– జైళ్లలో నిర్బంధిస్తున్న పోలీసులు
– ‘రాళ్ల దాడి మూక’గా ముద్ర వేస్తున్న వైనం
– బయటకు రావాలంటే జంకుతున్న టీనేజర్లు
శ్రీనగర్‌: కాశ్మీర్‌లో రోజురోజుకు పరిస్థితులు మరింతగా దిగజారిపోతున్నాయి. పోలీసులు, పాలనాయంత్రాంగం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు ఈ ఏడాది ఆగస్టు 5న తీసుకున్న ఏకపక్ష నిర్ణయం అనంతరం ఆంక్షలు, నిర్బంధాలతో లోయలో చీకటి పరిస్థితులు నెలకొన్నాయి . రాజకీయ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలతో పలువర్గాల నుంచి ఇప్పటికే అపకీర్తిని మూటగట్టుకున్న కేంద్రం.. కాశ్మీర్‌లో చిన్నారులను సైతం వదలండం లేదు. లోయలోని టీనేజర్లను పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. వారిని ‘రాళ్ల దాడి మూక’గా పేర్కొంటూ తమ అరెస్టులను సమర్థించుకునే యత్నం పోలీసులు చేస్తున్నారు. జైళ్లలో నిర్బంధంలో ఉన్న చిన్నారుల కుటుంబీకులు బాండ్‌ పేపర్లపై సంతకాలు చేసి పూచీకత్తుతో తమ వారిని విడిపించుకుపోవాల్సిన దుస్థితి లోయలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లడానికి చిన్నారులు.. వారిని బయటకు పంపించడానికి వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. దీంతో కేంద్రం, రాష్ట్రయంత్రాంగంతో పాటు పోలీసుల తీరుపై కాశ్మీర్‌లోని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల్లో లోపించిన జవాబుదారీతనం
లోయలో జునైద్‌తో పాటు మరో ముగ్గురు టీనేజర్లను(పేర్లు మార్చాం) పోలీసులు కొన్నిరోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల స్థాయి విదార్థులైన వారు తమ వార్షిక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ఆ చిన్నారుల అరెస్టును తెలుసుకున్న వారి కుటుంబీకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తమ చిన్నారులను విడుదల చేయాలంటూ పోలీసులను వారు డిమాండ్‌ చేశారు. ”వారంతా(టీనేజర్లు) రాళ్ల దాడిలో పాల్గొన్నవారు” అని ఈ సందర్భంగా చిన్నారుల కుటుంబాలకు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం. దీంతో ఆ చిన్నారులు కొన్ని రోజులపాటు జైలులోనే గడిపారు. ”జైలులో ఉన్న సమయంలో పోలీసులు నన్ను చిత్రవధ చేశారు. కేబుల్స్‌తో కొట్టారు. నా వెన్నుపై పిడిగుద్దులు గుద్దారు” అని జునైద్‌ గుర్తు చేసుకున్నారు.
బాండ్‌ పేపర్లపై సంతకాలు
కాగా, చిన్నారుల విడుదల కోసం వారి కుటుంబీకులు, స్థానికులు బాండ్‌ పేపర్లపై సంతకాలు చేశారు. ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలూ చేయబోమని బాండ్‌ పేపర్‌లపై పోలీసులు వారితో సంతకాలు చేయించుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా తమకు చెందిన ఐడీ కార్డు కాపీలు, ఫోన్‌ నెంబర్లను పోలీసులు తీసుకున్నారని సంతకాలు చేసినవారిలో ఒకరు వివరించారు. ఒకవేళ నిరసనలు జరిగితే పోలీసులు తమను అరెస్టు చేస్తామని బెదిరించినట్టు తెలిపారు.
మూడు నెలలు..500 మందికి పైగా చిన్నారుల నిర్బంధం
ఇలాంటి నిర్బంధాలు సరికాదని తాజా నివేది కలో ‘ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా’ పేర్కొన్నది. కాశ్మీర్‌లో నిర్బంధాలు అధికారిక ప్రక్రియలో జరగడం లేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఆగస్టు 5 అనంతరం జమ్మూకాశ్మీర్‌లో చిన్నారుల అరెస్టులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జువైనల్‌ కమిటీ 52 పేజీల తో కూడిన ఒక రిపోర్టును సమ ర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 144 మంది మైనర్లను జమ్మూకాశ్మీర్‌లోని యంత్రాంగాలు అరెస్టు చేశాయని అందులో పేర్కొన్నది. బటమాలు, సౌరా, రాజ్‌బాఫ్‌ు, సద్దర్‌, పరింపొర, బుద్గాం, పుల్వామా ప్రాంతాల నుంచి చిన్నారులను అధికంగా అరెస్టు చేసినట్టు నివేదిక సారాంశం. అయితే విశ్వసనీయవర్గాల సమ చారం మేరకు.. గత మూడు నెలల్లో 500 మందికి పైగా చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారనీ, శ్రీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఇవి అధికంగా ఉన్నాయని తెలిసింది. అయితే వీరిలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు బాండ్‌ పేపర్ల పై సంతకాలు చేసిన అనంతరమే విడుదలయ్యారు. చిన్నారుల నిర్బంధాలపై ఈనెల 5న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై తాజా నివేదికను దాఖలు చేయాలని కమిటీని ఆదేశించింది. వచ్చేనెల 3న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను చేపట్టనున్నది.

Courtesy Navatelangana…