– వెయ్యి వెంటిలేటర్లు కావాలని కోరిన రాష్ట్రం
– కేంద్రం నుంచి స్పందన కరువు
– కొనుగోలు కోసం డీఆర్‌డీఓకి వినతి
– అక్కడా.. వెయిటింగ్‌
– దాతలే పెద్ద దిక్కుగా మారుతున్న వైనం

రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు మొదలైన మార్చి తొలి వారంలోనే వెంటిలేటర్లను సమకూర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది. అప్పటికే అందుబాటులో ఉన్న 300 వెంటిలేటర్లలో కొన్ని పాడైపోగా యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేసి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో క్లిష్ట పరిస్థితిలో ఉండే రోగులకు అత్యవసర చికిత్స కోసం వెంటిలేటర్లను ఇవ్వాలని ప్రభుత్వం దాతలను కోరింది. వారి నుంచి ఇప్పటి వరకు ఎన్‌ 95 మాస్కులు, పీపీఈ కిట్లను సమకూర్చుకోగలిగింది. తాజాగా మంగళవారం మైక్రాన్‌ సంస్థ మొదటి సారి ముందుకు వచ్చి వంద వెంటిలేటర్లను అందజేయడంతో ప్రస్తుతం 400 వెంటిలేటర్లున్నాయి. వీటిలోనూ అన్ని కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రికే పరిమితం కాకుండా ఆయా ఆస్పత్రుల్లో ఉన్నాయి.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ను వెయ్యి వెంటిలేటర్లు సమకూర్చాలని కోరారు. అయితే కేంద్రం నుంచి వెంటిలేటర్లు రాకపోవడంతో ప్రత్యామ్నాయాల వైపు సర్కారు దృష్టి నిలిపింది. దాతలను కోరడంతో పాటు వెయ్యి వెంటిలేటర్లను కొనుగోలు చేయాలని డీఆర్‌డీఓకు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో డీఆర్‌ డీఓకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. దీంతో కేంద్రం కోరిన ఆర్డర్లు పూర్తయిన తర్వాత రాష్ట్రానికి వెంటిలేటర్లు అందిస్తామని డీఆర్‌డీఓ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో వాటి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఆర్‌డీఓ ఇస్తున్న వెంటిలేటర్‌ కు ఒక్కంటికి రూ.ఆరు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ధర ఉండగా, బయటి మార్కెట్లో రూ.10 లక్షల వరకు ఉన్నది.

ఒక్కసారిగా కేసులు పెరిగితే?
వందమందిలో మూడు నుంచి నాలుగుశాతం మందికి వెంటిలేటర్లపై చికిత్స అవసరమవుతుందని అనుభవాలు చెబుతున్నాయి. మిగిలిన వారిలో నాలుగుశాతం మందికి అత్యవసర చికిత్స అందించాల్సిఉంటుంది. మిగతా వారికి సాధారణ చికిత్సనందిస్తే సరిపోతున్నది. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ప్రతి రోజూ సరాసరిగా 50 కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేవలం పాజిటివ్‌ కేసులతో కాంటాక్ట్‌ అయిన వారికి, అనుమానిత లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో కేసులు కూడా తక్కువగా వస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తున్నది. మరోవైపు హైకోర్టు పరీక్షల సంఖ్య పెంచాలంటూ ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో రానున్న కాలంలో కేసులు మరింత పెరిగితే అంతే స్థాయిలో వెంటిలేటర్ల అవసరం కూడా పెరుగుతుంది. అనుకున్న సమయానికి వెంటిలేటర్లు రాకపోతే పరిస్థితి దిగజారే ప్రమాదమున్నది. భవిష్యత్‌ అవసరాల దష్ట్యా కేంద్రం రాష్ట్రానికి చాలినన్ని వెంటిలేటర్లు పంపాలని వైద్యనిపుణులు కోరుతున్నారు.

వెయ్యి వెంటిలేటర్లు కావాలని కోరాం : ఈటల
వెయ్యి వెంటిలేటర్లు కావాలంటూ కేంద్రాన్ని కోరినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా కేసులు నమోదైన తొలి రోజుల్లోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ను ఈ మేరకు అడిగినట్టు గుర్తుచేశారు. వెంటిలేటర్లను దాతల నుంచి సేకరించడంతో పాటు కొనుగోలు కోసం ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. మంగళవారం అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌, గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మైక్రాన్‌ సంస్థ వంద వెంటిలేటర్లను మంత్రికి అందజేసింది. మరో వంద వెంటిలేటర్లు ఇస్తామంటూ గ్రేస్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ చినబాబు ప్రకటించారు.

లక్ష మందికి చికిత్స అందించగలం : మంత్రి ఈటల
రాష్ట్రంలో లక్ష మందికి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.అయితే ప్రస్తుతానికి రోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో గాంధీ ఆస్పత్రిలోనే కరోనా రోగులందరికీ చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం సచివాలయంలో గాంధీలో అందుతున్న చికిత్సపై మంత్రి సమీక్షించారు. అత్యవసర చికిత్స పొందుతున్న 30 మంది వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగుల వివరాలను ఎప్పటికప్పుడు బంధువులకు తెలపాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావుకు సూచించారు.

Courtesy Nava Telangana