‘అదొక గిరిశిఖర గ్రామం. రోడ్డు లేని ఆ గ్రామానికి వాహనాల రాకపోకల్లేవు. నెట్‌వర్క్‌ సమస్యతో సెల్‌ఫోన్లు కూడా పని చేయవు. అత్యవసర పరిస్థితుల్లో వారికి కాలి నడకే దిక్కు.. రోగులనైతే డోలీ కట్టి మోయాల్సిందే.. విజయనగరం జిల్లా సాలూరు మండలం సిరివర గ్రామంలో దశాబ్ధాలుగా ఇదే పరిస్థితి.’ ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన కొండతామర పారమ్మ(25)ను ఈ నెల 3న డోలీలో సుమారుగా 12 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు. గతేడాది జులైలో అదే గ్రామానికి చెందిన కొండతామర గిందే అనే మహిళను డోలీతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఈ సంఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే మండలం పగులు చెన్నూరుకు చెందిన కూనేటి అర్సు (30), ఎం.చింతవలస గ్రామానికి చెందిన చోడిపల్లి ముత్తాయమ్మను డోలీతో మోసుకొచ్చి వైద్యం చేయించాల్సిన పరిస్థితి గిరిజన దయనీయానికి అద్దం పడుతోంది. సిరివరం, పగులుచెన్నూరు గ్రామాలే కాదు. ఏజెన్సీలోని చాలా గిరిశిఖర గ్రామాల్లో నేటికీ ఇదే దుస్థితి.
పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 289 గ్రామాలు, 773 గిరిజన గూడేలున్నాయి. వీటిలో సుమారుగా రెండు లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారు. ఏజెన్సీలో 320 గూడేలు కొండలపైనే ఉండడం విశేషం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఈ గ్రామాలకు రహదారి సదుపాయాల్లేని గిరిజనులు దిక్కూ, మొక్కూ లేని జీవనాన్ని గడుపుతున్నారు. కురుపాం మండలంలో సుమారుగా 23 పంచాయతీల్లో 61 గ్రామాలు కొండలపైనే ఉన్నాయి. వీరికి మొండెంఖల్లు, నీలకంఠాపురం పిహెచ్‌సిలతో పాటు కురుపాంలో సిహెచ్‌ఎన్‌సి ఉంది. గిరిజనులు ఈ ఆస్పత్రులకు రావాలంటే పది నుంచి 30 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయాలి. రహదారి మార్గం లేక నిత్యం వీరు డోలీ మోతలపైనే ఆధారపడుతున్నారు. ఆస్పత్రులకు చేరే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని 27 పంచాయతీల్లో 70 గ్రామాలకు పైగా కొండలపైనే ఉన్నాయి. వీరంతా తాడికొండ, రేగిడి, దుడ్డుకల్లు పిహెచ్‌సిలకు రావాలంటే డోలీలతో మోసుకుని రావాల్సిందే. కొమరాడ మండలం పూడేసు, ఎండభద్ర, పల్లపాడు, కూనేరు, మసిమండ, పెడుము, తుమ్మలవలస తదితర గిరిజన గ్రామాలకు చెందిన ప్రజానీకం ప్రయాణమంతా కాలినడకనే. అరకు ముఖద్వారంగా ఉన్న ఎస్‌.కోటకు కొద్ది దూరాన ఉన్న 30 గ్రామాల్లోని గిరిజనులు కొండలపైనే మగ్గిపోతున్నారు.

చిత్తశుద్ధి లేకపోవడమే కారణం
2017లో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 450 రహదారుల పనులకు రూ.219 కోట్లు మంజూరయ్యాయి. కానీ అప్పటి ప్రభుత్వం 40 శాతం రోడ్లు కూడా పూర్తి చేయలేదు. వేసిన రోడ్డు కూడా అధికార పార్టీ నాయకుల చేతివాటంతో నాశిరకంగా ఉన్నాయి. ఎపిఆర్‌ఆర్‌పి ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ రోడ్డు కనెక్టవిటీ ప్రాజెక్టులో భాగంగా 2018 మే నెలలో 156 రహదారుల నిర్మాణానికి సుమారుగా రూ.150 కోట్ల నిధులు మంజూరుకు జిఒ విడుదల చేశారు.
గత ప్రభుత్వంలో మంజూరురైన రోడ్లు కొంత వరకు పనులు జరిగినప్పటికీ 25 శాతం చేసిన రోడ్డు పనులను, ప్రారంభం కాని వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వానికి మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపుతుతన్నామని పార్వతీపురం ఇన్‌ఛార్జి ఇఇ మోహన్‌రావు తెలిపారు.

Courtesy Prajashakthi…