ట్రంప్‌ రాకతో స్థలం ఖాళీ చేయాలంటూ
మురికివాడ వాసులకు నోటీసులు

అహ్మదాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వస్తుండడంతో మురికివాడ కనిపించకుండా రహదారి పక్కన గోడ కట్టిన అహ్మదాబాద్‌ మునిసిపాలిటీ (ఏఎంసీ) అధికారులు.. తాజాగా అక్కడ నివసిస్తున్న 45 కుటుంబాల వారికి స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న ప్రధాని మోదీ, ట్రంప్‌ అహ్మదాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భాగంగా మోదీ, ట్రంప్‌ కలిసి మోతెరాలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఈ క్రమంలో స్టేడియం సమీపంలోని మురికివాడలో నివసిస్తున్న 45 కుటుంబాలకు ఏఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మురికివాడ అహ్మదాబాద్‌- గాంధీనగర్‌ రహదారి పక్కనే ఉంటుంది. ఏఎంసీ అధికారుల నోటీసులపై మురికివాడలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము దశాబ్ద కాలంగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్‌ పర్యటనకు, ఈ నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని ఏఎంసీ అధికారులు తెలిపారు.

పేదరికాన్ని దాచే ప్రయత్నం: కాంగ్రెస్‌
దేశంలో ప్రజల వినియోగ స్థాయులు 40 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయని, ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అహ్మదాబాద్‌లో ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో మురికివాడ కనిపించకుండా గోడ కట్టడం ద్వారా బీజేపీ సర్కారు పేదరికాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శించారు.

Courtesy Andhrajyothi