• నిలోఫర్‌ ఆస్పత్రిలో డైట్‌ కుంభకోణం
  • నవంబరులోనే చెప్పిన నిజమేనని తేల్చిన విచారణ కమిటీ 
  • మరిన్ని ఆస్పత్రుల్లో ఇదే వ్యవహారం 

ఒక వార్డులో 38 మందికి భోజనం పెట్టారు. దానిని 88 మందిగా రికార్డుల్లో మార్చేశారు! మరోచోట 55 మందికి భోజనం పెట్టి.. 155 మందికి పెట్టినట్లు చూపించారు! ఒక రోగికి ఒక పూటలోనే రెండుసార్లు భోజనం పెట్టారట! ఇంకా విచిత్రం ఏమిటంటే.. నిలోఫర్‌ ఆస్పత్రిలో ఎక్కువగా పసిగుడ్డులే ఉంటారు! కానీ, వారికి రోజుకు ఏకంగా 3200 కేలరీలున్న హై ప్రొటీన్‌ డైట్‌ పెట్టేశారట! ఇటువంటి అడ్డగోలు దోపిడీతో ఒక్క నిలోఫర్‌ ఆస్పత్రిలోనే రూ.3 కోట్లు బొక్కేశారు! ఇదే విషయాన్ని హైప్రొటీన్‌ దోపిడీ’ శీర్షికతో గత ఏడాది నవంబరు 14ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ : డైట్‌ కుంభకోణంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఒక్క నిలోఫర్‌ ఆస్పత్రిలోనే డైట్‌ కుంభకోణం విలువ రూ.3 కోట్లకు పైనేనని లెక్కగట్టింది. మిగిలిన ఆస్పత్రుల్లో దోపిడీపై నిగ్గు తేల్చాల్సి ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన వైద్య విద్య సంచాలకులు రమేశ్‌ రెడ్డి అప్పట్లో ఓ కమిటీని నియమించారు. తాజాగా, ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై మంత్రి ఈటల రాజేందర్‌ ఆ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం చర్చించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నిలోఫర్‌ ఆస్పత్రిలో గత మూడేళ్లుగా చిన్నారులకు ఇచ్చే ఆహారం విషయంలో భారీ కుంభకోణమే జరిగింది. రెండున్నరేళ్లలో రూ.3 కోట్ల సర్కారీ సొమ్మును అప్పనంగా ఫుడ్‌ కాంట్రాక్టర్‌ తన జేబులో వేసుకున్నట్లు తేలింది.

నిలోఫర్‌ ఆస్పత్రిలో ఎక్కువ శాతం చిన్నారులే చికిత్స పొందుతుంటారు. 15 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 2104 కేలరీల ఆహారం సరిపోతుందని జీవో నంబర్‌ 325లో ఉంది. కానీ, 3200 కేలరీలున్న హైప్రొటీన్‌ డైట్‌ను పిల్లలకూ ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపినట్లు నివేదిక పేర్కొంది. నిలోఫర్‌లో 16 వార్డులు ఉండగా, వార్డుకు 30 పడకలు ఉంటాయి. వార్డులో ఎంత మంది ఉన్నారు? మరుసటి రోజుకు ఎంత మందికి ఆహారం అవసరం? ఏం ఆహారం ఇవ్వాలి? అన్న ఇండెంట్‌ను తీసుకొని డైటీషీయన్‌కు పంపాలి. ఆ ఇండెంట్‌ ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు వెళ్తుంది. దాని ఆధారంగానే వార్డుల్లో రోగులకు భోజనం అందిస్తారు. రోగులకు వారి ఆరోగ్య స్థితిని బట్టి సాధారణ డైట్‌ (రూ.40) హైప్రొటీన్‌ డైట్‌ (రూ.56) ఇవ్వాలన్నది చార్ట్‌లో రాస్తారు. వాటితో సంబంధం లేకుండా 95 శాతం మందికి హైప్రొటీన్‌ డైట్‌ ఇస్తున్నట్లు లెక్కల్లో చూపారు.

 అంతా ట్యాంపరింగే!
ఆరోజు ఆ పూట సదరు వార్డులో ఎంతమంది ఇన్‌పేషెంట్లు ఉన్నారో.. వారికి ఎన్ని డైట్లు కావాలో హెడ్‌ నర్సుకు ఇన్‌చార్జి డైట్‌ బుక్‌ రాసి పంపిస్తారు. దాని ప్రకారం రోగులకు అందజేస్తారు. వార్డుల్లోని డైట్‌ బుక్స్‌లో రాసేది ఒకటైతే… కాంట్రాక్టరు డైట్‌ బుక్‌లో రాసుకునేది మరొకటి ఉందని నివేదిక వెల్లడించింది. డైట్‌ బుక్‌లో 38 ఉంటే.. దాన్ని తమ రికార్డులో 88గా, 55 మందికి డైట్‌ ఇస్తే… 155గా మార్చేసుకున్నారు. జననీ శిశు సంరక్షణ కార్యక్రమం, ఆరోగ్యశ్రీ రోగులకు ఇచ్చే డైట్‌కు ప్రభుత్వం రూ.100 వేరేగా ఇస్తుండగా, వారినీ తమ రికార్డుల్లో చూపించుకుని క్లెయిమ్‌ చేసుకున్నారు. ఒక్కో వార్డులో నెలకు అదనంగా రూ.70-80 వేల వరకు బిల్లులు క్లెయిమ్‌ చేసుకున్నట్లు తేల్చింది.

అక్రమాల్లో కొన్ని..

  • ఇండెంట్స్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
    ఒకే పేరున్న రోగికి ఒకే సమయంలో రెండు సార్లు డైట్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపారు.
  • ఒక వార్డులో ఉన్న రోగి మరుసటి రోజుకు ఇంకో వార్డుకు షిఫ్ట్‌ చేస్తే 2చోట్ల డైట్‌ఇచ్చినట్లు లెక్కలు రాశారు. 
  • ఆరోగ్యశ్రీ, జేఎ్‌సఎ్‌సకే రికార్డుల నిర్వహణే లేదు.
  • ఆరోగ్యశ్రీ డైట్‌ స్లిప్‌లను నేరుగా కాంట్రాక్టర్‌కు పంపి, బిల్లులు చేసుకున్నారు. ఎక్కడా పర్యవేక్షణ లేదు.
  • 2018 మార్చిలో ఒక వార్డులో అదనంగా 478 హైప్రొటీన్‌ డైట్‌ ఇచ్చినట్లు చూపి బిల్లులు క్లెయిమ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు నిలోఫర్‌ ఆస్పత్రిలో అసలు డైటీషీయనే లేరు.

Courtesy Andhrajyothi