– అమెరికా ప్రయోజనాల కోసమే ట్రంప్‌ పర్యటన
– అమెరికా ఏకపక్ష ధోరణికి భారత్‌ తలవంచుతున్నది : రాజకీయ విశ్లేషకులు
– రష్యా, ఇరాన్‌లను దూరం చేసుకున్నాం..
– ట్రంప్‌ స్వీయరాజకీయ ప్రయోజనాలూ దాగివున్నాయి..

మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చాక, భారత్‌ క్రమంగా అమెరికాకు దగ్గరవటం స్పష్టంగా కనపడుతున్నది. అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు ఇరాన్‌ను దూరం చేసుకున్నాం. ఇప్పుడు రష్యాకు దూరం జరుగుతున్నాం. ఇదంతా కూడా అమెరికా ఏకపక్ష ధోరణి. దీనికి భారత్‌ తలవంచుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, వాణిజ్య సంబంధాల్లో భారత్‌ బేలతనం ప్రదర్శిస్తున్నదని, ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక వైఖరి లోపించటం వల్ల, దేశ ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నామని వారు హెచ్చరిస్తున్నారు.

భారత్‌ పర్యటనకు బయల్దేరే ముందు అమెరికాలో ట్రంప్‌ చేసిన ప్రకటన ఇది. ” వచ్చే వారం నేను భారత్‌లో పర్యటించ బోతున్నా. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చలు జరుపుతా. గతకొన్నేండ్లుగా అమెరికా దిగుమతులుపై పెద్దఎత్తున సుంకాలు విధిస్తున్నారు. మనల్ని చాలా దారుణంగా దెబ్బకొడుతున్నారు. అయినా కూడా భారత ప్రధాని మోడీ అంటే ఇష్టం. అమెరికాపై భారత్‌ విధిస్తున్న టారీఫ్‌లు, సుంకాలు ప్రపంచంలో మరో దేశం విధించటం లేదు. ఈ పరిస్థితిని నా పర్యటన మారు స్తుంది. అమెరికా ఉత్పత్తులు ఎన్నో భారత్‌లో అమ్ముడు పోతాయని గర్వంగా చెప్పగలను” అని అన్నారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోడీ మంచి స్నేహితులు. ప్రధాని మోడీని పొగుడుతూ గతకొన్నాండ్లుగా ట్రంప్‌ మాట్లాడుతున్నారు. అయితే ఈ స్నేహభావం ‘భారతదేశం’ పట్ల ట్రంప్‌నకు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే ట్రంప్‌ భారత పర్యటన చేపట్టారని వారు చెబుతున్నారు. ఘనమైన స్వాగత సత్కారాలు పలికినంత మాత్రాన భారత్‌కు ఒనగూడే ప్రయోజనం ఏమీలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్‌ కోసం బంగారు పూతపూసిన గ్లాసులు, వెండిపళ్లాలు… సిద్ధమయ్యాయి.

భారత్‌లోని పేదరికాన్ని దాచిపెట్టేందుకు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి అడ్డుగోడలు కడుతున్నది. విమా నాశ్రయం నుంచి మోతేరా స్టేడియం వెళ్లేదారిలో కోటి మందితో ఘనస్వాగతం పలుకుతున్నామని ట్రంప్‌తో ప్రధాని మోడీ చెప్పారట. ఇదంతా కూడా అమెరికాతో భారత వాణిజ్య సంబంధాల్ని మెరుగుపర్చవని, సగటు భారతీయుడికి ఒనగూడేదేమీ ఉండదని తెలుస్తున్నది.
ప్రధాని మోడీతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ భారతతో వాణిజ్య సంబంధాలపై అమెరికా అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌1బీ వీసాల దగ్గర్నుంచి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్ల వరకు ఇది కనపడింది. భారతదేశ దిగుమతులపై సుంకాలు పెంచడమేగాక, భారత్‌కు ఎన్నిరకాలుగా చిక్కుముళ్లు సృష్టించాలో (వాణిజ్యపరంగా) అన్ని రకాలుగా ట్రంప్‌ యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. భారత్‌ విషయంలో అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నో మార్లు అక్కసు వెళ్లగక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని అమెరికా, ఇండియాలోని వార్తా దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

ట్రంప్‌ రాజకీయ అవసరం!
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి ఏమంత బాగోలేదు. అభిశంసన వేటు త్రుటిలో తప్పించుకున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పీఠం దక్కించుకునేందుకు అమెరికాలోని భారత సంతతి వారిని తనవైపుకు తిప్పుకునేందుకు ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. భారత పర్యటన వెనుక ఆయన రాజకీయ లక్ష్యమిదేనని తెలుస్తున్నది. విపరీతమైన ప్రచారం, అట్టహాసం, పెద్దఎత్తున జన సమీకరణ నడుమ ఈ పర్యటన జరుగుతుండటం వెనుక రాజకీయ అవసరాలు ఉన్నాయి.

మరి..భారత్‌ మాటేమిటి?
అమెరికాపై విధిస్తున్న టారీఫ్‌లు, సుంకాలు తొలగించేందుకే ట్రంప్‌ భారత పర్యటన అన్నదాంట్లో ఎవరికీ అనుమానాల్లేవు. అయితే అమెరికా ఏవైతే ప్రయోజనాలు ఆశిస్తుందో…అదే స్థాయిలో భారత్‌ కూడా అమెరికా నుంచి వాణిజ్య ప్రయోజనాలు పొందుతుందా? అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సరైన సమాధానం రావటం లేదు. ‘అమెరికా ఫస్ట్‌’ అనే విధానాన్ని పట్టుకున్న ట్రంప్‌, ఆ దేశ మార్కెట్‌ తలుపులు తెరుస్తాడని మన పాలకులు ఆశించటం అమాయకత్వమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్‌తో తెగతెంపులు
వేల సంవత్సరాలుగా ఇరాన్‌-భారత్‌ మధ్య చక్కటి వర్తకవాణిజ్య సంబంధాలున్నాయి. ఆధునికకాలంలో ముఖ్యంగా ముడిచమురును ఇరాన్‌ నుంచి భారత్‌ పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. చమురు దిగుమతి విషయంలో భారత్‌కు ఇరాన్‌ ఎన్నో మినహాయింపులు ఇచ్చింది. వేల కోట్ల రూపాయలు చెల్లింపులు పేరుకుపోయినా ఇరాన్‌ ఓపికపట్టింది. నాలుగేండ్ల కిందట రూ.60వేల కోట్ల చమురుబిల్లు ఎంతో ఆలస్యంగా చెల్లించినా భారత్‌తో మంచి సంబంధాల్ని ఇరాన్‌ నెరిపింది. డాలర్లు లేకపోతే…రూపాయిల్లో చెల్లించే సౌలభ్యం భారత్‌కు ఇచ్చింది. గోధుమలు, బియ్యం, సుగంధద్రవ్యాలు, పత్తి దిగుమతుల ద్వారా ‘చమురు బిల్లు’ను చెల్లించే అవకాశం ఇచ్చింది. ఇంత చేసినా…అమెరికాకు కోపం వస్తుందని ప్రధాని మోడీ ఇరాన్‌తో వాణిజ్య సంబంధాల్ని దెబ్బతీసుకున్నారన్నది అందరికీ తెలిసిందే.

ట్రంప్‌ షెడ్యూల్‌ ఖరారు
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండు రోజులపాటు భారత్‌లో (ఫిబ్రవరి 24, 25) పర్యటించనున్నారు.
– నేడు ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్‌ చేరుకుంటారు.
– మధ్యాహ్నం 12.15 గంటలకు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
– 1.05 గంటలకు మోతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.
– మధ్యాహ్నం 3.30గంటలకు ఆగ్రా బయల్దేరి సాయంత్రం 5.15 గంటలకు తాజ్‌మహల్‌ సందర్శిస్తారు.
– సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం
– 11గంటలకు హైదరాబాద్‌ హౌస్‌లో ట్రంప్‌, మోడీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం
– 12.40 గంటలకు ఒప్పందాలపై సంతకాలు, మీడియా సమావేశం !
– సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ. రాత్రి 10గంటలకు అమెరికాకు తిరుగుప్రయాణం.

Courtesy Nava Telangana