– వెయ్యిమంది మృతి..
– 70 వేల మంది బాధితులు
– ప్రపంచవ్యాప్తంగా 22 వేల కరోనా మరణాలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ధాటికి యావత్‌ ప్రపంచం గజగజ వణికిపోతున్నది. దాదాపు 350 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. 70కి పైగా దేశాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. కోవిడ్‌-19 ఇప్పటికే 195 దేశాలకు వ్యాపించగా.. ఈ వైరస్‌ కారణంగా గురువారం నాటికి 22 వేల మంది చనిపోయారు. ఐదు లక్షల మంది దీని బారినపడ్డారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర స్థాయిలో ఈ వైరస్‌ వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రజలు హడలెత్తిపోతున్నారు. యూఎస్‌లో ఇప్పటికే 70 వేల మంది దీని బారినపడ్డారు. వేయి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌, వాషింగ్టన్‌, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్‌, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, కరోనా కట్టడికి చర్యలు
తీసుకోవాల్సిన ట్రంప్‌ సర్కారు.. చైనాపై విమర్శలు చేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ గురించి పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు సైతం వస్తున్నాయి.

ఇటలీలో తగ్గుముఖం.. స్పెయిన్‌లో మరణ మృదంగం !
ఇటలీలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టగా.. స్పెయిన్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో 448 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,100 మంది ప్రాణాలు విడిచారు. 57 వేల మంది దీని బారినపడ్డారు. అయితే, చైనా తర్వాత అధికంగా ఇటలీలోనే ఇప్పటివరకూ ఎక్కువగా 75 వేల పాజిటివ్‌ కేసులు నమోదుతో.. 7,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో మరో 157 మంది కోవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 2,300లకు చేరగా.. 29,500 మందికి కరోనా ప్రబలింది.

Courtey Nava Telangana