• సంగారెడ్డిలో ముగ్గురు యువకుల ఘాతుకం
  • బాధిత కుటుంబానికి నిందితులతో రూ.75 లక్షలు ఇప్పించేలా గ్రామపెద్దల నిర్ణయం

రామచంద్రాపురం : ఓ గిరిజన మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై  హత్య చేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో గురువారం వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురం సీఐ జగదీశ్‌ కథనం ప్రకారం.. తెల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధి కొల్లూరు   దేవులతండాకు చెందిన మహిళ (35) బతుకుదెరువు కోసం కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు వెళ్లింది. మియాపూర్‌లో నివాసముంటోంది. పదేళ్ల క్రితమే ఆమె భర్త హత్యకు గురయ్యాడు.

పని ఉందంటూ సోమవారం ఆమెను మధునాయక్‌, నందుయాదవ్‌, కుటుంబ రెడ్డి అనే యువకులు   కొల్లూరు శివారుకు తీసుకెళ్లారు. బాగా మద్యం తాగించి  ముగ్గురూ అత్యాచారం చేశారు. అదే రోజు రాత్రి హత్య చేశారు. బుధవారం విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా చేసి నిందితులపై కిడ్నాప్‌, అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, సదరు మహిళ అతిగా మద్యం తాగి మృతి చెందిందని, కేసు పెట్టొద్దని పోలీసులను గ్రామ పెద్దలు వేడుకున్నట్టు తెలిసింది. గురువారం ఇదే విషయమై కొల్లూరులో   పంచాయతీ పెట్టారు. నిందితులు ముగ్గురూ కలిసి మహిళ ఇద్దరు పిల్లల పేరిట రూ.75 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేలా తీర్మానించారు. కాగా, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతుండగా, బుధవారమే వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Courtesy Andhrajyothi