భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య ఆరు వేలకు చేరువయింది.

ఉచితంగా కరోనా పరీక్షలు: సుప్రీంకోర్టు
అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ లేబరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఇందుకు అనుగుణంగా తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, డబ్ల్యూహెచ్‌వో/ఐసీఎం ఆర్‌ అనుమతి పొందిన లేబరేటరీల్లోనే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేలా చూడాలని ఆదేశించింది.

6 వేలకు చేరువలో..
భార‌త్‌లో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారం నాటికి 5,865కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 24 గంట‌ల్లోనే కొత్తగా 591 మంది కోవిడ్‌ బారిన పడ్డారని ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకి 169 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. 477 మంది కోవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు.

ఒడిశాలో లాక్‌డౌన్‌ పొడిగింపు
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కంటే ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలను జూన్‌ 17 వరకు మూసివేయాలని నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉంటుందని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో 12కు చేరిన కరోనా మరణాలు
కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య తెలంగాణలో గురువారం నాటికి 12కు చేరింది. ఇప్పటివరకు కోవిడ్‌ బాధితుల సంఖ్య 471కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇప్పటివరకు 45 మంది కరోనా నుంచి కోలుకున్నారని శుక్రవారం 60 నుంచి 70 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందన్నారు.

ఏపీలో 348 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాటికి 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 75 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు మొత్తం 7,155 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలతో 1750 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలతో కొత్త కేసులు తగ్గుతున్నాయని ఏపీ వైద్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్‌ బారిన పడి 9 మంది కోలుకున్నట్టు వెల్లడించింది.

కరోనాపై పోరుకు 15 వేల కోట్లు
కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు రూ.15,000 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ‘ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ’ కింద ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు తెలిపింది. తక్షణ కోవిడ్-19 స్పందన చర్యల కోసం ఇందులో రూ.7,774 కోట్లు వెచ్చించాలని, తక్కిన మొత్తాన్ని మిషన్ మోడ్ విధానంలో మీడియం టెర్మ్ సపోర్ట్‌గా 1 నుంచి 4 ఏళ్ల పాటు ఖర్చు చేయనున్నామని కేంద్రం వివరించింది.

మోదీకి ట్రంప్‌ ప్రశంస
హైడడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. మోదీని అద్భుతమైన వ్యక్తి అని, భారత్‌ సాయాన్ని మర్చిపోమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయని ట్వీట్‌ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మునుపటి కంటే బలోపేతం అయ్యాయని అన్నారు.