మేయర్‌, చైర్మెన్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యం
– పలు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌, కమలం దోస్తీ
– చౌటుప్పల్‌లో మద్దతు ఇవ్వనందుకు సీపీఐ(ఎం)పై దాడి
– అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయంతో పాటు పోలీసులపై రాళ్లు
– ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కార్యకర్తల వీరంగం
– బలంలేని చోటా చక్రం తిప్పిన అధికార పార్టీ

పురపాలక ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం కనబరిచిన అధికార పార్టీ మేయర్‌, చైర్మెన్‌ ఎన్నికలోనూ దూసుకుపోయింది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌.. రెండు మూడు స్థానాల్లో నిలిచిన మునిసిపాలిటీల్లోనూ పాగా వేసింది. ఎక్స్‌అఫిషియా ఓట్ల అస్త్రంతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీ అభ్యర్థులు ఫిరాయించడంతో కొన్నిచోట్ల ఫలితాలే తారుమార య్యాయి. కమలంతో కపట నాటకమాడిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం నాలుగు పీఠాలను కైవసం చేసుకోగా.. చౌటుప్పల్‌లో మద్దతు ఇవ్వనందుకు బీజేపీతో కలిసి సీపీఐ(ఎం) అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయంపై దాడులకు దిగింది. ఎమ్మెల్యే రాజగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు రాళ్లదాడులకు దిగారు. పోలీసుల వాహనంపై రాళ్లు విసరడంతో లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. మరోవైపు నేరెడుచర్ల, యాదాద్రిలో ఎక్స్‌ అఫిషియో ఓట్ల వివాదం తలెత్తడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక మేయర్‌, చైర్మెన్‌ పదవుల విషయంలో తమను మోసం చేశారని అధికార పార్టీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో తొలుత సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేసిన ఆ పార్టీ నేతలు, తదనంతరం జిందాబాద్‌ అనుకుంటూ వెళ్లడం కొసమెరుపు.

మేయర్‌, చైర్మెన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మొత్తం 110 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 మున్సిపాలిటీలను దక్కించుకుంది. పలు వివాదాల వల్ల నేరెడుచర్ల, మేడ్చల్‌ ఎన్నిక వాయిదా పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో అన్ని మునిపాలిటీలనూ టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 118 మున్సిపాలిటీల్లో పాలకవర్గం సోమవారం కొలువుదీరగా చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌కు పుర పీఠం దక్కడం లేదన్న ఆగ్రహంతో నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీరంగం సృష్టించారు. ఎన్నికల అనంతరం బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్‌కు చైర్మెన్‌ ఎన్నిక విషయంలో సీపీఐ(ఎం) టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ రెండు పార్టీల కార్యకర్తలు సీపీఐ(ఎం) అభ్యర్థులు, పార్టీ కార్యాలయాలు, నేతల ఇండ్లను ధ్వంసం చేశారు. చైర్మెన్‌ ఎన్నిక కోసం సీపీఐ(ఎం) కౌన్సిలర్లను హాల్‌లోకి వెళ్లకుండా గేట్‌ వద్ద ఎమ్మెల్యే, బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీపీఐ(ఎం) 9వ వార్డు కౌన్సిలర్‌ దండ హిమబిందుపై కాంగ్రెస్‌ మహిళా కౌన్సిలర్లు మూకుమ్మడిగా కింద పడేసి పిడిగుద్దులు గుద్దారు. అడ్డుకునేందుకు యత్నించిన సీపీఐ(ఎం) శ్రేణులపై కాంగ్రెస్‌, కమలం పార్టీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. పోలీసులు రక్షణ కల్పించి సీపీఐ(ఎం) కౌన్సిలర్లను సమావేశ మందిరంలోకి పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ ఒకవైపు, సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మరోవైపు నిలబడి ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లను వెంట బెట్టుకొని హాల్‌లోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల అధికారి చేతిలోంచి ప్రమాణ పత్రాలను గుంజుకొని చించేశారు. సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో వాగ్వావాదానికి దిగి, ఒకర్నొకరు తోసుకున్నారు. ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకోగా పోలీస్‌ వాహనంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు సీపీఐ(ఎం) కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.

కార్యాలయంలో అద్దెకున్న దుకాణాల అద్దాలను ధ్వంసం చేశారు. సీపీఐ(ఎం) 17వ వార్డు కౌన్సిలర్‌ గోపగోని లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లి కిటికీ అద్దాలు, ఫర్నీచర్‌, బుల్లెట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. అక్కడ్నుంచి సీపీఐ(ఎం) 9వ వార్డు కౌన్సిలర్‌ దండ హిమబిందు అరుణ్‌కుమార్‌ ఇంటిపైనా దాడి చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్ల దాడిలో పలువురు పోలీస్‌ కానిస్టేబుళ్లు, సీపీఐ(ఎం) కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడి చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్‌ అన్నారు. నేడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చౌటుప్పల్‌కు రానున్నట్టు తెలిపారు. అదేవిధంగా నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రాంచంద్రరావు ఎక్స్‌ అఫిషియో ఓటు వేసేందుకు రాగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు స్థానిక అధికారులకు అందలేదని అంగీకరించలేదు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఉన్నతాధికారులు ఓటు హక్కుకు ఆదేశాలివ్వడంతో స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎమ్మెల్యే అక్కడున్న కుర్చీలు, మైక్‌ విసిరేసి, కాగితాలు చించేసి తన పార్టీ కౌన్సిలర్లను వెంటబెట్టుకొని బయటకు వెళ్లిపోయారు. గొడవ కారణంగా ఎన్నిక నేటికి వాయిదా వేయడంపై ఎంపీ ఉత్తమ్‌ అక్కడే బైటాయించారు.

యాదాద్రిలో టీఆర్‌ఎస్‌కు నాలుగు స్థానాలు రాగా ఒక ఇండిపెండెంట్‌ మద్దతు తీసుకొంది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్‌ అఫిషియో ఓటును నమోదు చేసుకొంది. టీఆర్‌ఎస్‌ బలం ఆరు మాత్రమే ఉందనుకొని కాంగ్రెస్‌ కూటమికి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు చైర్మెన్‌ ఎన్నికకు హాజరయ్యారు. తర్వాత ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా గులాబీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, కడియం శ్రీహరిలు నమోదు చేసుకున్నట్టు ఎన్నికల అధికారి భూపాల్‌రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. ఆదివారం రాత్రి వరకు కేవలం ఎమ్మెల్యే సునీత మాత్రమే ఎక్స్‌ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నదని గెజిట్‌ ప్రదర్శించిన అధికారులు తెల్లారేసరికి మాట మార్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రమాణ స్వీకారం తర్వాత హాల్‌లో నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. డోర్లు పెట్టి చైర్మెన్‌ ఎన్నిక ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ కౌన్సిలర్లను బయటకు పంపించడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కాంగ్రెస్‌ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద రాస్తారోకో చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఎన్నిక అనంతరం ఎంపీ వెళ్తుండగా టీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేయడంతో ఆయన కారు దిగొచ్చాడు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భుజానికి స్వల్పగాయమైంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తుక్కుగూడ మున్సిపాలిటీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ నాయకులు శ్రీరాములు యాదవ్‌, హర్షవర్దన్‌, హేమాలత, రాజులను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎక్స్‌అఫిషియో, ఫిరాయింపులతో కైవసం
నల్లగొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు ఎనిమిది మున్సిపాటిల్లో పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఉంది. 6 కేంద్రాల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లతో బయటపడగా, చౌటుప్పల్‌లో మాత్రం సీపీఐ(ఎం) సపోర్టుతో గట్టెక్కింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌కు 5, కాంగ్రెస్‌ కూటమికి 7 స్థానాలు వచ్చాయి. ఎక్స్‌అఫిషియోగా ముగ్గురు ఓట్లు వేయడంతో ఆ పార్టీ మున్సిపల్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. భువనగిరిలో టీఆర్‌ఎస్‌కు 15, కాంగ్రెస్‌కు 11, బీజేపీకి 7, ఇండిపెండెంట్‌కు 2 స్థానాలు రాగా ఎక్స్‌అఫిషియో రెండు ఓట్లతో బయటపడ్డారు. చిట్యాలలో టీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 6 స్థానాలు గెలుచుకోగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటుతో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. హాలియాలో కాంగ్రెస్‌ 6, టీఆర్‌ఎస్‌ 5, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించగా ఇండిపెండెంట్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. ఎక్స్‌అఫిషియోగా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓటు వేయడంతో ఆ స్థానాన్ని గులాబీ వశమైంది. సూర్యాపేటలో 48వార్డులకు టీఆర్‌ఎస్‌ 24 స్థానాల్లో గెలుపొందగా.. ముగ్గురు స్వతంత్రులతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటుతో గట్టెక్కింది. చౌటుప్పల్‌లో మొత్తం 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ 8, సీపీఎం 3, కాంగ్రెస్‌ 5, బీజేపీ 3, ఒకటి ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించగా టీఆర్‌ఎస్‌కు ముగ్గురు సీపీఐ(ఎం) అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ బయటపడింది. నేరేడుచర్లలో హంగ్‌ ఏర్పడటంతో రసవత్తరంగా మారింది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌ ఓటేయడంతో టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. చేర్యాలలో 12 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌5, ఇండిపెండెంట్లు 2 గెెలవగా ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌లోకి రావడంతో చైర్మెన్‌ పదవి దక్కించుకుంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌లో 9, స్వతంత్రులు 10, బీజేపీ 1 గెలుపొందారు. స్వతంత్రులు టీఆర్‌ ఎస్‌లో చేరడంతో ఏకపక్షమైంది. అమరచింతలో 3, అయిజలో 6, కొల్లాపూర్‌లో కేవలం 9 స్థానాలే దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ తన వ్యూహ రచనతో వాటిని కైవసం చేసుకుంది. కోస్గిలో 16 స్థానాల్లో కాంగ్రెస్‌ 7, టీఆర్‌ఎస్‌ 7 గెలుచుకోగా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో పాగా వేసింది. రంగారెడ్డి జిల్లా 12 మునిసిపాలిటీల్లో నాలుగింట్లో ఆధిక్యం సాధించిన టీఆర్‌ఎస్‌.. మరో నాలుగింట్లో చక్రం తిప్పింది. ఆదిబట్ల, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట్‌లోనూ తక్కువ స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌.. ఎక్స్‌అఫిషియో ఓట్లకు తోడు ఇతరులు గులాబీలోకి ఫిరాయించడంతో చైర్మెన్‌ పదవులు దక్కించుకున్నారు. మణికొండలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌కు చైర్మెన్‌, బీజేపీ వైస్‌చైర్మెన్‌ పదవులను పంచుకున్నారు.

తొలుత సీఎం డౌన్‌డౌన్‌.. తరువాత జిందాబాద్‌
‘నా భార్యకు మేయర్‌ సీటు ఇస్తానని మోసం చేశారు’ అంటూ నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మాజీ కార్పొరేటర్‌ దండుశేఖర్‌.. తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ‘సీఎం కేసీఆర్‌ డౌన్‌డౌన్‌, కేటీఆర్‌, ఎమ్మెల్యే బిగాల డౌన్‌డౌన్‌’ అంటూ నినదించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా 15వ డివిజన్‌ నుంచి గెలుపొందిన లావణ్యను ప్రకటించనున్నారని ప్రచారం కావడంతో దండుశేఖర్‌ తన అనుచరులతో కలిసి డీఈవో కార్యాలయ సమీపంలో ఆందోళన చేపట్టారు. చివరకు ఆయన భార్య నీతు కిరణ్‌నే మేయర్‌గా ప్రకటించడంతో కేసీఆర్‌ జిందాబాద్‌, కేటీఆర్‌, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోవడం కొసమెరుపు.

సీఎం ఇలాకాలో ఆందోళనలు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 15 మున్సిపాలిటీల్లో చైర్మెన్ల, వైస్‌చైర్మెన్ల పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నా పదవుల విషయంలో ఆందోళనలు జరిగాయి. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లో చైర్మెన్‌ అభ్యర్థి నారాయణరెడ్డిని ఎన్నికల ముందే ప్రకటించగా సీల్డ్‌ కవర్‌లో ఎంసీ రాజమౌళి పేరు ఉండడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. 12వ వార్డు నుంచి గెలుపొందిన నారాయణరెడ్డి తన కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మెదక్‌లో కాంగ్రెస్‌ నుంచి వలసొచ్చిన చంద్రపాల్‌కు పదవి కేటాయించడంతో మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ మల్లికార్జున్‌ వర్గీయులు అడ్డుకున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో చైర్మెన్‌ పదవిని ఆశించిన శ్రీశైలంగౌడ్‌ను కాదని కాంగ్రెస్‌ నుంచి వచ్చిన బొంది రాఘవేంద్రను ఎన్నుకోవడంతో శ్రీశైలం గౌడ్‌ మద్దతుదారులు ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ముందుగా చైర్మెన్‌ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రారెడ్డి పేరు కాకుండా కొలన్‌ రోజా రాణికి ఇవ్వడంతో చంద్రారెడ్డి, రోజారాణి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పర్యవేక్షించారు.

ఎన్నికలో గందరగోళం.. రెబెల్స్‌ దిక్కు
మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మెన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కాస్త గందరగోళం మధ్య జరిగింది. 36 వార్డులుండగా ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాలేదు. 14 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చైర్మెన్‌ ఎన్నికను వాకౌట్‌ చేయగా మిగిలిన 22 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో చైర్మెన్‌గా పెంట రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌చైర్మెన్‌గా ముఖేష్‌గౌడ్‌ను ప్రతిపాదించగా అదే పార్టీకి చెందిన మాదంశెట్టి సత్యనారాయణ తనకు ఆ పదవి ఆశ చూపారంటూ వాకౌట్‌ చేశారు. నస్పూర్‌ మున్సిపాలిటీలో చైర్మెన్‌ ఎన్నిక ఉద్రిక్తత మధ్య కొనసాగింది. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులుండగా ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం టీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ దిక్కయ్యారు. 10 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతోపాటు నలుగురు స్వతంత్రులు, ఎమ్మెల్యే దివాకర్‌రావు ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఓటు వేయడంతో చైర్మెన్‌గా ఈసంపల్లి ప్రభాకర్‌ ఎన్నికయ్యారు. రెబెల్‌ అభ్యర్థి తోట శ్రీనివాస్‌కు వైస్‌ చైర్మెన్‌ పదవి దక్కింది.

(Courtesy Nava Telangana)