వేలకోట్ల డాలర్ల వ్యాపారం.. 750 డాలర్లు పన్ను చెల్లింపు
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఫెడరల్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసినట్టు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక ఆధారాలతో సహా వార్తా కథనం ప్రచురించింది. వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన 2016లో కేవలం 750 డాలర్ల (సుమారుగా రూ.55,315) పన్ను మాత్రమే చెల్లించారని ఈ కథనం పేర్కొన్నది. ఆ తర్వాత సంవత్సరమైన 2017లోనూ 750 డాలర్లు మాత్రమే ట్రంప్‌ చెల్లించారని తెలిసింది. గత 20ఏండ్ల ఆదాయ పన్ను రిటర్నుల రికార్డులను సంపాదిం చిన న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సమాచారం ప్రకారం, డొనాల్డ్‌ ట్రంప్‌ గత 15ఏండ్లలో మొత్తం 10 సంవత్సరాలు ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్నూ కట్టలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆదాయానికి మించిన నష్టాలు వచ్చినందున తాను ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా ప్రభుత్వ రెవెన్యూ శాఖకు ట్రంప్‌ వివరణ ఇచ్చారు. అయితే ఆయన తన ఆస్తుల వివరాలను గానీ, నష్టాల వివరాలనుగానీ వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై అమెరికా రెవెన్యూశాఖ ఎలాంటిదర్యాప్తునకు ఆదేశించలేదు.

2017లో ఆయన, ఆయన కంపెనీలు కలిసి భారత ప్రభుత్వానికి 1,45,400 డాలర్లు (సుమారుగా రూ.కోటీ 6లక్షలు) పన్ను రూపంలో చెల్లించినట్టు టైమ్స్‌ ఓ సందర్భంలో పేర్కొంది. ఈ లెక్కన అమెరికాలో చెల్లించిన దాంతో పోలిస్తే 2017లో ట్రంప్‌ భారత్‌లో కట్టిన పన్నులే ఎక్కువ! ఈ వార్తా కథనంపై స్పందించిన ట్రంప్‌ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. తాను పన్నులన్నీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు.

అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తి గత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. రిచర్డ్‌ నిక్సన్‌ అధ్యక్ష హోదాలో ఉన్ననాటి నుంచి ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది వారి ఆదాయ పన్ను వివరాలను బహి ర్గతం చేస్తూ వచ్చారు. ట్రంప్‌ మాత్రం ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పైగా ఆదాయపు పన్ను వివరాలు తెలియజేయాలని కోరినవారితో ట్రంప్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దాంతో ఆ వివరాల్లో అంతలా ఏముందనే అనుమానాలు తీవ్రమయ్యాయి. 2016లో కీలకంగా మారిన ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండోసారి అధ్యక్ష రేసులో ఉన్న సమయంలోనూ ఇది ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది.

Courtesy Nava Telangana