలవడం గమనార్హం. అంటే వారి మద్దతు కూడా అనుమానాస్పదమే. కాంగ్రెస్‌ పరిస్థితి ఇలా ఉండగా.. బీజేపీకి మాత్రం 107 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బీజేపీ సీనియర్‌ నేత నరోత్తం మిశ్రా బీజేపీ తరఫున ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

ఎమ్మెల్యేల తరలింపు..
మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. మంగళవారం సాయంత్రం బీజేపీఎల్పీ భేటీ అయింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు వారిని గుర్తు తెలియని ప్రదేశానికి పంపాలని బీజేపీ నేతలు ఆ భేటీలో నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, బీజేపీ నేత గోపాల్‌భార్గవ మాత్రం తమ ఎమ్మెల్యేలందరూ హోలీ వేడుకలను జరుపుకొనేందుకు మంగళవారం రాత్రి వేరే చోటుకు వెళ్తున్నట్టు తెలిపారు. ఎక్కడికి వెళ్లేదీ చేప్పేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు.. మిగిలిన 92 మంది ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌ కూడా సిద్ధమైంది. వారిని ఎవరికీ తెలియని ప్రదేశానికి తరలించాలని నిర్ణయించింది.

మావాళ్లు వచ్చేస్తారు : డీకే
మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో చాలామంది వెనక్కివచ్చేస్తారని కర్ణాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ అన్నారు ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తన తండ్రిని చూసి గర్విస్తున్నానని జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్‌ అన్నారు. ‘తరతరాలుగా మా కుటుంబంతో ముడిపడిన ఓ రాజకీయ పార్టీ(కాంగ్రె్‌స)ని వీడాలంటే ఎంతో ధైర్యం కావాలి’ అని మహానార్యమన్‌ వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi