– కోదాడ ప్రభుత్వాస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
– నిందితులను శిక్షించాలని డిమాండ్‌

కోదాడరూరల్‌ : గిరిజన యువతి కోటేశ్వరి(20)పై లైంగికదాడి నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బంధువులు సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైటాయించారు. లైంగిక దాడి జరిగితే పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాంబాల్‌నాయక్‌, విద్యాసాగర్‌, జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్‌ అధికారి దయానందరాణి, ఎస్సీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శంకర్‌ అక్కడికి చేరుకుని బంధువులతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా యువతి బంధువులు మాట్లాడుతూ.. ‘పిక్లానాయక్‌తండా గ్రామానికి చెందిన అజ్మీర హరి కుమార్తె(20) నల్లగొండలోని చర్లపల్లి గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదివేది. పీజీ ఎంట్రన్స్‌ కోసం కోచింగ్‌లో చేరేందుకు తండ్రితో కలిసి అక్టోబర్‌ 29న హైదరాబాద్‌ బయలుదేరింది.

వారు నార్కట్‌పల్లికి చేరుకోగానే ఆమె స్నేహితురాలు మేనమామ రాజశేఖర్‌ కలిశాడు. హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ చేయిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లి డ్రగ్స్‌ ఇచ్చి లైంగికదాడికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను హాస్టల్‌లో వదిలి వెళ్లాడు.

ఈ క్రమంలో యువతి అస్వస్థతకు గురైంది. గమనించిన హాస్టల్‌ వార్డెన్‌ యువతి తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. తండ్రి శనివారం ఆమెను తీసుకొచ్చి కోదాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించారు. వైద్యుల సూచన మేరకు ఖమ్మం మమత ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది’ అని తెలిపారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి అధికారులను వేడుకున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మనాయక్‌, శ్రీరాంనాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు, గిరిజన సంఘం నాయకులు బాలునాయక్‌, భరత్‌నాయక్‌, శేఖర్‌నాయక్‌, పాండునాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్‌ వర్మ, జిల్లా సహాయ కార్యదర్శి సాయికుమార్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు ఏపూరి రాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.