దిల్లీ: స్వీడన్‌కు చెందిన బాలిక, ప్రముఖ వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులపై ప్రపంచ దేశాల విధాన రూపకర్తలు నూతన విధానాలు రూపొందించాల్సిందిగా గ్లోబల్‌ యూత్‌ మూమెంట్‌ పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్‌ బాలిక. ‘వాతావరణ మార్పులపై అప్రమత్తం చేస్తూ మానవాళికి ఈ ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని గుర్తూ చేయడమే కాకుండా నేటితరం ఓ ఉద్యమాన్ని నడిపితే ఎలా ఉంటుందో గ్రెటా సూచించింది. అందుకే ఆమెను 2019 టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తించాం’ అని టైమ్స్‌ మ్యాగజిన్‌ చీఫ్‌ ఎడిటర్‌ ఎడ్వర్డ్‌ ఫెల్సెంథల్‌ తెలిపారు.
1927 నుంచి ప్రతి సంవత్సరం టైమ్స్‌  ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డులను ప్రకటిస్తోంది. పోర్చుగల్‌లోని లిస్బన్‌ తీరంలో ఆకాశంవైపు చూస్తున్న గ్రెటా చిత్రాన్ని టైమ్స్‌ ముఖచిత్రంగా ప్రచురించింది. దీనికి ‘ది పవర్‌ ఆఫ్‌ యూత్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

(Courtesy Eenadu)