శివారు ప్రాంతాల్లో అనధికారిక స్థలాలకు ప్లాట్లు
ఫిర్యాదులు వస్తేగానీ.. స్పందించని అధికారులు
అనుమతి లేకుండానే జోరుగా నిర్మాణాలు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నాయి. ఎకరాల కొద్ది ఉన్న ఈ స్థలాలు నిబంధనలకు తిలోదాకాలు ఇచ్చి దొడ్డిదారిన అక్రమ లే అవుట్లు చేసి విక్రయించే పనిలో పడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్లు చేసి విక్రయించాలంటే మొత్తం స్థలంలో 40 శాతం పురపాలికకు ఖాళీ స్థలంగా చూపాలి. ఇందులో రోడ్డు, పార్కు, సామూహిక భవనం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. అప్పుడే లే అవుట్ స్థలానికి అనుమతులు జారీ అవుతాయి. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా హడావుడిగా ఇష్టానుసారంగా రోడ్లను చూపుతూ ప్లాట్లను అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. న్యూస్‌టుడే, కార్పొరేషన్‌ : శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు కావడం.. దీని పరిధిలోకి 71 గ్రామాలు, నగరాన్ని ఇందులోకి చేర్చడంతో అక్రమ లే అవుట్ల దందా జోరందుకుంది. సుడా పాలకవర్గం, అధికారుల నియామకం జరిగితే అక్రమ లేవుట్ల స్థలాలకు అడ్డుకట్ట పడటంతో పాటు కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. లేఅవుట్‌ పరిధిలోకి స్థలం వస్తే.. కొంత స్థలం ప్రభుత్వానికి తనఖా పెట్టాల్సి ఉంటుంది. దీంతో సుడా వంటి ప్రణాళికలు అమలు కాకముందే ఇష్టానుసారంగా ప్లాట్లు చేసుకుంటూ అమ్ముకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం నగరానికి ఆనుకొని ఉన్న శివారు కాలనీలు, మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల పరిధిలో ఈ వ్యవహారం సాగుతుండటం గమనార్హం.

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో అక్రమ ప్లాటింగ్‌
ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పురపాలక శాఖ అనుమతులు ఇస్తుండగా దీన్ని ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు అక్రమ ప్లాటింగ్‌కు తెరలేపారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో చూపిన విధంగా రోడ్డు, అనుమతులు చూపుకుంటూ ఇతర ప్లాట్లను క్రయ, విక్రయాలు చేసుకుంటున్నారు. వాస్తవంగా పూర్తి స్థలాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి తీసుకురాకుండా, లేఅవుట్‌ ప్రకారం ప్లాట్లు చేయకుండా ముక్కలు, ముక్కలు చేసుకుంటూ అక్రమదారులు వెతుకుంటున్నారు. పైగా సబ్‌ డివిజన్‌ పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఇలా సబ్‌ డివిజన్‌ను ముగ్గురి కంటే ఎక్కువ మంది చేసుకుంటే భవన అనుమతులు రావనే విషయాన్ని గుర్తించడం లేదు.

అనుమతులు లేకుండా కొనుగోలు
లే అవుట్లు లేని స్థలాల విషయంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనుగోలు చేస్తూ వినియోగదారులు మోస పోతున్నారు. లేఅవుట్‌ ప్లాన్లు చూపకుండా, సర్వేయర్ల పత్రాలను చూపుతూ ఇదిగో రోడ్డు.. అదిగో స్థలమంటూ బురిడీ కొట్టిస్తున్నారు. స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత మిగతా ప్లాట్లను క్రయ, విక్రయాలు జరిపే సమయంలో అసలు బాగోతం బయటపడి కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

వివాదాస్పదమవుతూ..
నగర శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ప్లాట్లు చేపడుతున్న లే అవుట్‌ లేని వివాదాస్పదంగా మారుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో నగర శివారు కాలనీలు, విలీన గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు కలెక్టర్‌కు, నగరపాలక కమిషనర్‌కు అందాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కన్నెత్తి చూడని అధికారులు
శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేస్తుండగా.. ఆ దరఖాస్తుల పరిశీలన సమయంలో పట్టణ ప్రణాళిక అధికారులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ స్థలాలు ప్లాట్లు చేసుకునే సమయంలో గమనించకపోవడం, స్థలాల పరిధి ఏ మేర ఉందనే విషయాన్ని గుర్తించడం లేదు. దీంతో ఓ వైపు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద చూపిన స్థలాలకు ఆనుకునే మిగతా స్థలాలను అక్రమంగా ప్లాట్లు చేసుకుంటున్నారు. దీంతో అక్రమ లేఅవుట్ల ప్లాన్‌లో ఓ రకంగా రోడ్లు, ఎల్‌ఆర్‌ఎస్‌లో మరో రకంగా రోడ్లకు చూపిన స్థలాలు ఉంటున్నాయి. అంతేకాకుండా ఫిర్యాదులు వచ్చేవరకు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫిర్యాదులు వస్తే.. కఠిన చర్యలు
కె.శశాంక, కమిషనర్‌, నగరపాలక, కరీంనగర్‌
అక్రమ లే అవుట్లపై ఫిర్యాదులు రాగానే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ప్లాట్లను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయకూడదు. ఇళ్ల నిర్మాణ సమయంలో ఇబ్బందులు వస్తాయి. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అనుమతి ఉన్న లే అవుట్‌ ప్లాట్ల వివరాలను నగరపాలక వెబ్‌సైట్‌లో ఉంచుతాం.

మార్కండేయనగర్‌లో అనధికారికంగా రహదారి విస్తరణ చేపడుతున్నారని, 20 అడుగుల రహదారి ఉండగా.. కొత్త ప్లాట్ల కోసం 30 అడుగులు విస్తరిస్తున్నారని, పైగా ప్లాట్లకు ఎలాంటి నష్టం లేకుండా ఒకేవైపు రహదారి విస్తరించడంతో కాలనీవాసులకు అన్యాయం జరుగుతోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో పట్టణ ప్రణాళిక అధికారులు పరిశీలిస్తే అక్రమంగా ప్లాటింగ్‌ చేస్తున్న విషయం బయటపడింది. దీంతో అక్కడ పాతిన రాళ్లను తొలగించారు.

యువత జోష్‌
విద్యార్థులను చదువుల ఒత్తిడి నుంచి దూరం చేయడం.. సృజన, నైపుణ్యతను వెలికితీయడం కోసం కళాశాల విద్యాశాఖ ఏటా ‘యువ తరంగం’ పోటీలను నిర్వహిస్తోంది.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను పెంచే ఆలోచనతో ఆచరణలోకి వచ్చిన కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున భాగాస్వాములవుతున్నారు. బుధవారం ఎస్సారార్‌ కళాశాలలో నిర్వహించిన క్లస్టర్‌ స్థాయి పోటీల్లో విద్యార్థులను ప్రదర్శనలతో అబ్బురపర్చారు.

Courtesy Eenadu