– 1.06 లక్షల ఆహార శాంపిల్స్‌లో..
– 3.7శాతం ప్రమాదకరం.. 15.8శాతం నమూనాల్లో నాణ్యత తక్కువ
– ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలోని ఆహార భద్రత నియంత్రణా సంస్థ ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా” (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) షాకింగ్‌ సమాచారాన్ని వెల్లడించింది. 2018-19 చివరి ఆర్థిక సంవత్సరంలో 1.06 లక్షలకు పైగా ఫుడ్‌ శాంపిల్స్‌ను సర్వే చేయగా.. అందులో 3.7శాతం శాంపిల్స్‌ సురక్షితం కావని తెలిపింది. అలాగే 15.8శాతం శాంపిళ్లు తగిన నాణ్యతను కలిగి లేవనీ, తొమ్మిది శాతం శాంపిల్స్‌లలో లేబులింగ్‌ లోపాలున్నాయని చెప్పింది. అలాగే 2018-19లో ఆహారానికి సంబంధించిన సివిల్‌ కేసులు 36శాతం పెరిగి 2,813 కేసులు నమోదయ్యాయని వివరించింది. అయితే క్రిమినల్‌ కేసుల్లో 86శాతం పెరుగుదల కనిపించి అవి 18,550కు చేరుకున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. పెనాల్టీ విధించిన కేసులలో 67శాతం పెరుగుదల ఉండగా.. అవి 12,727 కు చేరుకున్నాయి.
2018-19 ఏడాదికి గానూ పెనాల్టీల రూపంలో రూ.32.58 కోట్లు వచ్చి చేరాయి. గతేడాది కంటే ఇది 23శాతం పెరగడం గమనార్హం. గతేడాదితో పోల్చుకుంటే విశ్లేషణ చేసిన శాంపిళ్ల సంఖ్య 2018-19లో ఏడుశాతం పెరుగుదల ఉన్నది. అలాగే 25శాతం కంటే ఎక్కువ శాంపిళ్లు ప్రమాణాలకనుగుణంగా లేవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ఆహారం విషయంలో ప్రజలకు విశ్వాసం కలిగించేలా చేయాలంటే దీనిపై రాష్ట్రాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ పవన్‌ అగర్వాల్‌ తెలిపారు.

పేలవ ప్రదర్శన జాబితాలో తెలంగాణ
దేశంలోని దాదాపు పది రాష్ట్రాల్లో ఫుడ్‌ సేఫ్టీని కల్పించేందుకు తగిన నైపుణ్యాలు కానీ, యంత్రాలు కానీ, ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరీ మౌలిక వసతులు, సిబ్బంది వంటి సౌకర్యాలు లేవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. అయితే ఇలాంటి పది రాష్ట్రాల్లో తెలం గాణ కూడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటక, అసోం, జార్కండ్‌, ఒడిషా, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌లు ఫుడ్‌ సేఫ్టీవిషయంలో చెత్త ప్రదర్శ నను కనబర్చాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సమాచారాం ద్వారా తెలుస్తున్నది. ఇక ఈ విషయంలో కేరళ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, బీహార్‌, జమ్మూ-కాశ్మీర్‌, ఢిల్లీ, చండీగఢ్‌ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చక్కటి పురోగతిని చూపాయి. అయితే కార్పొరేట్లు, బడా కంపెనీలకు ఇష్టమొచ్చినట్టుగా అనుమతులిచ్చి నిబంధనలను పాటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వినియోగదారులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Navatelangana..