–  త్రిపుర సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
అగర్తల : ‘ఒక దేశం ఒకే భాష’ అంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఒకపక్క దుమారం చెలరేగుతుండగా… మరోవైపు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాషా, సాంస్కృతిక వైవిధ్యానికి నిలయమైన దేశ నేపథ్యాన్ని విస్మరించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు త్రిపుర సీఎం వంతపాడారు. హిందీని వ్యతిరేకించేవారికి దేశ మంటే ప్రేమలేదనీ, అలాంటివారు భారతీయులేకాదు అని అన్నారు.దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ అనీ, అందుకే అది మన జాతీయ భాష అయ్యిందని చెప్పారు. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించకపోతే… ఇంగ్లీషు భాష మన అధికారిక వ్యవహారాల్లో ఉండేదికాదన్నారు. అయితే తాను ఇంగ్లీషుకు వ్యతిరేకంకాదని తెలిపారు. అమిత్‌షా వ్యాఖ్యలపై ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా అమిత్‌ షా వ్యాఖ్యలతో ఏకీభవించటంలేదని చెప్పారు. ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు అమిత్‌షా వ్యాఖ్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విదితమే.

(Courtesy Nava Telangana)