– తెలుగు రాష్ట్రాల్లో కారుకు ఎక్కువ డొనేషన్లు
– గులాబీ పార్టీకి రూ.141.5 కోట్లు.. వైసీపీకి 99 కోట్లకు పైగానే

న్యూఢిల్లీ : మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు.. దేశంలోని రాజకీయపార్టీల విరాళాల విషయంలో సింహభాగమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో అధికార పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీలు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా అధిక మొత్తం నిధులను పొందాయి. 2018-19 ఏడాదికి గానూ టీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.141.5 కోట్ల నిధులు కేవలం ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చి చేరడం గమనార్హం. దీంతో ఎన్నికల బాండ్ల ఆదాయంలో గులాబీ పార్టీ.. రెండు రాష్ట్రాల్లోని మిగతా పార్టీల కంటే ముందున్నది. 2018-19లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇతర రూపాల ద్వారా వచ్చిన విరాళాల మొత్తం రూ.182.67 కోట్లుగా ఉన్నది. అంటే ఇందులో ఎన్నికల బాండ్ల వాటా 77శాతంగా ఉన్నదన్న మాట. ఇక పొరుగు రాష్ట్రం ఏపీలోని అధికార వైసీపీకి 2018-19కి గానూ ఎన్నికల బాండ్ల ద్వారా రూ.99.84కోట్లు వచ్చి చేరాయి. ఆ పార్టీకి ఇతర రూపాల్లో వచ్చిన మొత్తం విరాళాల్లో ఎన్నికల బాండ్ల వాటా 55శాతంగా ఉన్నది. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన నిధులు ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై గోప్యత ఉంటుంది. దీంతో ఈ రెండు పార్టీలకు తమకు వచ్చిన మొత్తం విరాళాల్లో 50శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారానే రావడం ఆసక్తిని కలిగిస్తున్నది.

ఐదు పార్టీలు.. రూ.587 కోట్లు
2018-19 ఏడాదికి సంబంధించి దేశంలోని ఐదు రాజకీయ పార్టీలైన టీఎంసీ, జేడీ(ఎస్‌), వైఎస్సార్‌సీపీ, బీజేడీ, టీఆర్‌ఎస్‌లకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.587 కోట్లు వచ్చి చేరాయి. ఈ ఐదు పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో.. ఎన్నికల బాండ్ల వాటా అధికంగా 50శాతానికి పైగానే ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌(ఈసీ) వద్ద అందుబాటులో ఉన్న ఈ ఐదు పార్టీల ఆడిట్‌ రిపోర్ట్స్‌, ఎన్నికల బాండ్లపై అవి వెల్లడించిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

రూ. 213 కోట్లతో బీజేడీ ముందు
ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ.. రూ.213. 5 కోట్ల మొత్తంతో ఎన్నికల బాండ్ల ద్వారా అధిక నిధులను పొంది ఐదు పార్టీల కంటే ముందున్నది. అంటే ఆ పార్టీకి అందిన విరాళాల మొత్తం రూ.242.86 కోట్లలో.. కేవలం ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చి చేరిన మొత్తం 88శాతం అన్నమాట. ఇక జాతీయపార్టీ అయిన మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ).. ఎన్నికల బాండ్ల ద్వారా ఆర్జించిన మొత్తం రూ.97.28 కోట్లు కాగా, ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాల్లో ఇది 88శాతంగా ఉన్నది. ఇక జేడీ(ఎస్‌) పార్టీకి రూ.35.25 కోట్లు( పార్టీ మొత్తం విరాళాల్లో 88శాతం) వచ్చి చేరాయి. 2018-19కి గానూ ఆరువేల కోట్లకు పైగా విలువ చేసే ఎన్నికల బాండ్లను జారీ చేశారు. అయితే విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఇందులో దాదాపు రూ.4500 కోట్లు విలువ చేసే ఎన్నికల బాండ్లు బీజేపీ ఖాతాలోనే చేరాయి. ఎన్నికల బాండ్ల పుణ్యమా అని ఈ నిధులు కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తల నుంచి బీజేపీకి చేరాయి. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయంలో స్పష్టత, పారదర్శకత లోపించిందని కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈసీ మూడు జాతీయ పార్టీలు(సీపీఐ(ఎం), టీఎంసీ, బీఎస్పీ), మరో 22 రాష్ట్రస్థాయి పార్టీలకు సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్స్‌ను మాత్రమే తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అయితే పైన పేర్కొన్న ఐదు పార్టీలు మాత్రమే తమకు ఎన్నికల బాండ్ల ద్వారా ఎంత మేర నిధులు వచ్చాయన్న విషయాన్ని వెల్లడించాయి.

Courtesy Navatelangana…