న్యాయవ్యవస్థ స్వతంత్రతకే మచ్చ
గొగోయ్‌కు రాజ్యసభ సీటుపై దుమారం
రాజ్యాంగంపైనే దాడి: కాంగ్రెస్‌

ఇది అనైతికం: వామపక్షాలు
గొగోయ్‌ రాజీపడ్డారు: మాజీ జడ్జిలు
సమర్థించుకున్న మాజీ సీజేఐ

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ (రిటైర్డ్‌) రంజన్‌ గొగోయ్‌ను కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై రాజకీయ దుమారం రేగింది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను నిస్సిగ్గుగా దెబ్బతీయడమేనని కాంగ్రెస్‌ సహా విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ‘‘రాజ్యాంగ మౌలిక నిర్మాణంపైనే జరిపిన తీవ్రమైన దాడి ఇది. మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మాటలకు కూడా ప్రధాని మోదీ విలువివ్వలేదు’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ తీవ్రంగా విమర్శించారు. ‘ఆఖరి కోట కూడా కూలిపోయిందా..?’ అని మాజీ జడ్జి మదన్‌ లోకూర్‌ చేసిన వ్యాఖ్య అక్షరసత్యమని మరో ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. జస్టిస్‌ గొగోయ్‌.. ప్రభుత్వాలతో కుమ్మక్కవడానికి, ఆ ప్రభుత్వాల నుంచి రక్షణకు, తన నిజాయితీని, వ్యవస్థ నిబద్ధతలపై రాజీ పడడానికి ఉదాహరణగా నిలిచారని కపిల్‌ సిబాల్‌ ఘాటుగా దుమ్మెత్తారు. ‘ఆర్టికల్‌ 379, సీఏఏ మొదలైన వాటిపై సుప్రీం వైఖరి, కేసుల తాత్సారం.. ఇవన్నీ న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేట్లు చేశాయి. గొగోయ్‌ నియామకం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే కాదు, సామాన్యుడి దృష్టిలో న్యాయస్థానాలు పలచన చేయడమే’ అని సీపీఎం ఆక్షేపించింది.

‘‘ఇది క్విడ్‌ ప్రో కో (పరస్పర లబ్ధి)లా కనిపిస్తోంది. ఆయనకు సీటు ఇవ్వడంతో అయోధ్య, రాఫెల్‌ వివాదాలపై ఆయన ఇచ్చిన తీర్పులను మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉంది’’ అని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి ఎండగట్టారు. ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ కూడా అనైతిక రాజకీయమంటూ విమర్శలు గుప్పించారు. అయితే జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ మాత్రం ఆ పదవిని స్వీకరించడాన్ని సమర్థించుకున్నారు. ‘‘నేను ప్రమాణస్వీకారం చేశాక వివరంగా మాట్లాడతా. దేశనిర్మాణంలో న్యాయవ్యవస్థ, చట్టసభలు కలిసి మెలిసి పనిచేయడం కోసమే ఈ పదవిని చేపడుతున్నాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Courtesy Andhrajyothi