కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మోటారు వాహనచట్టం ప్రకారమే తాము ఆర్‌టిసి ప్రయివేటీకరణకు పూనుకుంటున్నామని ముఖ్యమంత్రి చెపుతున్నారు. బిజెపి ప్రభుత్వం 2019 యంవీ యాక్టు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే వామపక్షాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా బలపర్చింది. అక్కడ ఆమోదించి రాష్ట్రంలో బిజెపి ని విమర్శించడం తెలంగాణ ప్రజలను వంచించడమే. ప్రజా వ్యవస్థలను, సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో బిజెపి, టీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని తేలిపోయింది

తెలంగాణ ఆర్‌టిసి పరిరక్షణ కోరుతూ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌ అప్రజాస్వామిక వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులతో పాటు యావత్‌ ప్రజానీకానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆర్‌టిసికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు పోటీ పెట్టి మాట్లాడటం అన్యాయం. ఆర్‌టిసి ముగింపే సమ్మెకు ముగింపంటున్న ముఖ్యమంత్రి మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉంది. రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరేళ్లలో ఆర్‌టిసిని కాపాడే ఏ చర్యనూ ప్రభుత్వం తీసుకోలేదు. అదే సమయంలో ఆర్‌టిసి లో కార్మికుల సంఖ్య 7000 తగ్గినా ఒక్క కొత్త కార్మికుడిని నియమించలేదు. కొత్త బస్సులను కొనుగోలు చేయలేదు. ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్‌టిసి కార్మికుల జీతాలు పెంచుకుందామని, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసుకుందామని ఉద్యమ కాలంలో నమ్మించారు. ఆ నమ్మకంతోనే కార్మికులు ఈ ఆరేళ్లుగా ఓపిక పట్టారు. అనివార్య స్థితిలోనే చట్టప్రకారం నోటీసిచ్చి 30 రోజుల తర్వాత సమ్మెలోకెళ్ళారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వమే కార్మికశాఖను అడ్డంపెట్టుకొని కార్మికులను సమ్మెలోకి నెట్టింది. ఇప్పుడు 2019 కేంద్ర మోటారు వెహికిల్‌ చట్టాన్ని ముందు పెట్టి ఆర్‌టిసి ప్రయివేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నది. 50 శాతం ప్రభుత్వం, 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రయివేట్‌ ఫార్మలాను ముందు పెట్టింది. రాష్ట్రంలో రైలు ప్రయాణాల కంటే ఆర్‌టిసి పైనే ప్రజలు ఎక్కువ ఆధారపడుతున్నారన్నది వాస్తవం. సుమారు కోటి మంది ప్రయాణీకులను ప్రతి రోజు గమ్యస్థానాలకు చేరుస్తున్న ప్రతిష్టాత్మకమైన ఆర్‌టిసిని ప్రయివేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధపడటం తీవ్రమైన నష్టం. సమ్మె విషయంలో హైకోర్టు ఇప్పటికి పలుమార్లు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కార్మిక సంఘాలిచ్చిన నోటీస్‌లో పేర్కొన్న 21 డిమాండ్లలో 16 అంశాలకు డబ్బులతో పనిలేదని, ఆర్‌టిసికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ని నియమించకుంటే కార్మికులు తమ సమస్యలు ఎవరితో చెప్పుకుంటారని, వందల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఖర్చు చేసే ప్రభుత్వం ఆర్‌టిసికి రూ.47 కోట్లు ఇవ్వలేదా? అని, ఆర్‌టిసి సమ్మె వల్ల ప్రజలు అవస్థ పడుతుంటే, ప్రభుత్వానికి సమ్మె పరిష్కరించాలనే ఉద్దేశ్యమే కన్పించడం లేదని అసహసం వ్యక్తం చేసింది. ప్రభుత్వం. తీరు చూస్తే ఆర్‌టిసి సమ్మె విషయంలో ముందే నిర్ణయానికి వచ్చినట్టుగా ఉందని తీవ్రంగా స్పందించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసిని మూసివేయడానికి సమ్మెను ఆయుధంగా మలుచుకోవడానికే వ్యూహాన్ని రచించుకున్నట్టు తేటతెల్లమవుతున్నది.
ఆర్‌టిసిని ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్పే వాదనల్లో పసలేదు. ఆర్‌టిసికి జీహెచ్‌ఎంఎసీ నుంచి రావాల్సిన బకాయిలు రూ.1492.70 కోట్లు, బస్‌పాస్‌ల రాయితీ రూ.784.40 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1099 కోట్లు. మొత్తం రూ.3,966 కోట్లు ప్రభుత్వం నుంచి రావల్సి ఉండగా ప్రభుత్వం చెల్లించిన వివరాల్లో స్పష్టత లోపించింది. నిజాయితీ లేదు. అసలు ఆర్‌టిసి నష్టాల్లో ఎందుకున్నది? అసలు ఆర్‌టిసి ప్రజారవాణా సంస్థనా? వ్యాపార సంస్థనా? ముందు ప్రభుత్వం దీనిపై ఒక వైఖరి ప్రకటించాలి. ఐదేళ్లుగా ఆర్‌టిసికి నష్టాలు వస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తున్నది? ప్రభుత్వ రంగ ఆర్‌టిసిని కాపాడేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఉమ్మడి రాష్ట్రంలో (1997) రవాణా శాఖ మంత్రిగా పని చేసిన కె.చంద్రశేఖరరావు ఆర్‌టిసికి లాభాలు తేగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆర్‌టిసికి లాభాలు ఎందుకు తేలేకపోయారో సమాధానాలు చెప్పకుండా ‘కార్మికులపై అభాండాలు’ వేస్తున్నారు.
ప్రతిష్టాత్మకమైన టీఎస్‌ ఆర్‌టిసిని పతనావస్థకు తీసుకెళ్ళడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ప్రయాణీకులకు తక్కువ చార్జీలతో, భద్రతకు గ్యారంటీనిస్తూ దశాబ్దాల తరబడి సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థను నిర్వీర్యం చేయజూస్తున్నది. ముఖ్యమంత్రి మాటల్లోనే వెయ్యి శాతం ఆర్‌టిసి ఇప్పుడున్నట్టు భవిష్యత్‌లో ఉండదని హెచ్చరిస్తున్నారు. ఒక్క సంతకంతో 7000 ప్రయివేట్‌ బస్సులను తెస్తామని, అందుకు క్యాబినెట్‌ ఆమోదం కూడా అవసరం లేదని తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రయివేట్‌ బస్సుల వల్ల చార్జీలు తగ్గుతాయని, ప్రయివేట్‌ క్యారియర్లు లాభాల బాటలో నడుస్తాయని సెలవిచ్చారు. దేశంలో ప్రభుత్వ రవాణా సంస్థ కంటే ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో చార్జీలు తక్కువగా ఉండటం ఎక్కడా లేదు. కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా బరితెగించి అబద్ధాలు మాట్లాడటం బాధ్యతారాహిత్యం. చార్జీల పరంగా, భద్రత పరంగా ప్రభుత్వరంగ రవాణా వల్లనే ప్రజలకు (ప్రయాణీకులకు) భరోసా తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ రంగ సంస్థ కనుక మారుమూల గ్రామాలు, తండాల వరకు ప్రయాణీకులను ఆర్‌టిసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ఆర్‌టిసి సిబ్బంది అతి తక్కువ వేతనాలతో ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నీరు పల్లమెరుగు’ అన్నట్టు ప్రయివేట్‌ సర్వీసులు లాభాలిచ్చే రూట్లలో తిరుగుతాయి తప్ప, ప్రజల సౌకర్యం, సంక్షేమం చూడవు.
అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవడానికి ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన మోటారు వాహనచట్టం ప్రకారమే తాము ఆర్‌టిసి ప్రయివేటీకరణకు పూనుకుంటున్నామని ముఖ్యమంత్రి చెపుతున్నారు. బిజెపి ప్రభుత్వం 2019 యంవీ యాక్టు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే వామపక్షాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. టీఆర్‌ఎస్‌ సంపూర్ణంగా బలపర్చింది. అక్కడ ఆమోదించి రాష్ట్రంలో బిజెపి ని విమర్శించడం తెలంగాణ ప్రజలను వంచించడమే. ప్రజా వ్యవస్థలను, సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టడంలో బిజెపి, టీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని తేలిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడి, అధికారానికి వచ్చాక సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు జరపడం పాలక పార్టీల నైజం. ప్రజలను, ఉద్యోగులను కష్టాల్లో నెట్టి బడా కార్పొరేట్‌ సంస్థలకు, పెట్టుబడిదారులకు లాభాలు కట్టబెట్టడమే వారి లక్ష్యం. ఆర్‌టిసిని ప్రజాసంస్థగా కాకుండా లాభనష్టాలతో ముడిపెట్టి చూడటం దుర్మార్గం. 2014-15 నుంచి 2017-18 వరకు ఆర్‌టిసి పై వివిధ రకాల పన్నులు డీజిల్‌, సీఎన్‌జీ, బస్‌ భవన్‌, బస్‌ బాడీస్‌, బస్‌సీట్లు, ఎంవీ టాక్స్‌, టోల్‌టాక్స్‌, ఇతర పన్నులు మొత్తం రూ.3191.80 కోట్లు ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఇందులో సగం ప్రజలు భరిస్తుంటే మిగతా సగం భారం ఆర్‌టిసిపై పడుతున్నది. అందుకే ప్రభుత్వం కాకిలెక్కలు కాకుండా శ్వేతపత్రం ప్రకటిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. అంతేకాక ఆర్‌టిసిని మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చూడాలని, అదాయ వనరుగా చూడకూదని 2012-17వ ప్లానింగ్‌ కమిషన్‌ నియమించిన సబ్‌గ్రూప్‌ చేసిన సిఫారసులో ఉన్నది. ఈ వాస్తవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ దాచిపెట్టడం ఆర్‌టిసి ప్రయివేటీ కరణకు మార్గం సుగమం చేసుకోవడానికే.
ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఆర్‌టిసి సమ్మెతో సహా 2015 నుంచి ఉద్యోగులు తలపెట్టిన సమ్మెలన్నింటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అక్కసుతోను, అప్రజాస్వామికం గానూ, కక్షపూరితంగానూ వ్యవహరించింది. గతంలో సిఎం రెండు సార్లు డెడ్‌లైన్లు పెట్టినా ఆర్‌టిసి కార్మికులు లెక్కచేయలేదు. ఐదవ తేదీ అర్ధరాత్రికి బేషరతుగా విధుల్లో చేరాలని, ఇదే చివరి గడువని, ఇది క్యాబినెట్‌ నిర్ణయమని కెసిఆర్‌ ఈ నెల రెండవ తేదీన హుకుం జారీ చేశారు. అయినప్పటికీ కార్మికులు అదరక బెదరక సమరశీలంగా పోరాటంలో నిలబడడం అభినందనీయం. 12 రోజుల జీహెచ్‌ఎంసీ సమ్మె, మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికుల 44 రోజుల సమ్మె, ఆశాల 106 రోజుల సమ్మె, మెడికల్‌, హెల్త్‌ ఉద్యోగుల ఆందోళనలు, కాంట్రాక్ట్‌ – ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం కోసం సాగిన టోకెన్‌ సమ్మెలు, పోరాటాలన్నింటినీ ఉక్కుపాదంతో అణచడానికి ప్రయత్నిం చింది. కార్మికశాఖను తన జేబు సంస్థగా మార్చుకున్నది. రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులను అనేకసార్లు అవమానించింది. ఉద్యమాలు – పోరాటాల తీవ్రత వల్ల రాజకీయంగా తనకు కలిగే నష్టం గురించి ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఆ భయంతోనే ఆర్‌టిసి సమ్మెపై ఎదురు దాడికి పాల్పడుతున్నారు. గత ఆరేళ్లుగా టి ఆర్‌టిసి నిర్వీర్యం కావడానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆర్‌టిసి ముగించడమంటే ప్రజా రవాణాకు రాష్ట్ర ప్రజలకు దూరం చేయడమే. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టకు పోకుండా ప్రజా రవాణా సంస్థ ఆర్‌టిసిని కాపాడే చర్యలను చేపట్టాలి. కార్మికులతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలి.

– జె వెంకటేష్‌,
 వ్యాసకర్త,
సెల్‌ : 9490098658