ప్రత్యేక రైళ్లలో 300 శాతం అదనం
రూ.1,120 టికెట్ కు రూ.4,515 గుంజుడు
సికింద్రాబాద్ నుంచి కాకినాడకు సెకండ్ ఏసీ రూ.5,120
రెగ్యులర్ రైళ్లలో కాలు పెట్టడమూ కష్టమే
మిగిలింది సువిధ బండ్లే.. ఎటూ సరిపోని జనసాధారణ్ రైళ్లు

హైదరాబాద్ : ఆయనో రైల్వే ఉద్యోగి. రాజమహేంద్రవరం వెళ్లేందుకు కొన్నిరోజుల ముందు నుంచే రైలు టికెట్లకు ప్రయత్నం చేశారు. ఏ ఒక్క రెగ్యులర్ బండిలోనూ ఖాళీ లేదు. రిజర్వేషన్ కాదు కదా.. నిరీక్షణ టికెట్లూ(వెయిట్ లిస్ట్) దొరకలేదు. చూడగా చూడగా రెండు, మూడు ప్రత్యేక రైళ్లలో కొన్ని ఖాళీలు.. హమ్మయ్య అనుకున్నారు. కానీ, టికెట్ ధర చూడగానే కళ్లు బైర్లు కమ్మాయి. సెకండ్ ఏసీలో టికెట్ ధర ఏకంగా రూ.4,515.. థర్డ్ ఏసీలో రూ.3,220 . రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే వీటిలో ఛార్జీలు 300 శాతం అదనం. ఒక్కో టికెట్ పై రూ.2,500 నుంచి రూ.3,500 అధికంగా భరించాలి. కుటుంబంతో కలిసి నలుగురు వెళ్లాలి. వామ్మో.. మనవల్ల కాదులే అనుకుంటూ రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు. .. రైల్వే ఉద్యోగే ఇంతలా బేజారైతే, ఇక సామాన్యుల మాటేంటి? సంక్రాంతి పండక్కి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు రైళ్లలో రిజర్వేషన్ దొరక్క ప్రత్యేక బండ్లలో ఛార్జీల మోతతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు అయితే సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.5,000 దాటేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

18 వరకు కిటకిట తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎవరు ఎక్కడకు వెళ్లినా ఈ పండక్కి సొంతూళ్లలో వాలిపోతారు. 14న భోగి, 15న సంక్రాంతి పండగలు. శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు మొదలయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో రద్దీ మొదలైంది. రెండో శనివారం కావడంతో 11న, 12న ఆదివారం, 18 సోమవారం వరకు భారీ రద్దీ కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో రెగ్యులర్ రైళ్లలో నిరీక్షణ(వెయిట్ లిస్ట్) పరిమితి దాటిపోయి ‘రిగ్రెట్ కు చేరుకుంది. ఒక్కో రైల్లో ఏకంగా నాలుగైదు వందల మందికి వెయిట్ లిస్ట్ టికెట్లు ఇవ్వడంతో.. బోగీల్లో కాలయినా మోపలేని పరిస్థితులు తలెత్తనున్నాయి. ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, నెల్లూరు, – చిత్తూరు, అనంతపురం వైపు వెళ్లే రైళ్లకు డిమాండ్ భారీగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రత్యేక రైళ్ల – సంఖ్యను 80శాతం మేర పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే చెబుతున్నా.. రద్దీ రోజుల్లో మాత్రం అందుకు అనుగుణంగా అవి లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రత్యేక రైళ్లు అంటేనే ఎప్పుడు బయల్దేరుతాయో… ఎన్ని గంటలు ఆలస్యంగా గమ్యం చేరుతాయో తెలియదు. అయినా వీటి రూపేణా తమ అవసరాల్ని ద.మ. రైల్వే వీలైనంతా సొమ్ము చేసుకుంటోందని ప్రయాణికులు ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

12న డిమాండ్ భారీగా ఉంది. రాజమహేంద్రవరానికి సెకండ్ ఏసీ టికెట్ రూ.4,770కి వెళ్లింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 11, 18 తేదీల్లో సువిధ ప్రత్యేక రైళ్ల ఛార్జీలు చూస్తే- సెకండ్ ఏసీలో రూ. 4,515, థర్డ్ ఏసీలో రూ.3,220గా ఉంది. విమాన టికెట్ల ఛార్జీల తరహాను మించి పెరిగే ‘సువిధ రైళ్లను సంక్రాంతికి రానుపోను ద.మ.రైల్వే 20 వరకు నడుపుతోంది. తత్కాల్ ప్రత్యేక రైళ్ల విషయానికి వస్తే.. తరగతి, దూరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.ఆరేడు వందల వరకు అదనం భారం పడుతోంది.

జనసాధారణ్ బండ్లు అరకొరే: సామాన్య ప్రయాణికుల కోసం ద.మ.రైల్వే జనసాధారణ్ రైళ్లు ప్రకటించింది. కానీ ప్రధాన మార్గాల్లో సగటున రోజుకు ఒకట్రెండు రైళ్లే ఉండటంతో ఎటూ సరిపోని పరిస్థితి. తెలంగాణ జిల్లాల ప్రయాణికుల్ని ద.మ.రైల్వే పూర్తిగా విస్మరించటం విమర్శలకు తావిస్తోంది.

Courtesy Eenadu