ఘనత వహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గారికి మళ్ళీ కోపం వచ్చింది! ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కరోనా వైరస్‌ విషయమై తమను అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందనేది ఆయన ఆరోపణ. అత్యధిక నిధులు ఇచ్చేది తామైతే, ఈ సంస్థ మాత్రం చైనాకు కొమ్ము కాస్తున్నదని, అందువల్ల తమ వంతు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారు. అమెరికాలో వేలాదిమంది కరోనా కాటుకు కన్నుమూయడం బాధాకరమే. ట్రంప్‌ ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కరోనే ఇంతగా పేట్రేగిపోతున్నదని అమెరికాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తన తప్పు అంగీకరించే తత్తం ఏ మాత్రం లేని ట్రంప్‌ తన వైఫల్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మీదికి మళ్లిస్తున్నారు. మొదటి దశ, జనవరి నాటికి కరోనాపై ఇప్పటంత స్పష్టత లేదు. ఆ తర్వాత కాలంలో స్పష్టత వచ్చినప్పటికీ ట్రంప్‌ దానిని పెద్దగా పట్టించుకోలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పిదం వల్లనే ట్రంప్‌ నిధులు నిలిపివేస్తామంటున్నారా? లేక నిధులు ఆపివేయడానికి ఏదో ఒక సాకు చూపుతున్నారా అనే అనుమానం కలుగుతున్నది. సమష్టితత్తమంటేనే ట్రంప్‌నకు నచ్చదేమో! ట్రంప్‌ అధికారానికి వచ్చిన తర్వాత అమెరికా యునెస్కో నుంచి వైదొలిగి, నిధులు ఇవ్వడం మానేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థను కూడా అమెరికా నిర్వీర్యం చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలనేది ట్రంప్‌ వాదన! వాణిజ్యరంగంలో భారత్‌పై ఇప్పటికీ అక్కసు వెళ్ళగక్కుతుంటారు. మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ అనివార్యమైన ఈ తరుణంలో ప్యారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడమేమిటి? ఈ ఒప్పందం విషయంలోనూ ట్రంప్‌ భారత్‌కేదో దోచిపెడుతున్నట్టు మాట్లాడారు. నాటో మిత్రదేశాలతో ఇదే పేచీ. ఆసియా- పసిఫిక్‌ కూటమిని రద్దుచేసుకున్నారు. ఐరాస అంటే కూడా ట్రంప్‌నకు గిట్టదు. ఏ దేశంతోనూ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఆయనలో కనిపించదు.

దేశ పాలనలో కానీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ ప్రతి అంశాన్ని వ్యాపారం మాదిరిగా జమా ఖర్చు లెక్కలతో చూడటం సరికాదు. ఈ ప్రపంచీకరణ యుగంలో ఏ ఒక్క దేశం వ్యాధిగ్రస్థమైనా మిగతా దేశాలు ఆరోగ్యంగా ఉండలేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో లోపం ఉంటే చక్కదిద్దుకొని, బలోపేతం చేసుకోవాలే తప్ప కుప్పకూల్చకూడదు. ప్రపంచ యుద్ధాలను, అనేక సంక్షోభాలను చవి చూసినందు వల్లనే ఐరాసను ఏర్పాటుచేసుకోవలసి వచ్చింది. యునెస్కో విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తుంది. అది మానవాళి ఉమ్మడి వారసత్వానికి, భవిష్యత్తుకు, వికాసానికి తోడ్పడుతుంది. పరోక్షంగా ప్రపంచ శాంతికి, సంఘీభావానికి దోహదపడుతుంది. అంతర్జాతీయ సమాజం ఎంతో కృషిచేసి నిర్మించుకున్న చట్టాలను, నియమాలను, సంస్థలను మొరటుతనంతో ధ్వంసం చేస్తూ పోతే, దాడులు, విధ్వంసాలు, జాతుల హననాలతో భూగోళమంతా రక్తసిక్తం కాదా! ఏ కట్టుబాట్లూ లేకుంటే తన మాటే చెల్లుబాటవుతుందని ఇప్పుడు ట్రంప్‌ మురిసిపోవచ్చు. కానీ నియమ రహిత సమాజంలో చివరికి అమెరికాకు కూడా భద్రత ఉండదని గ్రహించాలి.

Courtesy Namasthe Telangana