ఎక్కడ పుట్టారో, ఏ తల్లులు కన్నారో వీళ్ళని! ఇండియాకి అకడమిక్ రీసెర్చ్ కోసమే వచ్చినా, వారు తవ్వింది సాధారణ చరిత్ర కాదు, ఒక జాతి మీద శతాబ్దాలుగా సాగిన అణచివేత చరిత్ర. ఒక సమాజం ఎడతెగకుండా కార్చిన కన్నీటి కథ. ఈ దేశపు మట్టి పొరలకింద పాతిపెట్టిన నెత్తురంటిన పేజీలు వీరి పరిశోధనలో బైటికొచ్చాయి.

ప్రొఫెసర్ ఎలీనార్ జెలియట్ మహారాష్ట్రలో అంబేడ్కర్ ఉద్యమం, ఆయన దమ్మ దీక్ష, బౌద్ధ పునరుజ్జీవనం వంటి అంశాలపై చేసిన పరిశోధన దళిత ఉద్యమ చరిత్రలో కీలకమైంది. ఆమె అమెరికాలోని కార్ల్టన్ యూనివర్సిటీ లో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసి 2016 జూన్ ఏడో తారీఖున మరణించారు. ఆమె మహారాష్ట్రలో 60 వ దశకంలో పర్యటించి అక్కడ బాబాసాహెబ్ అంబేడ్కర్ సన్నిహితులనుంచి విలువైన సమాచారాన్ని సేకరించి రాసిన వ్యాసాలు ‘From Untouchable to Dalit’ అనే పుస్తకంలో ఉన్నాయి.

జెలియట్ తర్వాత రోజలెండ్ ఒహన్లాన్, గెయిల్ ఆమ్వేడ్, ఎమ్మా క్లౌవ్ వంటి విదేశీ పరిశోధకులు ఇక్కడ పూలే, అంబేడ్కర్ ఉద్యమంపైన, దళిత ఉద్యమంపైన లోతైన పరిశోధన చేసి ప్రచురించిన పుస్తకాలు సామాజిక చరిత్రని, ముఖ్యంగా బ్రాహ్మణేతర ఉద్యమ చరిత్రని అర్ధం చేసుకోడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వారు కేవలం తమ పీ.హెచ్.డీ డిగ్రీల కోసం కంటే దళిత సమాజంతో మమేకమవ్వడం మనకి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.

జెలియట్ Economic and Political Weeklyలో 1998లో వచ్చిన నా ఆర్టికల్ చదివి తన వ్యాసంలో కోట్ చేసి, మరికొందరికి చదవమని సజెస్ట్ చేశారు. గెయిల్ నేను ఒక సెమినార్(97-98లో) గురించి లెటర్ రాస్తే ఎప్పుడూ బిజీగా వుండే ఆమె స్టూడెంట్ అయిన నాకు రిప్లై ఇచ్చారు. వాళ్ళ నిబద్ధతని జ్ఞాపకం చేసుకుని స్పూర్తి పొందడమే ప్రొఫెసర్ ఎలీనార్ జెలియట్ వంటి గొప్ప నిజాయితీ, నిబద్ధత కలిగిన పరిశోధకురాలికి ఇచ్చే అసలైన నివాళి అనిపిస్తుంది.

Prof. Eleanor Zelliot is a great historian, worked at Carlton University, has extensively studied and published books on Ambedkarite movement, Buddhism and modern Dalit movement in Maharastra. Her book ‘ From Untouchable to Dalit’ is a pioneering work on history of Dalit Movement in Maharastra and particularly on Dalit’s religious identity. People like Prof. Zelliot, Gail Omvedt, Rosalind Ohanlon, Emma Clove and other western women scholars reconstructed the buried history of Dalits. Her works are source of inspiration for me. Tribute to the great scholar Prof. Eleanor Zelliot. Indian Dalits never forget her contribution in theorizing Dalit identity.

చల్లపల్లి స్వరూపరాణి