అరుంధతి రాయ్

ప్రియమైన మిత్రులారా ! కామ్రేడ్స్ ! 

సహ రచయితలారా !

ఇక్కడ మనం గుమికూడిన ఈ స్థలానికి బస్సులో కొంతదూరం ప్రయాణిస్తే వచ్చే స్థలంలో… పాలక పార్టీ నేతల ప్రసంగాలతో ఉన్మాదం ఎక్కించుకున్న  ఒక ఫాసిస్ట్ మూక,  పోలీసుల, ఎలక్ట్రిక్ మీడియా సహాయ సహకారాలు, భాగస్వామ్యంతో, తమ అకృత్యాలకు న్యాయస్థానాలు అడ్డు రావనే గట్టి నమ్మకంతో ఈశాన్య ఢిల్లీలోని కార్మిక వర్గం నివసించే కాలనీలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని  మారణాయుధాలతో హత్యాకాండకు బరితెగించాయి.

ఇటువంటి ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు గత కొంతకాలంగా వ్యక్తం కావటంతో కొన్ని చోట్ల కొంత మంది తమను తాము కాపాడుకునేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. మార్కెట్లు, దుకాణాలు, ఇళ్ళు, మసీదులు, వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీధులన్నీ రాళ్లతో, చెల్లాచెదురుగా విసిరేయబడిన సామాన్లతో నిండిపోయాయి. ఆసుపత్రులన్నీ గాయపడిన వాళ్ళతో, మరణశయ్యపైకి చేరిన వాళ్ళతో నిండి పోయాయి. శవాలు గదుల్లో గుట్టలు పడ్డాయి. ముస్లీంలు, హిందువులు, నిఘా శాఖ కి చెందిన ఒక యువ  పోలీస్ అధికారి కూడా ఈ చనిపోయిన వారిలో ఉన్నారు.

భీతి గొలిపే స్థాయిలో క్రూరత్వానికి పాల్పడగల సత్తా తనకున్నదని చెప్పుకోవటానికి ఉభయ  పక్షాలు శాయశక్తులా పోటీ పడ్డాయి. మరో వైపున అంతకు మించిన స్థాయిలో మానవత్వం, కరుణ జాలి దయ చూపగలమని కూడా వివిధ మతాలకు చెందిన మరికొందరు కృషి చేసారు. ప్రాణాలొడ్డి తోటి వారిని కాపాడటానికి పోటీ పడ్డారు.

ఏదేమైనా, ఇక్కడ బరిలోకి దిగిన రెండు పక్షాలు సమ ఉజ్జీలని చెప్పలేము.  ఈ అల్లర్లని  ‘ జై రామ్ ‘ అని అరుస్తున్న ఒక లంపెన్ మూకలు మొదలు పెట్టాయనేది తిరుగులేని సత్యం. వారికి ఫాసిస్టు రాజ్యం పూర్తిగా అండదండలు ఇచ్చిందన్న వాస్తవాన్ని కూడా మరుగున పెట్టలేని వాస్తవం. ఇదేదో హిందు ముస్లింల మధ్య జరిగిన ఘర్షణ గా కొట్టి పారేయలేము.  ఫాసిస్టులకి.. ఫాసిస్ట్ వ్యతిరేకులకి మధ్య జరుగుతున్న సమరంగానే దీన్ని చూడాలి. ఇందులో ముస్లీంలు  ఫాసిస్ట్ ల ప్రధమ  ‘శత్రువులు’. దీనంతంటినీ కేవలం ఒక ‘దాడి ‘ , అల్లరి, గొడవలు, ఘర్షణలు, లేక వామపక్షాలకి మితవాదులకీ మధ్య జరుగుతున్న గొడవలు అనో లేక న్యాయాన్యాలకు మధ్య జరుగుతున్న ఘర్షణ అనో భావించటం ప్రమాదకరమైనదేకాదు. వాస్తవాలను మరుగున పెట్టేది కూడా.

దాడులు జరుగుతున్నవుడు  పోలీసులు ప్రేక్షకులుగా నిలబడటమో, కొన్నిసార్లు దాడుల్లో పాల్గొనడమో మనం చూస్తున్నాము. గత డిసెంబర్ 15న  జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపైనా గ్రంధాలయంపైనా పోలీసులు విరుచుకుపడినపుడు జరిగునట్టుగానే ఈ దాడుల సమయంలో సైతం పోలీసులు సిసి టివి కెమెరాలు ధ్వంసం చేయటం చూసాము. జరిగిన దాడిని గుర్తు చేసింది. క్షతగాత్రులై ఒకరి మీద ఒకరు కుప్ప బడ్డ ముస్లిము యువకులపై ప్రతాపం చూపటం, జాతీయ గీతం పాడమని బలవంతం చేయటాన్ని కూడా  మనమంతా చూశాం. ఆనాడు గాయపడిన యువకుల్లో ఒకరు చనిపోయారని మనకు తెలుసు. అందరూ హతులయ్యారు. గాయపడ్డారు. భయాందోళనకు లోనయ్యారు. మన నగ్న ఫాసిస్టు ప్రధాని నరేంద్ర మోడీ ఆడుతున్న క్రూర వైకుంఠ పాలీలో హిందువులు ముస్లింలు పాము కాట్లకు బలయ్యారు. ఇటువంటి వికృత క్రీడ ఈ ప్రధానమంత్రికి కొత్తేమీ కాదు. 18 ఏళ్లక్రితం తన సొంత రాష్ట్రంలో ఇంతకన్నా  భయంకరమైన నరమేధాన్ని కొన్ని వారాలపాటు నిరాటంకంగా కొనసాగించాడు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన నరమేధాన్ని రాబోయే కొన్ని ఏళ్ల వరకు మనం తరచి తరచి పరిశోధించుకోవచ్చు.  స్థానిక  వివరాలు చారిత్రక రికార్డులుగా నిలిచిపోతాయి. సామాజిక మాధ్యమాల్లో స్వైర విహారం చేస్తున్న  విద్వేషపూరిత పుకార్లు కొత్త నెత్తురు కోసం వెంపర్లాడుతూనే ఉన్నాయి. తాజాగా  ఈశాన్య ఢిల్లీలో అదనంగా హత్యలు జరగనప్పటికీ  లేనప్పటికీ నిన్న (ఫిబ్రవరి 29 ) హత్యాకాండకు పురికొల్పిన ” దేశ ద్రోహులను తుపాకీతో కాల్చండి” అనే కేకలు  సెంట్రల్ ఢిల్లీ లో గింగిరుమంటూనే ఉన్నాయి.

కొద్దిరోజుల క్రితం ఇవే మాటల్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడిన బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవటం పట్ల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్ ఢిల్లీ పోలీసులను తీవ్ర పదజాలంతో మందలించారు. అతన్ని పంజాబ్ హైకోర్టు కి బదిలీ చేస్తూ ఫిబ్రవరి 26 వ తేదీ అర్ధరాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. మళ్ళీ కపిల్ మిశ్రా, ఆయనతో ఉన్న మూకలు అవే కేకలతో  వీధుల్లో తిరుగుతున్నారు. మరికొంత కాలం ఈ ప్రహసనం సాగనుంది.  న్యాయమూర్తి లోయా విషయం మనకు  తెలిసిందే కదా.  నరోడా పటియా లో 2002లో 96 మంది ముస్లీములను చంపినందుకు కోర్టులో శిక్ష పడిన  బాబూ బజరంగీ కథని  బహుశా మనం మర్చిపోయి ఉండొచ్చు. కోర్టుల్లో అనుకూలమైన న్యాయమూర్తుల్ని నియమించి  అతడ్ని ఖైదు నుంచి  నరేంద్ర భాయి ఎలా బయటకు తెచ్చిందీ యూట్యూబ్ వీడియోల్లో మనం బాబూ బజరంగీ గొప్పగా చెప్పుకొన్న విషయాలు యూట్యూబ్ లో స్వైరవిహారం చేస్తున్నాయి.

ఎన్నికలొచ్చినప్పుడల్లా ఇలాంటి నరమేధం జరుగుతాయని మనకు అర్ధ మవుతోంది. ఎన్నికల ప్రక్రియలో ఈ హేయమైన క్రీడ పదే పదే పునరావృతం కావటం, ఓటర్లు రెండు తరగతులుగా చీలిపోవటం తీవ్రమవటం గమనించాము. కానీ ఢిల్లీ మారణకాండ దీనికి భిన్నంగా కానీ ఇప్పటి ఢిల్లీ మారణకాండ ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ లు దారుణంగా ఓడిపోయిన కొద్దీ రోజుల్లోనే జరిగింది. బిజెపి ని ఓడించినందుకు ఢిల్లీకి ఫాసిస్టు శక్తులు విధించిన శిక్ష. బీహార్ లో జరగనున్న ఎన్నికలకు ఈ మారణకాండ ఓ ముందస్తు హెచ్చరిక కూడా.

అంతా వీడియోల్లో నమోదైంది. జరిగిందంతా చూడ్డానికి, వినడానికి అందుబాటులో ఉంది . కపిల్ మిశ్రా, పర్వేష్ వర్మా ల రెచ్చగొట్టే విద్వేష ప్రసంగాలు, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాద్, దేశ హోంమంత్రి అమిత్ షా.. ఇంకా ప్రధాని కూడా.. అందరి ఉపన్యాసాలు అందుబాటులోనే ఉన్నాయి.  అయినాసరే, అంతా తలక్రిందులు చేసి చూపిస్తున్నారు. దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 75 రోజుల పాటు  అత్యంత శాంతియుతంగా నిరసన శిబిరంలో కూర్చున్న మహిళలు, దేశ వ్యాప్తంగా వేలాదిమంది వ్యక్తం చేస్తున్న శాంతియుత నిరసనలు యావత్ భారత దేశానికి ముప్పుగా పరిణమించాయన్న వాదన దేశమంతా మార్మోగుతోంది. ఈ నిరసనలో కేవలం ముస్లింలు మాత్రమే కాక అనేక మంది ముస్లిమేతరులు కూడా ఉన్నారు.

ప్రవాస ముస్లీమేతరులకు తత్కాల్ ప్రాతిపదికన పౌరసత్వంని అందజేసే ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. ముస్లీం వ్యతిరేకమైనది కూడా. NRC, NPR లతో కలిపి ఇది కేవలం ముస్లీంలనే కాక ఈ సర్వేలో అడిగిన పత్రాలు చూపలేని  కోట్లాది మంది పౌరసత్వాన్ని రద్దు చేసి పుట్టిన దేశంలోనే వీళ్ళను పరాయి వాళ్లుగా మార్చేసే ఈ చట్టం యావత్ దేశానికి వ్యతిరేకమైనది. ఇలా పౌరసత్వం కొల్పోయేవారిలో ఇప్పుడు  ‘లం.. కొడుకుల్ని తుపాకులతో కాల్చి చంపండిరా ‘ అనే వాళ్లు కూడా ఉన్నారు. ఉంటారు.

ఒకసారి ” పౌరసత్వం ” అన్నది ప్రశ్నర్థకం అయితే  ఇక ప్రతీదీ ప్రశ్నార్థకమే అవుతుంది. మీ పిల్లల హక్కులు, మీ ఓటు హక్కు,మీ ఆస్తి హక్కులు.. అన్నీ కూడా.  అన్నా ఆరెంట్డ్

” పౌరసత్వం మీకు అన్ని హక్కులు పొందే హక్కునిస్తుంది. ” అంటుంది. ఎవరైనా సరే ఇలాక్కాదు అని వాదించే వాళ్లేవరైనా  ఒక్కసారి అస్సాంలో 20 లక్షల మంది  హిందువులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు కి ఏమైందో చూడవచ్చు. ఇక ఇదే సమస్య మేఘాలయాలో  స్థానిక తెగలు , స్థానికేతర తెగల జనాభా మధ్య చిచ్చు పెట్టింది. షిల్లాంగ్  కర్ఫ్యూ నీడలో ఉంది. స్థానికేతరులు ప్రవేశించకుండా రాష్ట్ర సరిహద్దులు మూసివేశారు.  ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశ్యం కేవలం దేశంలోనే కాదు, మొత్తం ఉపఖండంలోనే ప్రజల్ని విభజించడమే. నిజంగా హోంమంత్రి అన్నట్టుగా ” బంగ్లాదేశపు “చెదపురుగులు” ఉంటే  వాళ్ళని నిర్బంఫ్హ్ శిబిరాల్లో డిటెన్షన్ కేంద్రాలలో పెట్టలేరు. అలాగనీ దేశం నుంచీ బహిష్కరించనూలేరు. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ని హిందువుల కోసమే ఈ చట్టం తెచ్చామని చెవుతున్నపటికీ మామా దేశంలో జరుగుతున్న మారణకాండ నిజానికి వారి జీవితాలను ప్రమాదపు అంచులకు నెడుతోంది బిజెపి ప్రభుత్వం.

మనం ఎక్కడకు చేరామో చూడండి.  ఇప్పటి పాలకులు తప్ప దేశంలో అన్ని రాజకీయ స్రవంతులు పోరాడితేనే 1947 లో స్వాతంత్ర్యం  సాధ్యమైంది.  అప్పటి నుంచీ నేటివరకు కుల వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాలు, స్త్రీవాద ఉద్యమాలు కొనసాగుతూ వచ్చాయి.

1960 ల్లో పాలకవర్గాన్ని కూలదోసి సంపదను పంపిణీ, న్యాయం కోసం పోరాడటమే విప్లవో ద్యమం అయ్యింది. విప్లవోద్యమం మొదలైంది.

1990 ల కల్లా దేశంలో 120 కోట్ల మందికి కేటాయించే బడ్జెట్ కన్నా ఎక్కువ సంపద 63 మంది చేతుల్లో కేంద్రీకృతం కావటానికి దారి తీసిన నవ భారతాన్ని నిర్మించే క్రమంలో తమ భూముల నుండి, ఊర్ల నుండీ  తరిమివేయబడ్డ అశేష పేద ప్రజానీకం కోసం పోరాడే స్థాయికి విప్లవోద్యమం కుదించుకుపొయింది. తాజాగా మన పోరాటం మరింత కుదించుకుపోయి దేశ నిర్మాణంలో ఈ మాత్రం పాత్ర పోషించని శక్తుల నుండి భారతీయలు తమ పౌరహక్కులు కాపాడుకోవటమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమించే స్థితికి చేరుకున్నాము. మనం హక్కులకోసం ఆక్రోశిస్తుంటే ప్రభుత్వము పౌరులకు కల్పించే రక్షణలన్నీ రద్దు చేస్తోంది.  పోలీసు యంత్రాంగం మతతత్వ భావనాలతో నిండిపోవటం, న్యాయవ్యవస్థ తన బాధ్యతలను విస్మరిస్తున్న వేళ, బాధాతప్త హృదయాలకు స్వాఅంతన కల్పించాల్సిన మీడియా బాధలకు కారణం అయిన వారికి స్వాఅంతన కలిగిస్తోంది.

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హైదా రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేసి నేటికి 210 రోజులు అవుతోంది. ముగ్గురు కాశ్మీరీ ముఖ్యమంత్రులు సహా వేలాదిమంది జైళ్లలో మగ్గుతున్నారు. 70 లక్షల మంది ప్రజలు సమాచార అంధకారంలో జీవిస్తున్నారు. మూకుమ్మడిగా మానవహక్కుల ఉల్లంఘనలో ఇది విన్నూత్న దశ. ఫిబ్రవరి 26న ఢిల్లీ పుర వీధులు శ్రీనగర్ వీధులను తలపిస్తూ నిర్మానుష్యం అయ్యాయి. ఎడు నెలల క్రితం ఈ రోజు శ్రీనగర్లో పిల్లలు చివరి సారిగా బడికి వెళ్లారు.  కానీ చుట్టూ ఉన్నదంతా  ధ్వంసం చేసేయబడినప్పుడు, గొంతులు నులిమేయబడినప్పుడు స్కూళ్ళకి వెళ్లడంలో అర్ధం ఏమిటీ ?

ప్రజాస్వామ్యంలో  రాజ్యాంగబద్దంగా పరిపాలించబడలేనప్పుడు, అన్ని వ్యవస్థలూ డొల్ల బారిపోయినప్పుడు ఆధిపత్య సమూహాల రాజ్యం ఏర్పడటమే తదుపరి దశగా ఉంటుంది.  రాజ్యాంగాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ఒప్పుకోవచ్చు. ఒప్పుకోక పోవచ్చు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరహాలో అసలు రాజ్యాంగమే ఉనికిలో లేదన్నట్టు పాలన సాగించటం  ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించవేయటమే.  బహుశా ఇదే ప్రధాన లక్ష్యం ఏమో కూడా..! ఇది మనకు తగులుకున్న కరోనా వైరస్. మన ప్రజాస్వామ్యం జబ్బున పడింది.

కనుచూపు మేరలో సాయం చేసే చేతులు కనిపించటం లేదు. ఏ పొరుగు దేశము అర్ధవంతంగా జోక్యం చేసుకునే స్థితిలో లేదు. చివరకు ఐక్యరాజ్య సమితి కూడా ఆ స్థితిలో లేదు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకుంటున్న   ఏ రాజకీయ పార్టీ కూడా నైతిక వైఖరి తీసుకునే స్థితి కనపడటం లేదు. నిప్పు రవ్వలు ఎగిసేందుకు సిద్ధంగా ఉన్నాయి.  ఈ వ్యవస్థ విఫలం  అవుతోంది. మనకి ఇప్పుడు కావాల్సింది  దేనికైనా సిద్దపడే ప్రజలు. ఎటువంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధపడేవాళ్ళు కావాలి.  నిజం నిర్భయంగా చెప్పే వాళ్లు కావాలి. సాహస వంతులైన విలేఖరులు ఆ పని చేయగలరు. చేశారు. సాహసవంతులైన న్యాయవాదులు ఆ పని చేయగలరు. చేస్తున్నారు. అద్భుతమైన కళా కౌశలం గల కళాకారులు, సంగీత నిపుణులు, కవులు, రచయితలు, చిత్రకళాకారులు, చిత్రరంగ నిపుణులు ఈ పని చేయగలరు. జీవితపు అద్భుత సౌందర్యమంతా మనతోనే మన వైపే ఉంది. మన చేతినిండా పని ఉంది. జయించటానికో ప్రపంచమే ఉంది.

(ఆదివారం ( 01 -03- 2020 ) నాడు  ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ చేసిన ప్రసంగం. అనువాదం – కొండూరి వీరయ్య)