హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతు నిలిచేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో రోజువారి కూలీలు, నిరుపేదలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు అండదండలు అందించేందుకు వివిధ రంగాలకు ప్రముఖులతో పాటు సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు తమ వంతు సహాయం చేస్తున్నారు. సీనియర్‌ నటులు, యువ హీరోలతో పాటు టాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు కూడా సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కాల్పోయిన సినిమా కార్మికులను ఆదుకునేందుకు కూడా ప్రముఖులు సహాయం చేస్తున్నారు. సినీ కార్మికుల కోసం ప్రముఖ నటుడు చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ‘నాంది’ సినిమాలో నటిస్తున్న అల్లరి నరేశ్‌ తన చిత్ర యూనిట్‌లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా ఉన్న కార్మికులకు చిత్రనిర్మాత సతీష్‌ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి తలా 10వేల రూపాయలను సాయం చేయాలని నిర్ణయించారు.

హీరో ప్రభాస్‌ మొత్తం రూ. 4 కోట్లు ప్రకటించారు. ఇందులో రూ. 3 కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు తెలిపారు. మరో కోటి రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇవ్వనున్నారు. పవన్‌ కళ్యాణ్‌.. ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

ప్రముఖులు ప్రకటించిన విరాళాలు
ప్రభాస్: రూ. 4 కోట్లు
పవన్ కళ్యాణ్: రూ. 2 కోట్లు
చిరంజీవి: రూ. 1 కోటి
మహేష్ బాబు: రూ. 1 కోటి
జూ. ఎన్టీఆర్‌: రూ. 75 లక్షలు
రామ్ చరణ్: రూ. 70 లక్షలు
నితిన్: రూ. 20 లక్షలు
త్రివిక్రమ్: రూ. 20 లక్షలు
కొరటాల శివ: రూ. 10 లక్షలు
అనిల్ రావిపూడి: రూ. 10 లక్షలు
వీవీ వినాయక్: రూ. 5 లక్షలు
దిల్ రాజు: రూ. 10 లక్షలు
సాయి ధరమ్ తేజ్: రూ. 10 లక్షలు