వెయ్యిస్తా రాత్రికొస్తారా.. మీ స్నేహితుల్ని పంపిస్తారా
సిరిసిల్ల హాస్టల్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులు
టీఆర్‌ఎ్‌సనేత/క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ నిర్వాకం
సహకరించిన వంటమనిషి.. ఇద్దరూ అరెస్ట్‌
హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌.. సిరిసిల్లలో ఆందోళనలు
జనగామ టీఆర్‌ఎస్‌ నేత వెకిలిచేష్టలు
నగ్న వీడియోలు పంపాలని యువతులకు వేధింపులు
వీడియోకాల్స్‌ పోర్న్‌ సైట్లలో పెడతానని బెదిరింపులు

సిరిసిల్ల, లింగాలఘణపురం : ఆ హాస్టల్లోని క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ పేరు చెబితేనే అక్కడి విద్యార్థినులు హడలిపోతారు. హాస్టల్లో అతడు ఎప్పుడంటే అప్పుడు స్వేచ్ఛగా తిరుగుతాడు. విద్యార్థినుల గదులకు వెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడతాడు. ‘రూ.1000 ఇస్తా. రాత్రికి వచ్చేయండి. లేదంటే మీ స్నేహితురాళ్లెవరికైనా చెప్పి ఒప్పించండి’ అంటూ జుగుప్సాకంగా మాట్లాడతాడు! మరో ఘటనలో రుణాలిప్పిస్తానంటూ సామాజిక మాధ్యమాల వేదికగా యువతుల పట్ల ఒకడు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. వారి ఫోన్లకు పోర్న్‌ వీడియోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ రెండు  ఘటనల్లోనూ నిందితులు, టీఆర్‌ఎ్‌సలో చోటామోటా నేతలుగా చెలామణి అవుతున్నవారే!

సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న దేవయ్య, అక్కడ పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అతడికి అక్కడ వంట మనిషిగా పనిచేస్తున్న విజయమ్మ సహకరించింది. దేవయ్య వెకిలిచేష్టలకు విద్యార్థినులు భోరుమంటే, ‘డబ్బులు ఇస్తానంటున్నాడు కదా?’ అంటూ దేవయ్యకు వత్తాసుగా మాట్లాడేది. దేవయ్య, విజయమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. హాస్టల్‌ వార్డెన్‌ భూదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేస్తూ సిరిసిల్లలో వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ అనుచరులే హాస్టల్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి లాగుతున్నారని ఆరోపిస్తూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మాట వినకపోతే వీడియోలు అప్‌లోడ్‌ చేస్తా..
టీఆర్‌ఎస్‌ నాయకుడిగా చెలామణి అవుతున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగులకు చెందిన కందగట్ల భాస్కర్‌పై ఐదుగురు యువతులు, హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్సిడీ రుణాలను ఇప్పిస్తానని నమ్మబలికి తమను లైంగికంగా వేఽధిస్తున్నాడని ఆరోపించారు. తన మాట వినకపోతే  తనతో మాట్లాడిన సంభాషణల తాలుకు ఆడియో, వీడియోక్లిప్పింగ్‌లను పోర్న్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం సీఐ మహిపాల్‌ వెల్లడించారు. భాస్కర్‌, రెండేళ్లక్రితం బీసీ కార్పొరేషన్‌లో సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల ఫోన్‌ నంబర్లను సేకరించి ఫోన్‌ చేసేవాడు. రుణాలిప్పిస్తాడనే ఆశతో కాస్త చనువుగా మాట్లాడిన యువతులను నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలంటూ లైంగికంగా వేధించేవాడు. సోమవారం నేలపోగులలో భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Courtesy Andhrajyothi