– మద్దతు ధర లేక కోల్పోయినది క్వింటాలు వరికి రూ. 600, గోధుమకు రూ. 170లు
– అన్నదాత ఆదాయం రెట్టింపయ్యెదెప్పుడో..?
న్యూఢిల్లీ : మోడీ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నది. గత ఎన్నికల సందర్భంలో తాము గెలిస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు.. ఆ హామీని తుంగలో తొక్కింది. 2022 నాటికి తమ హామీని నిలబెట్టుకుంటామని మాయమాటలు చెబుతున్నా.. దానికి సంబంధించి విధివిధానాలేమీ ఇప్పటికీ ప్రకటించలేదు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలుచేయాలనీ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మద్దతు ధర లేకపోవడంతో గతేడాది దేశవ్యాప్తంగా రైతులు రూ. 31 వేల కోట్లను నష్టపోయారు. ముఖ్యంగా వరి, గోధుమ వంటి సాంప్రదాయ పంటల రైతులే గాక వాణిజ్య పంటలు, తృణధాన్యాల రైతులదీ అదే పరిస్థితిగా ఉంది. అతివృష్టి, అనావృష్టిలను ఎదుర్కొని, రుణభారాలను అధిగమించి మరీ రైతులు పంటలు పండిస్తుంటే ప్రభుత్వం మాత్రం వారికి మద్దతు ధర కల్పించకపోవడం గమనార్హం.
ఒక నివేదిక ప్రకారం… 2018-19లో ఉత్పత్తి అయిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు రూ. 31,737 కోట్లు నష్టపోయారు. గతేడాది ఉత్పత్తి అయిన వరి (435,68 లక్షల టన్నులు)కి గానూ రైతులకు దక్కింది రూ. 76,344 కోట్లు. గోధుమ (357.95 లక్షల టన్నులు) రైతులు పొందిన మొత్తం రూ. 65,863 కోట్లు. కానీ ఈ ఉత్పత్తులకు 50 శాతం ధర కల్పిస్తే (వరికి రూ. 1,01,949 కోట్లు, గోధుమకు రూ. 71,894 కోట్లు) రైతులకు మద్దతు ధర దక్కేది. ఇది లేకపోవడంతో వరి రైతులు రూ. 25,705 కోట్లు, గోధుమ రైతులు రూ. 6,031 కోట్లు నష్టపోయారు.
2018-19కి గానూ క్వింటాలు వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ధర రూ. 1,750. కానీ రైతు పెట్టుబడికి 50 శాతం కల్పించి ఇస్తే అప్పుడు దాని ధర రూ. 2,340లు ఉండేది. ఈ కారణంగా రైతులు క్వింటాలు వరిధాన్యంపై సుమారు రూ. 600 వరకు నష్టపోయారు. గోధుమ రైతులకు క్వింటాలుకు రూ. 1,840కు అమ్ముకున్నారు. కానీ, క్వింటాల్‌ గోధుమకయ్యే ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కల్పించి ఇస్తే దాని ధర రూ. 2008గా ఉండేది. దీంతో గోధుమ రైతులకు క్వింటాలుకు దాదాపు రూ. 170ల నష్టం ఏర్పడింది. వీటితో పాటు మొక్కజొన్న రైతులు క్వింటాలుకు 520, రాగులు పండించే రైతులు రూ. 650లు నష్టపోయారు.

Courtesy navatelangana