నాకు మంత్రి పదవి కుల భిక్ష కాదు
తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసింది
రాజకీయాల్లో సొంతంగా ఎదిగాను
నాకు నేనుగా నిలబడతా.. కలబడతా
నా ఇంటి జాగా నా కష్టార్జితమే
హుజురాబాద్‌లో తెరాస శ్రేణుల సమావేశంలో మంత్రి ఈటల

 

మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలిచి కొట్లాడి సాధించిన తెలంగాణలో గులాబీ జెండాకు ఓనర్లం తామేనన్నారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుందన్నారు. తనపై కొందరు దురుద్దేశపూర్వకంగా చిల్లర మల్లర విమర్శలు చేస్తున్నారని.. ఏది ధర్మమో.. ఏది న్యాయమో అనేది ప్రజలకు తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించాలని కుహనా వాదులు, కుసంస్కారులు, సొంతంగా ఎదగలేనివారు కుట్రలు పన్నినా ప్రజలు ఆదరించారన్నారు. కోట్ల రూపాయలు సంపాదించానని కరపత్రాలు ముద్రించి దుష్ప్రచారం చేయాలని చూశారని ఆయినా తాను ధర్మం తప్పలేదన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో పలువురు నాయకులు పార్టీలో చేరిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఇన్నాళ్ల నా రాజకీయ జీవితంలో నేను రూ.5 వేలు లంచంగా తీసుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఆ కాలంలోనే మాకు ఆస్తులున్నయనేది అందరికీతెలుసు. హైదరాబాద్‌లో పౌల్ట్రీ రంగంలో రాణించిన. 10 లక్షల కోళ్లను పెంచిన. నేను మంత్రినే అయినా నా భార్య, కొడుకు సద్దికట్టుకుని పౌల్ట్రీఫారం కాడికి పోతున్నరు. ఆపదలో నా వద్దకు వచ్చే వారికి సాయం చేస్తున్న వ్యక్తిని నేను. ఇలాంటి మమ్మల్ని పట్టుకుని ఇంత ఆస్తి ఎట్లొచ్చిందని అంటున్నరు. చిల్లరమల్లర వాళ్లు చేసే విమర్శలకు ప్రజలే గుణపాఠం చెబుతరు.

నాకు నేనుగా నిలబడతా.. నాకు నేనుగా కలబడతా 
నన్ను ప్రజలు ఆశీర్వదించి ఆరు సార్లు ఈ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. మా అమ్మా నాన్న రాజకీయాల్లో లేరు. నాకు నేనుగా వచ్చిన.. నాకు నేనుగా నిలబడతా.. నాకు నేనుగా కలబడతా. లక్షల మందితో కలిసి తెలంగాణ గడ్డమీద ఉద్యమం చేసిన బిడ్డలం మేము. నన్ను చంపాలని రెక్కీలు నిర్వహించినప్పుడు చంపుతవా.. అని ఎదురుగా నిలబడిన. ఇయ్యాల్ల పైసల గురించి మాట్లాడుతున్నరు. నేను ఇల్లుకట్టుకున్న జాగ నా చెమట ఫలం. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దగ్గరికి పోయి నా భూమి గుంజుకోవద్దని చెప్పిన. నా భూమి కాపాడు, నేను పార్టీ మారుతా అని చెప్పలే. అసెంబ్లీ వేదికగా రాజశేఖర్‌రెడ్డికే నేను తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని గెలిచిన అని చెప్పిన. తెలంగాణ మీద వెలిగే దీపమే నేను. తెలంగాణ గడ్డమీద చిల్లరమల్లర మాటలకు భయపడను’ అని మంత్రి ఈటల అన్నారు.

మా నాయకుడు కేసీఆరే
నా మాటల్ని కొందరు వక్రీకరించారు
హుజురాబాద్‌ ప్రసంగంపై  రంధ్రాన్వేషణ తగదు: ఈటల
సభ అనంతరం ప్రకటన విడుదల
హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ నాయకుడు కాసిపేట శ్రీనివాస్‌ చేరిక సందర్భంగా తాను చేసిన ప్రసంగాన్ని కొన్ని ప్రసార, సామాజిక మాద్యమాలు వక్రీకరించడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. తాను గులాబీ సైనికుడినని, తమ నాయకుడు సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. తనపై నిరాధార ప్రచారం ఆపాలని, సామాజిక మాధ్యమాలు సంయమనం పాటించాలని అన్నారు, హుజురాబాద్‌లో ఆయన చేసిన ప్రసంగంపై ఈ మేరకు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను పార్టీలో చేరిననాటి నుంచి  ఇప్పటి వరకు గులాబీ సైనికుడిగానే ఉన్నాను. కేసీఆర్‌ నేతృత్వంలో పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో కొన్ని వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్క సామాజిక వర్గానికే ప్రతినిధిని అన్నట్టు, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే నేను గురువారం హుజురాబాద్‌లో మాట్లాడాను. ఇటీవల ఒక పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని మా పార్టీ నాయకుడొకరు ఈ రోజు వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను వ్యాఖ్యలు చేశాను. దీనిపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇది సరికాదు. ఆనాడు పార్టీ మారాలని వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అనేక రకాలుగా ఒత్తడి తెచ్చినా లొంగని వ్యక్తిని. నాపై నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలి. నా ప్రసంగ పాఠాన్ని వారు పూర్తిగా చూడాలి’ అని పేర్కొన్నారు.

(Courtacy Eenadu)