1969లోనైనా, 1996-2014 కాలంలోనైనా నిరుద్యోగ యువతను, విద్యార్థులను, విద్యావంతులను ఎక్కువగా ఆకర్షించినదీ, భాగస్వామ్యానికి కారణమైనదీ నియామకాలు. ఆ రంగంలో ఏమి జరిగింది, ఏమి జరుగుతున్నది, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయి తీవ్రంగా ఆలోచించవలసి ఉంది. తెలంగాణొస్తే ఏమొచ్చింది అనే ప్రశ్నకు కీలకమైన జవాబు దొరికేది ఆ రంగంలో మాత్రమే.

తెలంగాణ ప్రజల చిరకాల లక్ష్యం, లక్షలాది మంది ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమ పర్యవసానం, వందలాది మంది యువకుల ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు నిండింది. అందువల్ల ఇది తప్పనిసరిగా విజయోత్సవ వేళ నిజమే గాని, ఆ ప్రజల చిరకాల లక్ష్యాలలో, భాగస్వాముల స్వప్నాలలో, బలిదానాలకు కారణమైన ఆకాంక్షలలో ఎన్ని నెరవేరాయి, ఎంతవరకు నెరవేరాయి, నెరవేరకపోతే ఎందుకు నెరవేరలేదు అనే వాస్తవిక అంచనా లేకుండా విజయోత్సవాలు భజన కార్యక్రమాలుగా మాత్రమే మిగిలిపోతాయి.

ఇంత కొవిడ్‌ మహావిపత్తు భయానక స్థితిలో కూడా భజన కార్యక్రమాలు యథావిధిగా నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి గనుక ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ఎంత చేదుగా ఉన్నా వాస్తవ స్థితిని చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ రాజుగారి దేవతావస్త్రాల గుట్టు విప్పవలసిన అమాయక బాలల అవసరం ఇతోధికంగా పెరిగిన దుస్థితి ఉన్నది.

తెలంగాణ ఉద్యమమంటే, తెలంగాణ ప్రజా ఆకాంక్షలంటే ఏమిటనే మౌలిక ప్రశ్నకు జయశంకర్‌గారు ఇచ్చిన ఎల్లకాలానికీ వాస్తవమైన సమాధానమే ఎవరికైనా గీటురాయి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనే ఆ మౌలికాంశాలలో నీరు సెంటిమెంటుగా, కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టి, అందులో ముడుపులు సంపాదించేదిగా మారిపోయింది. ఉత్తర తెలంగాణకూ దక్షిణ తెలంగాణకూ మధ్య అసమానత పెంచేదిగా మారిపోయింది. ఒక ప్రచారార్భాటంగా మారిపోయింది. ఆ వివరాలు రాయాలంటే ఒక గ్రంథమే అవుతుంది. ఇక నిధులు అంటే ఎడాపెడా, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా లేనంతగా అప్పులు తెచ్చి, భవిష్యత్తరాల ప్రజల మీద కూడా భారం మోపేదిగా, ప్రజా అవసరాలకూ, ఆశ్రితుల అవసరాలకూ తేడా చూపనిదిగా, సొంత బొక్కసాలు నింపుకోవడమే పాలనా పరమావధిగా మారిపోయింది. ఆత్మగౌరవం సగం అమలులోకి వచ్చి కుంటుతూ నడుస్తున్నది. ఆరు సంవత్సరాల ప్రగతి ఇది.

ఇక ఆ నాలుగు అంశాలలోకీ ప్రధానమైనదీ, 1969లో నైనా, 1996-2014 కాలంలోనైనా నిరుద్యోగ యువతను, విద్యార్థులను, విద్యావంతులను ఎక్కువగా ఆకర్షించినదీ, భాగస్వామ్యానికి కారణమైనదీ నియామకాలు. ఆ రంగంలో ఏమి జరిగింది, ఏమి జరుగుతున్నది, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయి తీవ్రంగా ఆలోచించవలసి ఉంది. తెలంగాణొస్తే ఏమొచ్చింది అనే ప్రశ్నకు కీలకమైన జవాబు దొరికేది ఆ రంగంలో మాత్రమే. ఉద్యోగ కల్పనరంగంలో ఈ ఆరేండ్లలో ఎంతో జరిగిపోయిందని పాలకులూ వారి సమర్థకులూ ఎన్నెన్నో అబద్ధాలను, అర్థసత్యాలను, అతిశయోక్తులను, నిర్ధారించడానికి వీలులేని తప్పుడు అంకెలను ఎడాపెడా ప్రచారంలోకి తెస్తూ, ప్రగల్భాలు పలుకుతున్న సందర్భంలో వాస్తవాలు చెప్పుకోవలసి ఉంది.

ఉద్యమకాలంలో మాట్లాడిన మాటలను తుడిచెయ్య డానికి, మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గనుక అక్కడే మొదలుపెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల సంఖ్య పదమూడు లక్షలని, జనాభా ప్రాతిపదికన తెలంగాణ బిడ్డల వాటా ఐదు లక్షల ముప్పై వేలని, కాని ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణ బిడ్డలు రెండున్నర లక్షలకు మించి లేరని జయశంకర్‌ అనేక చోట్ల రాశారు, అన్నారు. అప్పటి తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు సి.విఠల్‌ ”రాష్ట్రం మొత్తం ఉద్యోగులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,50,000. గిర్‌ గ్లాని రిపోర్టు ప్రకారం 1,87,000మంది మాత్రమే తెలంగాణ ఉద్యోగులున్నారు.. తెలంగాణలో ఐదు లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. అంటే ఇంకా మూడు లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు..” అని ప్రశ్నించారు.

ఈ రెండు ఉటంకింపులు కూడా 2004 నాటివి. అంటే ఆనాటికి జయశంకర్‌ లెక్క ప్రకారం రెండు లక్షల ఎనబై వేల మంది, విఠల్‌ లెక్క ప్రకారం మూడు లక్షల పదమూడు వేల మంది తెలంగాణేతరులు తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలలో ఉన్నారు. పదేండ్ల తర్వాత, తెలంగాణ ఏర్పడినప్పుడు, ఈ అంకెల్లో స్వల్పమైన తేడాలుంటే ఉండవచ్చునుగాని ప్రధాన ధోరణి మారి ఉండదు. రాష్ట్ర విభజనతో తెలంగాణేతరులు వెళ్లిపోతే ఆమేరకు తెలంగాణ బిడ్డలకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల పదమూడు వేల వరకు ఉద్యోగాలు రావలసి ఉండింది. కాని తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకు, 2014 నవంబర్‌ 24న రాష్ట్ర శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి ఉపన్యాసంలో ప్రకటించిన ప్రభుత్వోద్యోగాల ఖాళీల సంఖ్య 1,07,744. ”ఈ 1,07,744 ప్రభుత్వోద్యోగాల ఖాళీలను రెండు సంవత్సరాల్లో భర్తీ చేస్తాం” అని ఆయన చేసిన వాగ్దానం శాసనసభ రికార్డులలో, పత్రికల్లో, టీవీ చానెళ్లలో అక్షరాలా నిక్షిప్తమై ఉంది.

ఆ మాటనే ఆరు నెలల తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి బడ్జెట్‌ సమాధానంలో పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చెప్పిన 1,07,744 అంకెకు తోడుగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు కూడ భర్తీ చేయనున్నామని చెప్పారు. అంటే ఆ లక్షా ఏడు వేల ఉద్యోగాలలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య కలవలేదన్న మాట. ఈ నియామకాల వాగ్దానాన్నే ఆ తర్వాత కూడా ఎందరో మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వానుకూల మేధావులు వల్లించారు. కాని ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన ఆ రెండేండ్లు గడిచిపోయాయి, మరో రెండు సంవత్సరాలు గడిచిపోయి, ప్రభుత్వం తనను తాను రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. ఆ వాగ్దానం సాకారం కాలేదు. మళ్లీ అధికారం చేపట్టి మరొక ఏడాదిన్నర కావస్తున్నది. ఆ వాగ్దానం చేసిన ఐదున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అంకెను పూరించాం అని నిస్సిగ్గు అబద్ధాలు పతాకశీర్షికలుగా వెలువడుతున్నాయి. రెండు సంవత్సరాలంటే ఐదున్నర సంవత్సరాలా, పంచపాండవులంటే మంచం కోళ్లలా ముగ్గురా, ఇద్దరా, ఒక్కరా అని కూడ అడగనక్కరలేదు. ఎన్ని అబద్ధాలు, డొంక తిరుగుడు వాదనలు చేసినా, ఇప్పటికి కూడా ఆ అంకె ఖాళీలు భర్తీ కాలేదనేది చేదు వాస్తవం.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ వెబ్‌ సైట్‌ మీద 2019 నవంబర్‌ 28 నాటికి తాజా పరిచిన సమాచారం ప్రకారం, ఆర్థిక శాఖ అనుమతించిన ఉద్యోగాల సంఖ్య 39,659 అని, అందులో 128 గ్రూప్‌ 1 ఉద్యోగాలతో సహా 36,602 ఉద్యోగాలకు 101 నోటిఫికేషన్లు జారీ చేశారని, వాటిలో 27,520 ఉద్యోగాలు నింపారని, మరొక 9,082 ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని ప్రకటించారు. అంటే అనుమతించిన ఉద్యోగాలలో పది శాతానికి నోటిఫికేషన్లు రాలేదు. అనుమతించిన ఉద్యోగాలలో 31శాతం ఉద్యోగాలు ఎందుకు నింపలేదో తెలియదు. అవన్నీ ఎలా ఉన్నా, రెండు సంవత్సరాల్లో 1,07,744 ప్రభుత్వోద్యోగాలు నింపుతా మన్నవారు, 39,659 నింపడానికి మాత్రమే అనుమతు లిచ్చారని, వాటిలో కూడా మరొక పన్నెండు వేల కొరతతో నియామకాలు జరిగాయనేదీ వాస్తవం.

సరే, వెబ్‌ సైట్‌ మీద సమాచారం ఆరు నెలల కిందటిది గనుక, మరింత తాజా సమాచారం కావాలనుకుంటే, జూన్‌ 5న స్వయంగా టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు విఠల్‌ ఒక పత్రికకు ఇచ్చిన సమాచారం ఉంది. అందులో ఆయన మరొక 41 ఉద్యోగాలనూ, మరొక నాలుగు నోటిఫికేషన్లనూ కలిపారు. భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యకు మరొక 1,571 చేర్చారు. ముఖ్యమంత్రి 2014 నవంబర్‌ 24 ప్రకటనలో చెప్పిన 1,07,744 ఉద్యోగాలు నేరుగా ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, అంటే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరిగే నియామకాలు మాత్రమే కాగా, ఇప్పుడు విఠల్‌ దానికి పోలీసు బోర్డు, విద్యుత్‌ సంస్థలు, సింగరేణి, టీఆర్‌టీ, గురుకులాలు వంటి ఇతర సంస్థల ఉద్యోగాల లెక్క కూడ కలిపి మొత్తానికి లక్ష అంకె తయారు చేశారు.

ఈ అంకెల గారడీ ఇలా ఉండగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కొవిడ్‌ మహావిపత్తు కన్న తీవ్రంగా ఉన్నది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దగ్గర నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఇరవై ఎనిమిది లక్షలు. నమోదు చేసుకోని, గ్రామీణ, పట్టణ, ప్రచ్ఛన్న నిరుద్యోగుల సంఖ్య కనీసం అంత ఉంటుందని, మొత్తంగా రాష్ట్రంలో ఏదో ఒక ఉద్యోగమో, ఉపాధో కోరుకుంటున్న వారి సంఖ్య యాబై లక్షలు కావచ్చుననీ అంచనాలున్నాయి.

మరొక పక్క ఉద్యమ కాలంలో ప్రకటించిన అంకెలతో పాటు, మూతబడిన ప్రభుత్వ రంగ సంస్థలను తెరిస్తే రాగల ఉద్యోగాలు, కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే రాగల ఉద్యోగాలు, జిల్లాల ఏర్పాటు వల్ల ఏర్పడిన ఉద్యోగాలు, ఈ ఆరు సంవత్సరాల పదవీ విరమణల వల్ల ఏర్పడిన ఉద్యోగాలు కలిపితే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కనీసం మూడు లక్షల ఉద్యోగాలు స్వయంగా కల్పించగల అవకాశం ఉంది. ప్రయివేట్‌ రంగ సంస్థలకు ఇస్తున్న భూమి, నీరు, కరెంటు, రవాణా సౌకర్యాలు, పన్ను రాయితీలు వంటి సందర్భాలలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలనే షరతు పెట్టడం ద్వారా కల్పించగల ఉద్యోగాలు మరికొన్ని లక్షలు ఉంటాయి. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మరి కొన్ని లక్షల మందికి ఆదెరువు కల్పించవచ్చు. కాని ప్రభుత్వానికి ఈ వైపు ఆలోచనే లేదేమోనని అనుమానించడానికి ఆస్కారమిస్తున్న సూచనలు కొన్ని ఉన్నాయి.

వాటిలో ప్రధానమైనది గ్రూప్‌ 1, డీఎస్‌సీ, జూనియర్‌, డిగ్రీ, యూనివర్సిటీ అధ్యాపక స్థానాలు వంటి అనేక రంగాల ఖాళీలు నింపడానికి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు.

మరొక కీలకమైనది ఉద్యోగాల నోటిఫికేషన్ల సందర్భంలో వయో పరిమితిని పెంచవలసిన అవసరం. 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ వేయడానికి ప్రయత్నించినప్పుడు, మా రాష్ట్రం వచ్చాక మేమే ఆ ఖాళీలు నింపుకుంటాం, మీకేమి హక్కుంది అని అడ్డుకున్న అప్పటి ఉద్యమ నాయకులు ఈ ఆరేండ్లుగా ఆ నోటిఫికేషన్‌ వెయ్యనే లేదు. అంటే 2012లో నోటిఫికేషన్‌ వస్తే దరఖాస్తు చేసుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉండిన వారిలో కొందరి వయసు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పెరిగి ఇప్పుడు అసలు దరఖాస్తు చేసుకునే అర్హతనే కోల్పోయి ఉంటారు.

అందువల్ల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి పెంచాలనే డిమాండ్‌ నిరుద్యోగుల్లో ప్రధాన డిమాండ్‌గా మారింది. ఉద్యోగం ఇవ్వండి అని అడిగే స్థితి నుంచి గరిష్ట వయో పరిమితి పెంచండి అని అడిగే దుస్థితికి నిరుద్యోగులను దిగజార్చిన ఘనత తెలంగాణ పాలకులది!

ఉద్యోగ వయోపరిమితిని పది సంవత్సరాలు, అంటే 34సంవత్సరాల నుంచి 44సంవత్సరాలకు పెంచుతూ 2015 జూలై 27న ఒక ఏడాది కొరకు జీవో 329 జారీ చేశారు. ఆ ఏడాదిలో వచ్చిన నోటిఫికేషన్లే తక్కువ గనుక అది ఎక్కువ మందికి వర్తించలేదు. మరొక రెండు సంవత్సరాలు పెంచుతూ 2016 జూలై 26న మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. 2018 ఎన్నికల ప్రణాళికలో వయో పరిమితిని మరొక మూడేండ్లు పెంచుతామని వాగ్దానం చేశారు. నిరుద్యోగులకు రూ.3016 నెలసరి నిరుద్యోగ భతి చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఈ రెండు వాగ్దానాలూ అమలులోకి వస్తున్న దాఖలాలైతే లేవు.

ఇటీవలనే గురుకుల కళాశాలల్లో లెక్చరర్ల (లెక్చరర్‌ అనే మాట కూడ అనలేదు, సబ్జెక్ట్‌ అసోసియేట్‌ అనే కొత్త పేరు పెట్టారు), పాఠశాల ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం వచ్చిన నోటిఫికేషన్‌ చూస్తే అవి కాంట్రాక్టు ఉద్యోగాలలా ఉన్నాయి. రెగ్యులరైజేషన్‌ కోసం అడిగే హక్కు లేదు అని నోటిఫికేషన్‌ లోనే ఉన్నది. అబ్బ, తెలంగాణ ప్రజా ఉద్యమ మౌలిక ఆకాంక్షలలో ఒక ప్రధాన ఆకాంక్ష ఎంత అద్భుతంగా నెరవేరింది!!!

ఎన్‌. వేణుగోపాల్‌

Courrtesy NavaTelangana