• హుజూర్‌నగర్‌లో సీపీఐ సాయం కోరిన టీఆర్‌ఎస్‌
  • రేపు సీపీఐ కార్యవర్గం భేటీ.. నిర్ణయం
  • కమ్యూనిస్టులు ఎప్పుడూ తోక పార్టీలు కాదు
  • సీపీఐ మద్దతిచ్చే పరిస్థితి కనిపిస్తోంది: కేకే
  • కేసీఆర్‌ ప్రజాస్వామికంగా పనిచేయాలి: చాడ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో గెలిచి తీరాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అక్కడ తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌లోని సీనియర్‌ నాయకులు సీపీఐ కార్యాలయానికి తరలి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆదివారం మఖ్దూం భవన్‌కు వెళ్లారు. అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటపాటు చర్చలు జరిపారు. కాగా, అక్టోబరు ఒకటో తేదీ మంగళవారం సీపీఐ కార్యవర్గం సమావేశమై టీఆర్‌ఎస్‌ వినతిపై నిర్ణయం తీసుకోనుంది. అనంతరం ఇరు పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము సీపీఐ కార్యాలయానికి వచ్చామని కేకే వెల్లడించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడంలేదని తెలుసుకుని మద్దతు అడిగేందుకు వచ్చామన్నారు.

కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలు కాదు: కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ తోక పార్టీలు కాదని, కమ్యూనిస్టులను, లెఫ్టిజాన్ని వేర్వేరుగా చూడాలని కేకే అన్నారు. సీపీఐని ఉద్దేశించి గతంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఈ మేరకు జవాబు ఇచ్చారు. హుజూర్‌ నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారుగా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అప్పుడు అలా అన్నాం. ఇప్పుడు ఇలా అంటున్నాం’ అని కేకే బదులిచ్చారు. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో మాత్రం అంతంతమాత్రం బలం కూడా లేని సీపీఐ మద్దతు కోరడాన్ని ఏ విధంగా చూడాలని ప్రశ్నించగా.. ‘మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి’ అని కేకే నవ్వుతూ బదులిచ్చారు. సీపీఐ నాయకుల్లా తాము కరుడుగట్టిన కమ్యూనిస్టులం కాకపోయినా ఇద్దరం పేద ప్రజలు, సమ సమాజం కోసమే పని చేస్తున్నామని చెప్పారు. సీపీఐ ఆలోచనలు, సిద్ధాంతాల్లాగే తమ పార్టీ కూడా ప్రగతిశీలంగానే పని చేస్తోందని అన్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ సహాయ సహకారాలు కావాలని అడిగామని, వాళ్లు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆలోచనలు, ఉద్దేశాలను వారితో పంచుకున్నామని తెలిపారు. పోడు భూముల కోసం, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సీపీఐ పోరాడుతోందని, ఆ రెండు విషయాల్లో తమకు స్పష్టత ఉందని వివరించారు. రెవెన్యూ చట్టంపై సీపీఐ సూచనలను తీసుకుంటామని, చర్చలు జరుపుతామని తెలిపారు.

ఇకనైనా కేసీఆర్‌ ప్రజాస్వామికంగా ఉండాలి: చాడ: టీఆర్‌ఎ్‌సతో తమకు పాత మితృత్వం ఉందని, తెలంగాణ వచ్చిన తర్వాతే తమ మధ్య అగాథం పెరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా తమ పార్టీ టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయలేదని, ఇకమీదటైనా పనిచేయాలని చాడ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ మొత్తానికే బాగా పని చేయడం లేదని తాము ఎప్పుడూ అనలేదన్నారు. ధర్నాచౌక్‌ని కొనసాగించాలని డిమాండ్‌ చేశామని గుర్తు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కేకే పోటీ చేసిన సందర్భంగా అప్పట్లో తమకున్న నలుగురు ఎమ్మెల్యేలూ ఆయనకే ఓట్లు వేశారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ హుజూర్‌నగర్‌లో మద్దతు ఇస్తే బాగుంటుందని తమను టీఆర్‌ఎస్‌ నేతలు కోరారని, పోడు భూములు, రెవెన్యూ చట్టంపై చర్చించామని తెలిపారు.

Courtesy Andhrajyothi..