ప్రపంచ వాణిజ్యానికి వ్యవసాయాన్ని అప్పజెప్పే మార్గంలోని ప్రతి చర్య (పైన తెలిపిన వాస్తవాల వలన) దేశీయ ఆహార ఉత్పత్తులను తగ్గించేదే. ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గినప్పుడు లేదా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రయివేటు వర్తకంపైన ఎత్తివేసిన నిల్వలు చేసుకునే పరిమితులను (నిల్వలు చేసుకొని లాభాలు పొందకుండా) తిరిగి అమల్లోకి తీసుకొని వస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆహార ధాన్యాల ధరల్లో ఏ విధమైన పెరుగుదల లేకుండానే ఆకలి వ్యక్తం అవుతుంది. ఇది వలస పాలనాకాలంలో తరుచుగా జరిగిన విధంగా శ్రామికులలో తగ్గిన డిమాండ్‌ ఫలితంగానే జరుగవచ్చు.

మహానగర పెట్టుబడిదారీ వ్యవస్థ (మెట్రోపాలిటన్‌ క్యాపిటలిజం) ఉన్న ప్రపంచంలో చల్లటి వాతావరణ ప్రదేశాల్లో సంవత్సరం పొడవునా అసలు పండించని వివిధ రకాల పంటలను ఉష్ణ మండల ప్రదేశాలలో పండించవచ్చు. వాటిలో పానీయాల తయారీకి ఉపయోగించే, పీచు పదార్థాలున్న పంటలు, కూరగాయలు, పండ్లు, వివిధ రకాల ధాన్యాలు, నూనెలకు సంబంధించిన పంటలు ఉన్నాయి. ఇప్పటికే నిర్దిష్ట విస్తీర్ణంలో సాగుచేయబడుతున్న ఉష్ణమండల భూభాగం ఉత్పాదకతను పెంచుతుంది. ఈ సాగు భూమి విస్తీర్ణం ఇంకా పెరగదు. ఈ భూమి ఉత్పాదకత ఇంకా పెరగడానికి ప్రభుత్వ పెట్టుబడి (కార్ల్‌ మార్క్స్‌ సమర్థ వంతమైన పరిశీలనలతో గుర్తించిన విధంగా) అవసరం. నయా ఉదారవాద విధానంలో ఉన్నా లేక బంగారం ప్రమాణం ఆధారంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉన్నా, మహానగర పెట్టుబడిదారీ వ్యవస్థ డిమాండ్‌ చేసే ‘సరియైన ద్రవ్య విధానాన్ని’ ప్రభుత్వ పెట్టుబడి అనుమతించదు.

కాబట్టి మహానగర పెట్టుబడిదారీ వ్యవస్థకు అవసరమైన ఉత్పత్తులను పొందడానికి, ఉష్ణమండల ప్రదేశాలలో పెద్ద భూభాగాలను ఉపయోగించడంపై ఏ విధంగా అదుపు సాధించాలన్నదే ఆ వ్యవస్థ ముందున్న సమస్య. ఆ విధమైన అదుపు దేశీయ ఆహార ఉత్పత్తులను బలహీన పరుస్తుంది కాబట్టి, మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలను, ఆహార పంటలను పండించడానికి ఉపయోగించే భూములను మహానగరాలు డిమాండ్‌ చేస్తున్న పంటలు పండించడానికి మార్చుకోమని ఒప్పించడం, అంటే ఉష్ణ మండల వ్యవసాయాన్ని, ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యం వైపు మరల్చమని ఒప్పించడం ఇప్పుడున్న సమస్య. తరువాత ప్రపంచ వాణిజ్యంలో ఉండే మహానగర కొనుగోలు శక్తి అవసరమైన పని చేస్తుంది.

దేశీయ ఆహార డిమాండ్‌ను పరిమితం చేయడమే కాకుండా, మహానగరాలు డిమాండ్‌ చేసే ఉత్పత్తుల కోసం భూమిని ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూనే, పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో మహానగరాలు డిమాండ్‌ చేసే సరుకులను ఉచితంగా అందించే అంతతేలికగా పన్నుల వ్యవహారం వలసవాద పాలనలో ఉండేది. స్వాతంత్య్రం తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో వాటి ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. కానీ నయా ఉదారవాదంతో భిన్నమైన మార్గాల్లో డిమాండ్‌ తగ్గించబడడం వల్ల ఉష్ణ మండల ప్రదేశాలలోని భూమిని, మహానగరాల ఉపయోగం కొరకు అందుబాటులో ఉంచారు.

అయినప్పటికీ భారతదేశం ఆహార ఉత్పత్తి ప్రాధాన్యత లో వెనకడుగు వేయలేదు. సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారతదేశంపై ముందు ప్రకటించిన ధరలకే ఆహార ధాన్యాలను పొందే విధానం (ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీలకమైన విధానం) నుంచి వెనక్కి తగ్గమని ఒత్తిడి తెచ్చాయి. కానీ ఏ భారత ప్రభుత్వం ఆ ఒత్తిడి ఉచ్చులో పడే సాహసం చేయలేదు.

కాబట్టి ఒకవైపు ఆహార ధాన్యాల ఉత్పత్తికి (తలసరి ఉత్పత్తి ఖర్చు,1991-2015-16 మధ్య కాలంలో తగ్గినప్పటికీ) ప్రోత్సాహం లేకపోవడంతో, అనేక మార్గాల్లో కార్మికుల డిమాండ్‌ తగ్గింది. నిత్యావసర సేవల ప్రయివేటీకరణ ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చుల్లో కోతల ద్వారా, దారిద్య్ర రేఖకు ఎగువన, దిగువన ఉన్న వ్యత్యాసాల వల్ల కార్మికుల డిమాండ్‌ తగ్గిన ఫలితంగా పెద్ద ఎత్తున ఆహార నిల్వలు పోగు పడినాయి. అలాంటి నిల్వలే వాస్తవానికి ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకున్నాయి. ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉన్న 77 మిలియన్ల ఆహార ధాన్యాల నిల్వల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేశారు. దేశానికి వాస్తవానికి అంత పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వల అవసరం ఉండదు. ఆకలి బాధలతో ఉన్న కార్మికుల చేతిలో కొనుగోలు శక్తిని సమకూర్చడమే, పెద్ద మొత్తంలో నిల్వ ఉన్న ఆహార ధాన్యాల సమస్యకు పరిష్కారం. (112 ఆకలితో ఉన్న దేశాల్లో, భారత దేశం 100వ స్థానంలో ఉన్నట్టు ఆకలి సూచిక సూచిస్తోంది.) ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తగ్గుదల ఉన్న కారణంగా సంభవించలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుదల (పంట నష్టం జరిగినప్పుడు) దేశాన్ని తేలికగా కరువు లాంటి పరిస్థితుల్లోకి నెట్టి వేయగలదు.

మహానగరాలు డిమాండ్‌ చేసే పంటల కొరకు భారతదేశం, తన భూభాగాలను సమర్పించాలనీ, దానికి బదులుగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలనీ, దాని వల్ల ఆహార కొరత ఏర్పడదని సామ్రాజ్యవాదం వాదిస్తూ వస్తుంది. ఈ వాదన తప్పు అనడానికి మూడు కారణాలున్నాయి. మొదటిది, భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు ప్రపంచ మార్కెట్‌కు వెళ్ళినప్పుడు ధాన్యం ధరలు వెంటనే పెరుగుతాయి. అప్పుడు పైకి చూడడానికి తెలివైన పనిగా కనిపిస్తుంది, కానీ ఇతర ఎగుమతి చేసే పంటలను ఉత్పత్తి చేయడం, ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం తెలివి తక్కువ చర్యలవుతాయి. రెండవది, ఎగుమతి చేస్తున్న పంటల ఉత్పత్తికి ఒక యూనిట్‌ భూమికి తక్కువ కూలీల అవసరం ఉంటుంది. ఎగుమతి చేసే పంటల ఉత్పత్తి ఉపాధిని తగ్గించి, కూలీలు, రైతుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వారు ఇంతకు ముందు ఆహార ధాన్యాల కోసం చేసిన డిమాండ్‌ ఇప్పుడు చేయలేరు. వాణిజ్యం ద్వారా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ వారు కొనలేని స్థితి ఉంటుంది. మూడవది, తమకు అవసరమైన పంటల కొరకు తమ ఆహార ఉత్పత్తులను వదలివేయాలని సామ్రాజ్యవాద దేశాలు, మూడవ ప్రపంచ దేశాలను ఒప్పించి, అప్పుడు ఆహారాన్ని సరఫరా చేస్తామని రాజకీయాలు చేస్తాయి. ఆహార నిరాకరణ అనేది సామ్రాజ్యవాద ఆయుధశాలలో ఒక బలమైన ఆయుధం. అవి ఆ ఆయుధాన్ని నిర్దాక్షిణ్యంగా ప్రయోగిస్తాయి. ఇది ఎప్పటికీ ‘సాధారణ’ అంతర్జాతీయ వాణిజ్యం కాదు.

ఆఫ్రికా దేశం విషయంలో ఇదే జరిగింది. ఆహార ధాన్యాల బదులుగా, ఎగుమతి చేయడానికి ఆహారేతర పంటలు పండించిన కారణంతో కరువు సంభవించి సహారన్‌ ఆఫ్రికాను కుదిపేసింది. అమెరికా అరవై దశకం మధ్యలో అత్యంత దారుణంగా తనకు ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఒత్తిడి చేసి ఒప్పించడం వల్లే భారతదేశం హరిత విప్లవం ద్వారా దేశీయ ఆహార ఉత్పత్తులను పెంచింది. ఆనాటి నుంచి ఏ భారత ప్రభుత్వం కూడా (సరిగా పంటలు పండని సంవత్సరం కూడా) దిగుమతి చేసుకునే ఆహారధాన్యాలపైన ఆధారపడాలన్న ఆలోచనకు పూనుకోలేదు.

కానీ బీజేపీ ప్రభుత్వానికి మినహాయింపు ఉంది. మధ్య యుగాల మనస్తత్వాన్ని ప్రదర్శించి, తక్కువ అవగాహన ఉండి, నిజాయితీ గల మేథావుల అభిప్రాయం పట్ల గౌరవంలేని వ్యక్తులను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు బాధ్యులుగా నియమించారు. వారి అజ్ఞానం వారిని సామ్రాజ్యవాద భావాలపై ఆధారపడేట్టు చేయడంతో, వారు సామ్రాజ్యవాదం చేతిలో పావులుగా మారారు. దీనికి, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన తన ‘వ్యవసాయ విధానం’ చక్కని నిదర్శనం. ఈ వ్యవసాయ విధానం, భారతదేశ సాంప్రదాయ విధానంతో పోలిస్తే పూర్తిగా విరుద్ధమైనది.

ప్రభుత్వం మూడు ఆర్డినెన్సులను ప్రకటించింది. మొదటిది, వ్యవసాయ వర్తకులపై నిల్వలు చేసుకునే పరిమితులను తొలగించింది. రెండవది, వ్యవసాయ వర్తకాలు కేవలం నిర్దిష్ట ప్రదేశాలలోనే (వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ) జరగాలన్న ఒడంబడిక తొలగించింది. మూడవది, కాంట్రాక్టు వ్యవసాయానికి అనుమతినిచ్చింది. ఈ మూడు ఆర్డినెన్సులు మన వ్యవసాయాన్ని పూర్తిగా ప్రపంచ వాణిజ్యానికి అప్పచెపుతాయి. అవి విదేశీ వ్యాపారులతో పాటు ప్రయివేటు వ్యాపారులు కూడా వ్యవసాయ ఉత్పత్తుల వర్తకాలలోకి ప్రవేశించడానికి నియమనిబంధనలను సులభతరం చేస్తాయి. ఇదే అంతర్జాతీయ వాణిజ్యానికి మన వ్యవసాయాన్ని అప్పగించే మార్గం. దీన్నే సరిగ్గా సామ్రాజ్యవాదం చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వచ్చింది, కానీ ఇప్పటి వరకు దానిని ప్రతిఘటిస్తూ వచ్చాం. ఈ ప్రతిఘటన, దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తికి మద్దతు చర్య, ఒక వ్యవస్థాగతమైన యంత్రాంగం ద్వారా ప్రభావితమైంది. ఈ ఆర్డినెన్సులు ఆ యంత్రాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఉదాహరణకు, ఆహార ధాన్యాల ఉత్పత్తికి ధరలు ప్రకటించడం ద్వారా మద్దతు ఉండేది. ఆ ధరలకే ఎఫ్‌సీఐ నిర్దిష్ట మార్కెట్‌లలో ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసేది. ఒకసారి ఈ మార్కెట్లకు ప్రాధాన్యత తగ్గినప్పుడు, ప్రకటించిన ధరలకు మద్దతు ఇచ్చినప్పటికీ ఇబ్బందికరంగా ఉంటుంది. అదే విధంగా ఒకవేళ ఉత్పత్తి దారులకు, వలసవాదం కాలంలో లాగా ఎగుమతి చేసే పంటల కాంట్రాక్టు ఇస్తే, కొంత కాలానికి ఆ పంటలు ఆహార ధాన్యాల ఉత్పత్తికి ప్రత్యామ్నాయం అవుతాయి.

ఇదంతా రైతుల ప్రయోజనాల కోసం కాదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మొదటిది, ఇంతకు ముందు ఉన్న విధానం రైతుల, వినియోగదారుల ఇద్దరి ప్రయోజనాలు నెరవేర్చేది. ఏకకాలంలో జరిగే ఈ ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు లేకుండా పోతున్నాయి. రెండవది, ఏదైనా ఒక సంవత్సరంలో ఈ ఆర్డినెన్సుల వల్ల రైతులకు లాభం పొందుతున్నారని అనిపించవచ్చు. కానీ అవి వారిని బహుళజాతి వ్యాపారుల అదుపులోకి శాశ్వతంగా నెట్టి వారి ప్రయోజనాలకు ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. ఈ మూడు ఆర్డినెన్సుల ఒక ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ పనిలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చించకుండానే ఈ ఆర్డినెన్సులను జారీ చేసింది. భారతదేశంలో వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. దీనిలోకి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూ డదు. వ్యవసాయ వర్తకం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందనీ, అందుకే కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదనీ, కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలపై పరోక్షంగా బలమైన ప్రభావాలు చూపించే మార్పులు చేస్తే, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాల్లోకి అక్రమంగా చొచ్చుకు పోవడం, రాజ్యాంగ పరిమితులను ఉల్లంఘించిన దానితో సమానం అవుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఇటువంటి చర్యలు భారతదేశాన్ని ఒక ఏకీకత దేశంగా మారుస్తున్న బీజేపీ ప్రభుత్వంలో సాధారణ విషయాలుగా మారాయి.

ప్రపంచ వాణిజ్యానికి వ్యవసాయాన్ని అప్పజెప్పే మార్గంలోని ప్రతి చర్య (పైన తెలిపిన వాస్తవాల వలన) దేశీయ ఆహార ఉత్పత్తులను తగ్గించేదే. ఆహార ధాన్యాల ఉత్పత్తులు తగ్గినప్పుడు లేదా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రయివేటు వర్తకంపైన ఎత్తివేసిన నిల్వలు చేసుకునే పరిమితులను (నిల్వలు చేసుకొని లాభాలు పొందకుండా) తిరిగి అమల్లోకి తీసుకొని వస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆహార ధాన్యాల ధరల్లో ఏ విధమైన పెరుగుదల లేకుండానే ఆకలి వ్యక్తం అవుతుంది. ఇది వలస పాలనాకాలంలో తరుచుగా జరిగిన విధంగా శ్రామికులలో తగ్గిన డిమాండ్‌ ఫలితంగానే జరుగవచ్చు. కాబట్టి మన ముందున్న హామీలన్నీ అర్థరహితం. బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాదం ముందు సాగిలబడే చర్యలు భారతదేశ ప్రజలు ఆకలి, కరువును ఎదుర్కొనే మార్గం లోకి నెట్టివేస్తున్నాయి.

‘పీపుల్స్‌ డెమోక్రసీ’ నుంచి
ప్రభాత్‌ పట్నాయక్‌
అనువాదం బోడపట్ల రవీందర్‌

Courtesy Nava Telangana