పి. చిదంబరం

 ఢిల్లీ ఎన్నికలు భారత్‌కు ‘వియత్నాం ప్రాముఖ్యత’ని సమకూర్చాయి. దేశ రాజధాని పౌరుల ఆశ్చర్యజనక తీర్పుతో లౌకికవాదం, సమానాధికారాన్ని సమర్థించిన సార్థక విజయం భారత ప్రజాస్వామ్యానికి లభించింది. తుక్డే తుక్డే గ్యాంగులు గెలిచాయి! తమ రాజ్యాంగ లక్ష్యాలను సాధించుకునే దాకా ఆ సమూహాలు మరింత శక్తిమంతమవుతూ వర్థిల్లుగాక !!

పార్లమెంటు సమావేశాల్లో గౌరవనీయ సభ్యులు (ముఖ్యంగా విపక్షాలకు చెందినవారు) ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తారు. ఒకోసారి పలు ప్రశ్నలకు లేదా ఒకే ప్రశ్నలోని వివిధ అంశాలకు కలిపి ఒకటే సమాధానం రావడం కద్దు. అటువంటి ముచ్చట నొకదాన్ని ప్రస్తావించదలుచుకున్నాను.ఈనెల 11న లోక్‌సభ కార్యకలాపాల రికార్డులో ఈ క్రింద పేర్కొన్న ప్రశ్న, సమాధానం నమోదయింది (ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, ఇతర మంత్రులతో సహా భారతీయ జనతా పార్టీ నాయకుల ఉద్ఘాటనలు, వక్కాణింపులపై ఆ ప్రశ్నోత్తరాలు ఒక బాధాకరమైన వ్యాఖ్యానం కానట్టయితే అవెంతో ఉల్లాసం కలిగించేవే సుమా!)

సరే, ప్రశ్నకు వద్దాం. (అ) ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అనే సంస్థ దేనినైనా గుర్తించి, దాన్ని హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, లేదా మరే ఇతర కేంద్ర/ రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణ సంస్థల/ పోలీసు విభాగాల లేదా ఏదైనా కేంద్ర/ రాష్ట్ర గూఢచార సంస్థల వర్గీకృత జాబితాలలో చేర్చారా? (ఆ) ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అనే పరిభాషను హోం మంత్రిత్వ శాఖ లేదా ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ / ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారం ఆధారంగా సృష్టించారా? (ఇ) ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ నాయకులు, సభ్యులుగా భావిస్తున్న వ్యక్తుల జాబితాను హోం మంత్రిత్వ శాఖ / నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లేదా మరేవైనా శాంతిభద్రతల పరిరక్షణ లేదా గూఢచార సంస్థలు రూపొందించాయా? (ఈ) ‘తుక్డే తుక్డే గ్యాంగ్ ’ సభ్యులపై (భారతీయ విచారణా స్మృతి లేదా ఇతర చట్టాలలోని ఏ నిబంధనల కింద) శిక్షార్హమైన చర్యలు చేపట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ లేదా మరే ఇతర లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు లేదా గూఢచార సంస్థలు సంకల్పించాయా? (ఉ) సంకల్పించినట్టయితే వాటి వివరాలు తెలియజేస్తారా?

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇలా సమాధానమిచ్చింది: శాంతిభద్రతల పరిరక్షణ సంస్థ ఏదీ అటువంటి సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు.

2019 మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారాన్ని మళ్ళీ స్వాయత్తం చేసుకున్నది. తదాది, భారత్ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం ముంచుకొస్తోందని, ఈ సువిశాల దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వివిధ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయనేది వాస్తవమని చాలామంది భారతీయులు విశ్వసించేలా చేయడంలో పాలకులు సఫలమయ్యారు. ఈ విచ్ఛిన్నకర బృందాలను వేర్వేరు సమయాలలో నక్సలైట్లు, మావోయిస్టులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు, అర్బన్ నక్సల్స్ వంటి వివిధ పేర్ల-తో ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళారు. ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఒక విద్యార్థి సంఘం నిరసన ప్రదర్శన (ఈ ఘటన కారణంగా కన్నయ్య కుమార్, మరో ముగ్గురు విద్యార్థినేతలపై దేశద్రోహ అభియోగాలు మోపారు!) నిర్వహించిన అనంతరం, ఆ విద్యార్థి నిరసనకారులపై ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అనే ముద్ర వేశారు. గమనార్హమైన విషయమేమిటంటే బీజేపీ ప్రభుత్వ విధానాలు, కార్యాచరణలను వ్యతిరేకిస్తున్న ప్రతి బృందంపైన ఇదే ముద్ర వేయడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చివరకు తుక్డే తుక్డే గ్యాంగ్ అనే నామధేయం రాజకీయ చర్చలలోకి కూడా ప్రవేశించింది. నాగరిక సభ్యతలు పరిపూర్ణంగా తెలిసిన విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ కూడా తరచూ ఆ పరిభాషను ఉపయోగించడం ఎంతైనా విచారకరం.

స్వల్ప కాలంలోనే పలు బృందాలపై ఈముద్రవేయడంతో తుక్డే తుక్డే గ్యాంగ్స్ అనేవి నిజంగా వున్నాయని, దేశ సమైక్యత, ప్రయోజనాలకు ప్రమాదకరంగా అవి విస్తరిస్తున్నాయని ప్రజలు విశ్వసించకతప్పని పరిస్థితి ఏర్పడింది. విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు, కార్మిక సంఘాల నాయకులు, రైతులు, నిరుద్యోగ యువజనులు, మహిళలు, బాలలు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు మొదలైన వారందరూ తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యులు అనే ప్రఖ్యాతిని సముపార్జించుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ జనాభా పట్టిక ప్రక్రియకు వ్యతిరేకంగా వందలాది మహిళలు, బాలలు (న్యూఢిల్లీలోని) షాహీన్ బాగ్‌లో అవిరామంగా నిరసన తెలుపుతున్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్ అనే ముద్ర తాజాగా సముపార్జించుకున్న బృందాలు షాహీన్ బాగ్ నిరసనకారులే. ఈ గుంపుల జాబితా రోజురోజుకూ పెరుగుతూనే వున్నది .

ఇటీవలే ముగిసిన ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు ర్యాలీలలో ప్రసంగించారు. రెండు ర్యాలీలలోనూ తుక్డే తుక్డే గ్యాంగ్‌లపై ఆయన ధ్వజమెత్తారు. ఈ తుక్డే తుక్డే గ్యాంగుల నిరసన ప్రదర్శనల చిత్రమాలికలను వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానెల్స్, సామాజిక మాధ్యమాలు నిత్యం చూపుతూనే వున్నాయి. అయితే ఒక చిన్న సమస్య ఉన్నది. తుక్డే తుక్డే గ్యాంగుల సభ్యులు ఒక చేతిలో జాతీయ పతాకంతో, మరో చేతిలో భారత రాజ్యాంగం ప్రతితో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా వారు తరచూ జాతీయ గీతాలను మహోత్సాహంగా ముక్త కంఠంతో ఆలపిస్తున్నారు. మరి ఈ తుక్డే తుక్డే గ్యాంగులకు వ్యతిరేకంగా అధికార పార్టీ ప్రముఖులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను మీడియాలో ఆ గుంపులకు సంబంధించిన చిత్రమాలికలు ధ్రువపరచడం లేదు. రెండూ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ వైరుధ్యాన్ని ప్రజలు గమనించారు. ప్రతి సామాజిక సమూహమూ తాను దేనినైతే విశ్వసించదలుచుకున్నదో దానినే పరిపూర్ణంగా నమ్మినట్టు కనిపిస్తున్నది.

ఇటీవల పార్లమెంటులో ఒక మంత్రి చేసిన ప్రకటన ఎంతో మందిని ఉలికిపాటుకు గురి చేసింది. గత కొద్ది నెలలుగా తాము చేసిన ఆరోపణలకు, మంత్రి ప్రకటనకు మధ్య వున్న ద్వైధీభావాన్ని వివరించేందుకు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరూ ముందుకు రావడం లేదు. మితవాద భావజాలంలో అసాధారణమైనదేదీ లేదు. ఆ భావజాలం స్వతసిద్ధంగా లోపభూయిష్టమైనదీ కాదు. మితవాద నాయకులు ప్రగాఢ మత విశ్వాసులుగా వుండడం కద్దు. అయితే మితవాద నాయకులు మతాన్ని రాజకీయీకరణ చేసి, మతం ఆధారంగా ప్రజల మధ్య చీలికలు సృష్టించడానికి (నా మతమూ, నీ మతమూ అనే భావనను సృష్టించడం) ప్రయత్నించినప్పుడే రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతున్నది, సామాజిక సామరస్యం విచ్ఛిన్నమవుతున్నది. భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఇదే చేసింది. వివిధ వర్గాల ప్రజలలో భయాందోళనలు సృష్టించి, అనిశ్చితి పరిస్థితులను కల్పించేందుకై గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వంలోనూ, రాజ్య వ్యవస్థకు సంబంధించిన ఇతర సంస్థలలోనూ తమ మత విశ్వాసాలను ఆయుధాలుగా ఉపయోగించే వ్యక్తులకు గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వంలోను, రాజ్యవ్యవస్థకు సంబంధించిన వివిధ సంస్థలలోను కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. విఖ్యాత రాజనీతిశాస్త్రవేత్త డాక్టర్ నీరా చంధోకె (ఢిల్లీ విశ్వ విద్యాలయం) ఇలా వ్యాఖ్యానించారు: ‘రాజకీయీకరణ అయిన అధికారానికి, మత ప్రపయోజనాలకు ఉపయోగపడుతున్న అధికారానికి, మతసంబంధిత అస్తిత్వాలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న అధికారానికి వ్యతిరేకంగా లౌకికవాదం పోరాడుతున్నది. రాజకీయీకరణ అయిన మతం రాజ్యవ్యవస్థను స్వాయత్తం చేసుకోకుండా రాజకీయీకరణ అయిన మతాన్ని నియంత్రించే ప్రయత్నమే లౌకికవాదం. మన సమాజంలో ఇటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఎందుకంటే మత ప్రాతిపదికన మన దేశ విభజన జరిగింది. రాజకీయాలలో మత ప్రమేయాన్ని నిరోధించినప్పుడే సామాజిక సామరస్యం వర్ధిల్లుతుంది’.

మతాన్ని రాజకీయ లక్ష్యాలకు ఉపయోగించుకుంటున్న వారికి, రాజకీయీకరణ, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోదలుచుకున్నవారికి మధ్య ప్రస్తుతం కొట్లాట జరుగుతున్నది. ఈ ఘర్షణ ఢిల్లీ, లక్నో, కొల్‌కతా, హైదరాబాద్ , పుణే, కోచి వీధులలోను, ఇంకా దేశ వ్యాప్తంగా అనేక చిన్న పట్టణాలలోను, విశ్వవిద్యాలయాలలోనూ కొనసాగుతున్నది. మన లౌకిక, ప్రపజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని రక్షించుకోవాలనే అవగాహన వున్నవారందరూ ఈ ధర్మపోరాటంలో పాల్గొంటున్నారు. ఈ ధర్మ పోరాటం చేస్తున్న, ఆ సమరాన్ని మరింత విస్తృతంగా ప్రజాశ్రేణుల్లోకి తీసుకువెళుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందిన వారు కాదనేది గమనార్హమైన విషయం. సాధారణంగా ఇంటి పట్టునే వుండే మహిళలు, బాలలు, ప్రభుత్వాల తీరుతెన్నులతో తీవ్ర అసంతృప్తితో వున్న యువజనులు, రాజకీయాల పట్ల నిర్లిప్తులైన విద్యార్థులు ఈ పోరాటంలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రచండ శీతగాలులు, భాష్పవాయు గోళీలు, లాఠీలు, చివరకు బుల్లెట్లకు సైతం వారు ఏమాత్రం భయపడడం లేదు (ఉత్తరప్రదేశ్‌లో ఈ నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోయారు). ఢిల్లీ ఎన్నికలు భారత్‌కు ‘వియత్నాం ప్రాముఖ్యత’ని సమకూర్చాయి. దేశ రాజధాని పౌరుల ఆశ్చర్య జనక తీర్పుతో లౌకికవాదం, సమానాధికారాన్ని సమర్థించిన సార్థక విజయం భారత ప్రజాస్వామ్యానికి లభించింది. తుక్డే తుక్డే గ్యాంగులు గెలిచాయి! తమ రాజ్యాంగ లక్ష్యాలను సాధించుకునే దాకా ఆ సమూహాలు మరింత శక్తిమంతమవుతూ వర్థిల్లుగాక!!

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Courtesy Andhrajyothi