27కి చేరిన మృతుల సంఖ్య
మురుగు కాలువలో ఐబీ అధికారి మృతదేహం
రంగంలోకి దిగిన కేంద్రం
డోభాల్‌కు బాధ్యత అప్పగింత
పోలీసులు, భద్రత సిబ్బంది కవాతు
కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ విపక్షాలు

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటూ నిరసనలు తెలియజేస్తున్నవారితో ఉద్రిక్తంగా మారిన దేశ రాజధానిని గాడిన పెట్టేందుకు కేంద్రం రంగంలో దిగింది. హింసాత్మక ఘటనల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జాతీయ భద్రత సలహాదారుడు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌కి అప్పగించింది. బుధవారం ఉద్రిక్తత కొంత తగ్గినా అల్లర్ల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 27కి చేరింది. నిఘా విభాగం (ఐబీ) అధికారి ఒకరు మురుగునీటి కాలువలో శవమై తేలారు. అల్లర్ల అదుపులో పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. రోజువారీ విధులు నిర్వహించడానికీ ఎవరైనా పైనుంచి ఆదేశించాలా అని నిలదీసింది. అటు రాజకీయ పక్షాల్లోనూ దిల్లీ అల్లర్లు వేడి రేకెత్తించాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. జరిగిన ఘటనలకు హోంమంత్రిదే బాధ్యత అని ఇతర విపక్షాలు స్పష్టం చేశాయి. గుజరాత్‌ అల్లర్లను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయని సీపీఎం వ్యాఖ్యానించింది.  దిల్లీ బాధ్యతను ఎన్‌ఎస్‌ఏకు అప్పగించడాన్ని విపక్షాలు ఆక్షేపించాయి. అల్లర్ల గురించి నివేదించేందుకు సమయం కేటాయించాల్సిందిగా రాష్ట్రపతిని విపక్షాలు కోరాయి. వాటి తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి రాష్ట్రపతికి లేఖ రాశారు.

ట్రంప్‌ వెళ్లగానే క్షేత్రస్థాయికి డోభాల్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన వెంటనే డోభాల్‌ రంగంలో దిగారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాలకు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులకు కొన్ని ఆదేశాలిచ్చారు. ఉద్రిక్తపూరిత ప్రాంతాల్లో బుధవారం కూడా ఆయన పర్యటించారు. అంతా అదుపులోనే ఉందని, పూర్తిస్థాయిలో శాంతి నెలకొంటుందని స్థానికుల్లో భరోసా కల్పించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కలిసి తాజా పరిస్థితుల్ని వివరించారు. పరిస్థితిపై తన అంచనాను ప్రధాని నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)కి నివేదించారు. అల్లర్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని కేంద్ర మంత్రి జావడేకర్‌ స్పష్టం చేశారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి.

సైన్యాన్ని రంగంలోకి దించండి: కేజ్రీవాల్‌
ఈశాన్య దిల్లీలో పరిస్థితి తీవ్రంగా ఉందని, దీనిని పోలీసులు నియంత్రించలేకపోతున్న దృష్ట్యా సైన్యాన్ని రంగంలో దించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విధ్వంసకారులు, సంఘ వ్యతిరేకులు ఈ అల్లర్ల వెనక ఉన్నారని కేజ్రీవాల్‌ దిల్లీ శాసనసభలో ఆరోపించారు. శవాల దిబ్బపై ఆధునిక దిల్లీని నిర్మించలేమన్నారు. ఘటనల వెనక ఎవరున్నారనేది తేలాలని చెప్పారు. చాంద్‌బాగ్‌ ప్రాంతంలో ఐబీ అధికారి అంకిత్‌శర్మ (26) ఓ కాలువలో శవమై కనిపించడం కలకలం రేకెత్తించింది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. శర్మ ఇక లేరని తెలిశాక ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాళ్లదాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. స్థానిక కౌన్సిలర్‌తో కలిసి కొంతమంది స్థానికులే శర్మను హతమార్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎవరూ బయటకు రావద్దని భద్రత బలగాలు విజ్ఞప్తి చేశాయి.

బంధువుల ఇళ్లకు పయనం
దిల్లీలో పలుచోట్ల దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. మొత్తంమీద బుధవారం కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంది. పోలీసు కంట్రోల్‌రూంనకు వచ్చే కాల్స్‌ కూడా తగ్గాయి. కొన్నిచోట్ల మాత్రం ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి వేరేచోటకు తరలిపోతుండడం కనిపించింది. ఇళ్ల నుంచి బయటకు రాలేక ఆంక్షలను ఎదుర్కొంటున్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. చాలామంది భయాందోళనలతోనే గడుపుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఇంతటి విధ్వంసాన్ని ఎన్నడూ చూడలేదని పలు ప్రాంతాల వారు కన్నీళ్లతో చెబుతున్నారు. ఈశాన్య దిల్లీలో 73 కేంద్రాల్లో గురువారం నాటి సీబీఎస్‌ఈ పరీక్ష వాయిదా పడింది. అల్లర్ల మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున పరిహారం చెల్లించనున్నారు. ఘటనలకు సంబంధించి 106 మందిని అరెస్టు చేశామని, 18 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

అల్లర్ల వెనక దిల్లీ పోలీసుల పాత్ర: ఒవైసీ
హైదరాబాద్‌: దేశ రాజధానిలో అల్లర్ల వెనుక దిల్లీ పోలీసుల పాత్ర ఉందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. మతపరమైన అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర  సర్కారు విఫలమైందని, దీనికి కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని కోరారు. భాజపా నేతల ప్రసంగాల వల్లనే హింస చెలరేగిందన్నారు. అమాయక ప్రజలు దేశ రాజధానిలో ప్రాణాలు కోల్పోవాల్సి రావడం సిగ్గుచేటైన విషయమని అన్నారు.

సోదరభావంతో మెలగండి: మోదీ
దిల్లీ: దేశరాజధాని దిల్లీని అట్టుడికిస్తున్న ఘర్షణలపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజలు సోదరభావంతో మెలగాలని, శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ‘‘దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై విస్తృత స్థాయి సమీక్ష జరిపాం. శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు క్షేత్రస్థాయిలో పోలీసులు, ఇతర సంస్థలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. శాంతి, సామరస్యాలే మన సంస్కృతి మూలాలు. అందువల్ల అన్ని వేళలా శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని దిల్లీకి చెందిన సోదర, సోదరీమణులకు పిలుపునిస్తున్నా. ప్రశాంతత నెలకొల్పడం చాలా ముఖ్యం. దానివల్ల సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

హారర్‌ చిత్రాన్ని తలపిస్తున్నాయి
దిల్లీ ఘర్షణలు హారర్‌ చిత్రాన్ని తలపిస్తున్నాయి. 1984లో సిక్కులపై జరిగిన ఊచకోతలను ప్రతిబింబిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్న వేళ జరిగిన ఈ ఘర్షణలు దేశ రాజధానికి చెడ్డపేరు తెచ్చాయి.
శివసేన

పోలీసులది ప్రేక్షకపాత్ర
గుజరాత్‌ (2002)అల్లర్ల తరహా నమూనా దిల్లీలో ఆవిష్కృతమయినట్లు కనిపిస్తోంది.  హింస ప్రజ్వరిల్లుతుంటే దిల్లీ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు.
నవాబ్‌మాలిక్‌, ఎన్‌సీపీ అధికార ప్రతినిధి

గుజరాత్‌ ఘర్షణల్లా..
రాజధానిలో శాంతి భద్రతలు నెలకొనాలంటే తక్షణం సైన్యాన్ని రంగంలోకి దింపడమే మార్గం. ప్రస్తుతం దిల్లీలో జరుగుతున్న హింస గుజరాత్‌లో 2002లో జరిగిన ఘర్షణలను తలపిస్తోంది. భాజపా నాయకుడు కపిల్‌ మిశ్ర రెచ్చగొట్టడం వల్లనే తాజా ఘర్షణలు జరిగాయి.
సీతారాం ఏచూరిసీపీఎం ప్రధాన కార్యదర్శి
డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

తగిన చర్యలు తీసుకోవాలి
ఈశాన్య దిల్లీలో వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలి. శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమైన సంస్థలు, అధికారులను బాధ్యులుగా చేసి తగిన చర్యలు తీసుకోవాలి.
సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌

ముస్లిమేతరులూ పాక్‌ పౌరులే
పాకిస్థాన్‌లో ముస్లిమేతరులను, వారి ప్రార్థన స్థలాలను ఎవరైనా లక్ష్యంగా చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. పాక్‌లో మైనారిటీలంతా అందరి పౌరులతో సమానం. దిల్లీలో హింసాత్మక ఘటనలను  ఖండిస్తున్నాం. భారత్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఈ విషయమై అంతర్జాతీయ సమాజం స్పందించాలి.
– ఇమ్రాన్‌ ఖాన్‌, పాకిస్థాన్‌ ప్రధాని

Courtesy Eenadu