ఇవ్వాళ అడవిని కార్పొరేట్‌ కంపెనీలు కబళిస్తున్నాయి. వాటికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఆదివాసీ జవజీవాలకు జీవనాడి అయిన అడవి అంతరించిపోతే ఆదివాసీల భాషా సంస్కృతులే కాదు… అసలు వారి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అట్లాగే భాషాంతరీకరణ, మతాంతరీకరణ ప్రమాదాలు వారిని కొత్త దారుల్లోకి ఈడ్చుకుపోతున్నాయి. ఫలితంగా అనేక ఆదివాసీ సమాజాలు తమకే ప్రత్యేకమైన సామూహికత్వాన్ని, ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడటం కోసం ఆదివాసీ యువతలో వస్తున్న చైతన్యం గురించి వివరిస్తున్న వ్యాసం ఇది.

అడవి తల్లికి దండాలో… మా తల్లి అడవికి దండాలో…
అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు
పంటలింటికి వస్తే… పండుగజేసుకుంటాము
జింబకు… జింబకు… జింబకు బాలా… జింబకు జింబకు జం
పాట,.. ఆట… లయ… సంగీతం… అడవి బిడ్డల సొంతం.

వేట, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవన విధానం. ఉప్పు, కిరసనాయిలు, బట్టలు వంటి అత్యవసర వస్తువులు కోసం మాత్రమే వారానికోసారి సంతకు వచ్చి (వస్తుమారకం పద్ధతుల్లో) కొనుక్కుపోతుంటారు. ఇప్పటికే కొన్ని ఆదివాసీ తెగలు కొండల్లో, కోనల్లో అదే పద్ధతిలో బతుకుతున్నారనేది అతిశయోక్తి కాదు. ఆ ప్రత్యేక వెనుకబడిన తెగల తొలితరంవారి బిడ్డలు ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్నారు. ఏ తెగకు ఆ తెగ భాషున్నది. సవర్లకు సవర భాష, గోండులకు గోండు భాష, ఖోద్‌లకు కువి భాష, కోయలకు కోయ భాష, కొండరెడ్లకు, భగతలకు కొండి భాష ఉన్నాయి. కొన్ని భాషలు ఇప్పటికే కాల గతిలో అంతరించిపోయాయి. గిడుగు రామమూర్తి పంతులుగారి విశేష కృషి ఫలితంగా సవరలకు మాత్రమే సవరభాషకు లిపి ఉన్నది. హిందీని రాయడానికి ఉపయోగించే దేవనాగరి లిపికి దగ్గరగా ఇది ఉంటుంది. పైన పేర్కొన్న మిగతా భాషలకు సాధారణంగా తెలుగు-కన్నడ లిపినే రాయడానికి ఉపయోగిస్తారు తెలుగు ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఆదివాసీలు. అయితే ఆదిలాబాదు జిల్లాలోని గోండులు దేవనాగరి లిపిలో తమ భాషను లిఖించడం చూడవచ్చు.

ఏ బిడ్డకైనా రెండవ ఇల్లుగా బడి లేదా అంగన్‌వాడీ కేంద్రంను చెప్పవచ్చు. ఈ అంగన్‌వాడీ కేంద్రం, బడి టీచర్లుగా ఆ తెగకు సంబంధించినవారు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కువమంది మైదానప్రాంత తెలుగు మాతృభాషకలిగిన టీచర్లే ఉంటారు. వారంతా దూర ప్రాంతం నుంచి బడికి వచ్చిపోతూ ఉంటారు. ఇంటి నుండి బడికి వచ్చిన పసి బిడ్డల భాష టీచర్‌కి అర్థం కాదు. టీచర్‌ మాట్లాడే తెలుగు ఈ బిడ్డలకు అర్థం కాదు. మంచి టీచర్లయితే ఆ బిడ్డలతో కలసిపోయి వారి భాషను అర్థం చేసుకోవడమే కాక, అనతికాలంలోనే నేర్చుకుంటారు. అది వారి వృత్తిలో భాగమని భావిస్తారు. ఆ విధంగా పిల్లలతో కలసిపోయి వారి జీవన వికాసానికి తోడ్పడతారు. అట్లా కాని పక్షంలో పిల్లకు- టీచర్‌కి మధ్య ఉన్న అనేక అంతరాలు (ఎక్కువ-తక్కువ)తో పాటు ఈ భాషాంతరం కూడా ఓ ప్రధాన అడ్డుగోడగా నిలుస్తుంది. ఈ బాధను అర్థంచేసుకుని కొన్ని చోట్ల ఉభయ భాషలు (తెలుగు-తెగ భాష) ఉండేవిధంగా ప్రాథమిక భాషావాచకాలు పెద్దలు గతంలో రూపొందించారు. ఆ తెగ భాష కూడా తెలుగు లిపిలోనే ఉండేది. పిల్లలకు, టీచర్‌కు సమన్వయం కుదిర్చేందుకు కొన్ని చోట్ల ఇందుకుగాను భాషా వలంటీర్లను కూడా నియమించారు. అయితే ఈ పద్ధతులు అన్ని చోట్ల సక్రమంగా అమలుకాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయింది. అంతరం స్థిరీకరణకు గురై… పిల్లల దారి పిల్లలది, టీచర్‌ దారి టీచర్‌ది అన్నట్టు సమాంతరంగా నడుస్తున్నది.

కోతి పుట్టిన రోజున ఢాం ఢాం ఢాం
కొత్త గౌను తొడిగి ఢాం ఢాం ఢాం
తలను మంచిగ దువ్వి ఢాం ఢాం ఢాం
పౌడర్‌ తెల్లగ రాసి ఢాం ఢాం ఢాం
సైకిలు ఎక్కి సిటీకెళ్లె ఢాం ఢాం ఢాం
ఇది పిల్లలు పాడుకునే పాట. ఇదే కోయవాళ్ల భాషలో…
కొవే పుట్టిన రోజల్లీ ఢాం ఢాం ఢాం
కొత్త గౌను కెర్తల్లే ఢాం ఢాం ఢాం
తలతి మెంచిగ దూస్‌తల్లే ఢాం ఢాం ఢాం
పౌడర్‌ తెల్లగ రాస్తల్లే ఢాం ఢాం ఢాం
సైకిల్‌ తర్రీ సిటీ అత్రల్లే ఢాం ఢాం ఢాం

పిల్లలు మాతృభాషలో పాడుకుంటే ఆ ఆనందం వేరు. పిల్లల ముఖాలు మందార పువ్వుల్లా విప్పారతాయి. కాని ఎక్కువ శాతం బడుల్లో ఈ పని జరగడంలేదు. క్రమేపీ వారి భాష నుండి వారు దూరమవుతున్నారు.
సమిష్టిగా ఆడుకునే థింసా, గుస్సాడి, కోయ, కొమ్ముబూర, రుంజ నృత్యాల స్థానంలో పెద్ద పెద్ద డీజే సౌండ్‌ సిస్టంల పాటల రణగొణ ధ్వనులు చేరుతున్నాయి. యువత అంతా అటువైపు కొట్టుకుపోతున్నారు. ఈ శబ్ద కాలుష్యం అటవీప్రాంతానికి క్షేమదాయకం కాదు. వన్యమృగాలు ఇబ్బంది పడతాయి. అదీగాక వారి పండుగలన్నీ వ్యవసాయపనులతో ముడివడి ఉంటాయి. భూమి పండుగ, కొత్తల పండుగ, ఇటుకల పండుగ అని రకరకాల పేర్లతో చేసుకుంటారు. భూమి దేవత, గ్రామ దేవత, నీటి దేవత (గంగమ్మ) లే వారి ఆరాధ్య దైవాలు. సమిష్టి పాటలు, నృత్యాలు, ఆ పండుగ క్రతువుల్లో భాగాలే.

మతాల ప్రభావాలు
ఇప్పుడు హిందు, క్రైస్తవ మతారాధనలు ఆదివాసీ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొందరికి మత వ్యవహారం తేలికపాటి ఉపాధిగా మారిపోయింది. అశాస్త్రీయ, ఛాందస భావాలను ఆదివాసీల్లో వ్యాప్తిచేయడం కనిపిస్తున్నది. ఒక్కోసారి ఆదివాసీ ఐక్యతను ఈ మతాలు దెబ్బతీస్తున్నాయి. పెద్దపులులకు, ఎలుగు బంట్లకు భయపడని ఆదివాసీ బిడ్డలో మతాలు కొత్త భయాలను సృష్టిస్తున్నాయి.
భాషా సంస్కృతులు ఆ తెగలో సజీవత్వాన్ని నింపుతాయని… తరతరాలుగా నిర్మించుకుంటు వస్తున్న వారి ప్రజాస్వామ్మ స్వభావానికి ఈ కొత్త మత భావాలు విఘాతం కలిగిస్తున్నాయని ఆదివాసీ యువత తెలుసుకోలేకపోతున్నది. ఇప్పుడు అడవులు తరిగిపోతూ, జనం పెరిగిపోతూ… కొండల మధ్యనున్నవారు బ్రతుకుదెరువుకై కిందికి చేరుకుంటున్నారు. కిందున్న ఆదివాసేతరులు స్వప్రయోజనం కోసం కొండలనెక్కుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వలసలు పెరుగుతున్నాయి. భాషాసమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్నిచోట్ల అసలు ఆదివాసులు ఎవరు, నకిలీ ఆదివాసులెవరు అనే విషయంలో గందరగోళం ఏర్పడుతున్నది. ఈ అగమ్య గోచర పరిస్థితుల మద్య ఆదివాసుల సంస్కృతే కాదు… ఉనికే ప్రశ్నార్థకమవుతున్నది.

మేల్కొంటున్న యువ తరం
ఈ ప్రమాదం గ్రహించిన ఈ తరం ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నది. తమ మనుగడ కోసం, పురోభివృద్ధి కోసం ప్రణాళికలు రచించుకుంటున్నది. భాషా సంస్కృతులే తమ నిజమైన అస్థిత్వమని తెలుసుకుంటున్నది. ఉన్నదాన్ని కాపాడుకుని, తమ భాషను, సంస్కృతిని పరిపుష్టిచేసుకోవాలని భావిస్తున్నది. వారు పాడుకునే పాటలు, ఆడుకునే ఆటలు, ఆచార వ్యవహారాలు, పనీపాటలన్నీ నమోదు చేసుకోవాలని (తెలుగులోనే) కోరుకుంటున్నది. అదీ కేవలం ఎకడమిక్‌ (విశ్వవిద్యాలయా విద్యార్థుల అధ్యయనం కోసం) స్థాయిలో కాకుండా పిల్లలు పాడుకునే స్థాయి నుండి తమ జాతి గీతంలా పున: ప్రారంభం కావాలని అబిలషిస్తున్నది.
అంతేగాక తమ అటవీ జీవితం, అటవీ సంరక్షణ, ప్రాతిపదికగా కొత్త కొత్త రచనలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఎందుకంటే తమ జీవనానికి ఆసువుగా పాడుకోవడం, కథలల్లుకోవడం వారి జీవనంలో భాగమే. ఏ ఆదివాసీ తల్లి జోలపాటైనా వినండి. అది ఎప్పుడూ ఒకలా ఉండదు. కొత్త కొత్త చరణాలతో కొంగ్రొత్తగా సాగిపోతుంది. ఆదివాసుల ఈ భాష, సంస్కృతీపథం అందరికీ అనుసరణీయమే మరి.

– శాంతారావు
9959745723