– అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న టమాట
– ఆపై ఎండు తెగులు దాడి
– రెండేండ్లుగా ఊసే లేని విత్తనరాయితీ
– తీవ్ర నష్టాల్లో గిరిజన రైతాంగం

మార్కెట్లలో కిలో టమాట 40 రూపాయలకు పైనే ధర పలుకుతోంది. కానీ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర అస్సలు లభించటంలేదు. పంట చేతికొచ్చేసరికి దళారులు నిట్టనిలువున దోపిడీ చేస్తున్నారనటానికి ఆదిలాబాద్‌ జిల్లాలోని రైతులే సాక్ష్యం. అకాల వర్షాలకు పంట నష్టపోవటంతో పాటు చీడపీడలు అన్నదాతను అల్లాడిస్తున్నాయి. మార్కెట్‌లో ధర పిరంగా ఉన్నా…25 కిలోల టమాట 80 రూపాయలకే అమ్ముకోవాల్సిన దుస్థితి. ఇంతలా రైతులు దగా పడుతున్నా.. సర్కార్‌ ఎలాంటి ఉపశమనచర్యలు చేపట్టలేదు. కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయలేదు. కనీసం విత్తనరాయితీలు ఇవ్వటానికి ప్రభుత్వానికి చేతులు రావటంలేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంద్రవెల్లి
మొన్నటివరకూ కాసులు కురిపించిన ట’మాట’ ఇటీవలి అకాల వర్షాలకు పడిపోయింది. పంట పూర్తిగా దెబ్బతినగా ఎండు తెగులూ దాడి చేస్తోంది. వీటిన్నింటినీ దాటుకుని చేతికొచ్చిన అరకొర పంటకు కనీస ధర దొరక్క గిరిజన రైతాంగం విలవిల్లాడుతోంది. 25కిలోలను రూ.80కే విక్రయిస్తూ నష్టాలను చవిచూస్తోంది.
ఆదిలాబాద్‌ జిల్లా ధనోర.. ఈ పేరు వినగానే 35 ఏండ్ల కిందట గుడిహత్నూర్‌ మండలం టాకీగూడ రైతు నర్వడే భీంరావు మొదటిసారిగా ఇక్కడ టమాట సాగు చేశాడనే గుర్తొస్తుంది. ఆయన తర్వాత అంచెలంచెలుగా ఈ సాగు పక్కనే ఉన్న ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్‌, బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండలాలకూ వ్యాప్తి చెందింది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. యేటా ఖరీఫ్‌లో ఇక్కడి టమాట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సహా మహారాష్ట్ర, చంద్రపూర్‌, నాగపూర్‌, గోంధియా, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏకంగా జమ్మూకాశ్మీర్‌ వరకూ ఎగుమతి అవుతుంది. ఇంతగా ఆదిలాబాద్‌ గిరిజనులకు కాసులు కురిపించిన టమాట ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది.

నిల్వచేసే వీలులేక..
ఈ యేడు సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 42వేల 500 ఎకరాల్లో కూరగాయలు సాగవగా ఇక్కడి రైతాంగం ఒక్క టమాటనే 20వేల ఎకరాల్లో పండిస్తోంది. ఇటీవలి అకాల వర్షాలకు ఈ పంట అంతా దెబ్బతిన్నది. ఎండు తెగులు సోకి పంట దిగుబడీ తగ్గింది. కోతకొచ్చిన దశలోనే వారం రోజులుగా కురుస్తున్న పొగమంచు కారణంగా టమాట కుళ్లిపోతోంది. ఎకరాకు 16 టన్నుల నుంచి 20 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 10టన్నులకు మించి పంట చేతికందలేదు. దానికితోడు మార్కెట్‌లో కనీస ధర కూడా పలకడం లేదు. ప్రారంభంలో 25కిలోల బాక్స్‌కు రూ.600 నుంచి రూ.700 ధర పలికిన టమాట క్రమంగా రూ.300కు పడిపోయింది. ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు మించి ధర రావడం లేదు. దీంతో పెట్టుబడి కూడా మిగల్లేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రెండేండ్లుగా తమకు రాయితీపై విత్తనాలనూ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏండ్లుగా ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ డిమాండ్‌…
ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే ఇక్కడి రైతాంగానికి అందుబాటులో కనీసకోల్డ్‌ స్టోరేజ్‌ గిడ్డంగులూ లేవు. ఫలితంగా ధర లేనప్పుడు టమాట నిల్వ చేసుకోలేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. టమాట జ్యూస్‌, పచ్చడికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో టమాట సేద్యానికి ఊతమిచ్చేందుకు, ఇక్కడి గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏజెన్సీలోనే ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పాలనే డిమాండ్‌ చాలా కాలంగానే ఉంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి
ఇటీవలి అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట దెబ్బతిన్నది. ధర లేక మార్కెట్‌లో 25 కిలోల టమాటను రూ.80 నుంచి రూ.100కే అమ్ముతున్నాం. పెట్టుబడి కూడా మిగిలేలా లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
-ఎస్‌కె సాదిక్‌, రైతు, శంకర్‌గూడ, ఇంద్రవెల్లి

టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టాలి
ఇక్కడి టమాటకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాయితీ పై విత్తనాలు అందించాలి. ధనోరలోనే టమాట జ్యూస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పాలి. రైతులకేగాక ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగాలూ లభిస్తాయి. ప్రోత్సాహం కింద టమాట రైతులకు పెట్టుబడి సాయమూ అందించాలి. చీడపీడల నుంచి పంట రక్షణ, సాగు పట్ల మెళకువలూ నేర్పించాలి.
-జాదవ్‌ హీరాలాల్‌, రైతు

Courtesy Navatelangana…