• మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య కూడా
 • 25 మంది పోలీసు అధికారుల పేర్లూ
 • సమాచార హక్కు చట్టం కింద వెల్లడి
 • డైరీ మొత్తం బయట పెట్టాల్సిందే
 • ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డిమాండ్‌

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మూడేళ్ల పాటు సాగిన కేసు విచారణకు సంబంధించి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ కేసులో ఇప్పటి వరకు బయటకు రాని రాజకీయ నాయకుల పేర్లు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో పాటు, పోలీస్‌ శాఖలో గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన వారి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. 2016 ఆగస్టులో నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, పోలీస్‌ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో నయీంతో పాటు, గ్యాంగ్‌ సభ్యులపై 250 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 107 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. మరో ఎనిమిది కేసుల్లో విచారణ పూర్తయింది. పది కేసుల్ని మూసేశారు. 17 కేసుల్లో విచారణ పూర్తిచేసి తుది నివేదికను సిద్ధం చేశారు. మూడు కేసుల్లో న్యాయసలహా మేరకు చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరో తొమ్మిది కేసులకు సంబంధించి దర్యాప్తు కీలక దశలో ఉంది. మిగతా కేసుల్లో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. రాజకీయ నాయకుల ప్రమేయంపై 8 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయగా కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మరో 35 కేసుల్లో సిట్‌ విచారణ కొనసాగుతోంది. నయీం కేసుల్లో సిట్‌ ఇప్పటివరకు రూ.2.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు, 1015 ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకొని, కోర్టులో సమర్పించింది. సరూర్‌నగర్‌, శంషాబాద్‌, సిద్దిపేట్‌ వన్‌ టౌన్‌, అచ్చంపేట్‌, వెల్డండ, మునుగోడు, చందంపేట్‌, తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 2003 నుంచి 2005 మధ్యకాలంలో నయీంపై నమోదైన ఎనిమిది కేసుల్ని పోలీ్‌సలు మూసివేశారు.

రాజకీయ నాయకులు

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సేకరించిన సమాచారం ప్రకారం భువనగిరి జడ్‌పీటీసీ సభ్యుడు సుధాకర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, వలిగొండ ఎంపీపీ నాగరాజు, భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌, బీబీనగర్‌ మాజీ సర్పంచ్‌ జి.పింగళరెడ్డి, వెల్దండ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లి ఈశ్వరయ్య, వెల్దండ మాజీ ఎంపీటీసీ వి.సంజీవలకు నయీంతో సంబంధాలు ఉన్నాయి. వీరంత గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. భువనగిరి ఎంపీపీ వెంకటేష్‌ గతంలో కాంగ్రె్‌సలో ఉండి ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే(ఎల్బీనగర్‌, టీడీపీ) ఆర్‌.కృష్ణయ్య పేరు కూడా జాబితాలో ఉంది. వీరిలో కొందరి పేర్లు గతంలోనే బయటకు వచ్చినా నయీం కేసుల్లో ప్రమేయం ఉన్న అందరి పేర్లు బయటకు రావడం ఇదే మొదటిసారి.

పోలీస్‌ అధికారులు

నయీంతో సంబంధాలున్న పోలీసుల జాబితాలో అడిషనల్‌ ఎస్పీలు ఎం.శ్రీనివా్‌సరావు, ఎం.చంద్రశేఖర్‌, డీఎస్పీలు సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎం.శ్రీనివా్‌సరావు, టి.సాయిమనోహర్‌, జి.ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య, జి.అమరేందర్‌రెడ్డి, తిరుపతన్న, ఇన్‌స్పెక్లర్లు మస్తాన్‌, బి.రాజగోపాల్‌, జి.వెంకటయ్య, శ్రీనివాస నాయుడు, కిషన్‌, ఎస్‌. శ్రీనివాసరావు, కె.వెంకట్‌రెడ్డి, మహ్మద్‌ మాజిద్‌, వెంకట సూర్యప్రకాష్‌, రవి కిరణ్‌ రెడ్డి, బలవంతయ్య, నరేందర్‌గౌడ్‌, ఈ.రవీందర్‌ ఉన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లు దినేష్‌ ఆనంద్‌, సాదత్‌ మియా, కానిస్టేబుల్‌ బాలయ్య నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత సిట్‌ విచారణ ప్రారంభించి మూడేళ్లు అయిందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సభ్యుడు పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ కేసులో రాజకీయ, పోలీస్‌, రెవెన్యూ విభాగాలు చట్ట వ్యతిరేక శక్తితో చేతులు కలిపాయని చెప్పారు. ‘‘నయీం ఇంటిని పోలీసులు సోదా చేసినపుడు మీడియాను అనుమతించలేదని, ఇంట్లోంచి బయటకు వస్తున్న ఇద్దరు పోలీసులను ప్రశ్నించగా, లెక్క పెట్టలేనంత డబ్బు ఉందని, రెండు యంత్రాలు తెప్పించి కౌంటింగ్‌ చేశారు. చివరకు సిట్‌ కేవలం రూ.3.74 లక్షలు మాత్రమే దొరికాయని తేల్చారు’’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరగా .. ప్రభుత్వం నిరాకరించిందని గుర్తు చేశారు.

ఫోరం ప్రశ్నలు
 1. నయీం ఇంట్లో 2.16 కోట్ల నగదు లభించినట్లు అధికారులు చెప్పారు. అప్పటి హోంమంత్రి 2.95 కోట్ల నగదు జప్తు చేసినట్లు అసెంబ్లీలో తెలిపారు. నిజమేంటి?
 2. సిట్‌ నివేదిక ప్రకారం అతనిపై 250 కేసులు నమోదై ఉన్నాయి. నయీం ఇన్ని నేరాలు చేస్తుంటే పోలీసు శాఖ ఏం చేస్తోంది?
 3. 2003 నుంచి 2005 వరకు నయీంపై 8 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వాటిని ఉపసంహరించారు. ఎందుకు?
 4. నయీంతో సంబంధం ఉన్న నేతలు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సకు వచ్చారు. వారిపై విచారణ జరగకపోవడానికి కారణాలేంటి?
 5. 25 మంది పోలీసులకు నయీంతో సంబంధాలున్నాయి. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
 6. రూ.500 కోట్ల విలువైన వెయ్యి ఎకరాలు ఆక్రమించాడు. పోలీసు, రాజకీయ ప్రమేయం లేకుండానే కాజేశాడా?
 7. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల పాత్రను ఎందుకు దర్యాప్తు చేయలేదు?
 8. నయీం డైరీ ఎందుకు రహస్యం?
డైరీలోనే అసలు గుట్టు

నయీం కేసులో అతని ఇంట్లో పోలీ్‌సలు స్వాధీనం చేసుకున్న డైరీ అత్యంత కీలకంగా మారింది. భద్రతా కారణాల వల్ల డైరీలోని అంశాల్ని బహిర్గతం చేసేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. డైరీలో అంశాలు వెలుగులోకి వస్తే తనతో అంటకాగిన నేతలు, పోలీసులు, ఆయా రంగాలకు చెందిన వారి పేర్లు బయట పడతాయని భావిస్తున్నారు. అయితే 8(1)(జీ అండ్‌ హెచ్‌) ప్రకారం సమాచారం బహిర్గతం చేయడం కుదరదని పోలీ్‌సలు సమాధానం ఇచ్చారు.
                                                                                             

(Courtacy Andhrajyothi)