న్యూఢిల్లీ, నవంబర్‌ 15: మూడు ఉడకబెట్టిన గుడ్లకు రూ.1,672 చెల్లించాలని ఓ హోటల్‌ బిల్లు వేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. మ్యూజిక్‌ కంపోజర్‌ శేఖర్‌ రౌజియాని ఇటీవల అహ్మదాబాద్‌లోని హయత్‌ రీజెన్సీ హోటల్‌లో మూడు గుడ్లను ఆర్డర్‌ చేశారు. ఇందుకుగాను ఆ హోటల్‌ రూ.1,672 చెల్లించాలంటూ బిల్లును అందజేసింది. దీంతో కంగుతిన్న ఆయన ఆ బిల్లును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘కేవలం మూడు గుడ్లకు రూ.1672 బిల్లా?.. ఇది కనీవినీఎరుగని భోజనం’ అని కామెంట్‌ రాశారు. కాగా జూలైలో సినీ నటుడు రాహుల్‌ బోస్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో రెండు అరటి పండ్లను ఆర్డర్‌ చేసినందుకుగాను రూ.442 బిల్లు రావటం, దానిని ఆయన సోషల్‌ మీడియాలో వెల్లడించడం కలకలం రేపింది.

Courtesy Namaste Telangana…