– టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం
– 43,357 ఓట్ల మెజార్టీ
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ‘కారు’ జోరుకు ‘హస్తం’ నిలబడలేకపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిపై 43,357 ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. గురువారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ గోడౌన్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత కనబర్చారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్‌ నుంచి ప్రతి రౌండ్‌లోనూ 1500 నుంచి రెండు వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధిస్తూ సైదిరెడ్డి దూసుకుపోయారు. సైదిరెడ్డికి 1,12,796, పద్మావతికి 69,563 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి సపవత్తు సుమన్‌కు 2,693, బీజేపీ అభ్యర్థి రామారావుకి 2,689, టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి 1827, సాంబశివగౌడ్‌కు 885, తీన్మార్‌ మల్లన్నకు 894, టి.పండుగౌడ్‌కు 921 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి కంటే తక్కువగా ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితమవ్వగా.. స్వతంత్ర అభ్యర్థి మూడో స్థానం దక్కించుకున్నారు.

Courtesy Nava Telangana