• దళిత అమ్మాయితో పదేళ్ల ప్రేమాయణం
  • గత సంవత్సరం కులాంతర వివాహం
  • ఆమె సహకారంతోనే సివిల్స్‌కు ఎంపిక
  • ఐపీఎస్‌ అయ్యాక పూర్తిగా మారిన ధోరణి
  • తల్లిదండ్రులు వద్దంటున్నారని బుకాయింపు
  • విడాకులివ్వకుంటే చంపేస్తానని బెదిరింపు
  • నెలక్రితం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
  • పట్టించుకోకపోవడంతో ట్విటర్‌లో ఆవేదన

ఆయన రెడ్డి.. ఆమె మాదిగ! నువ్వంటే నాకిష్టం.. నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ వెంటబడితే అతడి ఆదర్శభావాలకు ఆమె ఫిదా అయ్యింది. జీవితాంతం నీతోనే ఉంటానని బాస చేస్తే పూర్తిగా నమ్మింది.నేను సివిల్స్‌కు సిద్ధమవుతున్నాను అని చెబితే ఆర్థికంగా ఎంతో సాయం చేసింది. తాళికట్టి ఇల్లాలిని చేసుకున్నా.. నా తల్లిదండ్రులకు సమయం వచ్చినప్పుడు చెబుతాలే, ఇప్పుడు వేరుగా కాపురం పెడదాం అని చెప్పినా నమ్మింది! సివిల్స్‌కు ఎంపికై ఐపీఎస్‌ అయిన తర్వాత అతడి స్వరం మారింది. మన పెళ్లి మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు.. ప్రధాని కూతురైనా దళిత అమ్మాయి కోడలిగా చేసుకునేందుకు ఒప్పుకోం అని మా ఇంట్లో వాళ్లు చెబుతున్నారు అని ప్లేటు మార్చాడు. నాకు పెద్ద పెద్ద సంబంధాలొస్తున్నాయి. విడాకులివ్వు.. లేదంటే చంపేస్తానని బెదిరింపులకూ దిగాడు. దిక్కుతోచని స్థితిలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో ట్విటర్‌ వేదికగా ఆవేదనను పంచుకుంది.

బాధితురాలి వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం పందికళ్లపల్లె చెందిన కోకంటి వెంకట మహేశ్వర్‌ రెడ్డి (29)కి, మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడకు చెందిన బిరుదుల భావన (28)కు 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే పరిచయం. అది ప్రేమగా మారి.. అమ్మాయి ఇంట్లో తెలియడంతో నిరుడు ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా నగరంలో భార్యతో మహేశ్వర్‌ రెడ్డి కాపురం పెట్టాడు. ఆమె సహకారంతోనే సివిల్స్‌కు సిద్ధమై 126వ ర్యాంకు సాధించి ఐపీఎ్‌సగా ఎంపికయ్యాడు. ఆ తర్వాతే ఆమె విషయంలో అతడి ప్రవర్తన మారిపోయింది. భారీగా కట్నం తెస్తేనే భార్యగా స్వీకరిస్తాను. లేదంటే విడాకులు ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కాదన్నందుకు ఆమెను, ఆమె కుటుంబసభ్యులను చంపుతానని బెదిరిస్తున్నాడు. డబ్బు, పలుకుబడి ఉపయోగించి తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని బాధితురాలు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల రోజులు గడుస్తున్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ట్విటర్‌ వేదికగా పోలీసులపై పలు విమర్శలు చేసింది. సీపీ ఆదేశాలతో ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించినప్పుడు కులం తెలియదా?…ట్విటర్‌ వేదికగా రాచకొండ పోలీసులపై భావన పలు ఆరోపణలు చేసింది. షీటీమ్స్‌ ఏర్పాటై 5 ఏళ్లు గడిచిన సందర్భంగా ఘనంగా వార్షికోత్సవం జరిపిన పోలీసులు.. ఒక మహిళకు అన్యాయం జరిగితే పట్టించుకోరా? అని ప్రశ్నించింది. తనను ప్రేమించినప్పుడు నేనో దళిత మహిళను అనే విషయం మహేశ్వర్‌ రెడ్డికి గుర్తుకురాలేదా? అని ప్రశ్నించింది. నన్ను, నా కుటుంబాన్ని చంపడానికి నా భర్త ప్రయత్నిస్తున్నాడు. అందుకు ఏపీ సీఎం జగన్‌, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లను వాడుకుంటున్నాడు అని తెలిపింది.

Courtesy Andhrajyothi…