• 13,000 మంది ఇంటికి
  • హైదరాబాద్‌లో 2 వేల మంది భవిష్యత్తు అనిశ్చితం
  • కంటెంట్‌ ఆపరేషన్స్‌ విభాగ ప్రక్షాళన
  • ఈ విభాగంలోనే 6 వేల మంది తొలగింపు!
న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా రానున్న కొద్ది నెలల కాలంలో మొత్తంగా 13 వేల మందికి ఉద్వాసన చెప్పనుంది. మిడిల్‌ నుంచి సీనియర్‌ స్థాయి వరకు కార్యకలాపాలు సాగిస్తున్న 12 వేల మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నామని గురువారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా విశ్లేషకుల టెలీ కాల్‌లో కంపెనీ సీఎ్‌ఫఓ కారెన్‌ మెక్‌లాఫిన్‌ ఈ విషయం ప్రకటించారు. కంటెంట్‌ ఆపరేషన్స్‌ నుంచి పాక్షికంగా వైదొలగాలని నిర్ణయించామని, ఈ విభాగంలోనే ఆరు వేల మందిపై ప్రభావం ఉండవచ్చునని ఆయన అన్నారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాగ్నిజెంట్‌లో భిన్న దేశాల్లో 2,89,900 మంది ఉద్యోగులున్నారు.
వారిలో రెండు లక్షల మంది భారత్‌లోనే పని చేస్తున్నందు వల్ల ఇక్కడే లేఆఫ్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వివిధ దేశాల్లో పనిచేస్తున్న తమ కేంద్రాల్లో ఎక్కడ ఎంతమందిని తగ్గించేది వివరాలు ఆయన ప్రకటించలేదు. మొత్తం మీద నికరంగా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య 5 వేల నుంచి 7 వేల వరకు ఉంటుందని, మొత్తం ఉద్యోగుల్లో వారి సంఖ్య రెండు శాతమని కారెన్‌ చెప్పారు. వీరు కాకుండా మరో 5 వేల మంది 2020 మధ్య కాలానికి స్వచ్ఛందంగానే ఇతర కంపెనీలకు వలస పోయే (అట్రిషన్‌) ఆస్కారం ఉన్నదని కారెన్‌ వివరించారు. తమ వ్యూహాత్మక వ్యాపార కార్యకలాపాలకు భిన్నంగా ఉన్నందు వల్లనే కంటెంట్‌ ఆపరేషన్స్‌ నుంచి పాక్షికంగా వైదొలగనున్నామని కంపెనీ సీఈఓ బ్రయాన్‌ హంఫ్రీస్‌ చెప్పారు. తొలగించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే ఆస్కారం ఉన్నదా అనే అంశం తమ భాగస్వాములు, వెండార్లతో చర్చించి లేఆఫ్‌ ప్రభావం తక్కువగా ఉండేలా చూడాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. క్లయింట్‌ ప్రమాణాలకు అనుగుణంగా కంటెంట్‌ ఉన్నదా లేదా అన్నది పరిశీలించి అందులో అభ్యంతరకరమైన అంశాలేవైనా ఉంటే తొలగించే పని కాగ్నిజెంట్‌ నిర్వహిస్తుంది.
కంటెంట్‌పై పరిశోధనకు ప్రత్యేక నిధి
కంటెంట్‌ విభాగాన్ని తమ వ్యూహాత్మక కార్యకలాపాలకు దోహదపడేదిగా దిద్దే చర్యల్లో భాగంగా ఆల్గోరిథమ్స్‌ ఆధునీకరణ, ఆటోమేషన్‌ విభాగాల్లో పరిశోధన కోసం 50 లక్షల డాలర్ల (రూ.3,550 కోట్లు) నిధి ఏర్పాటు చేస్తున్నామని బ్రయాన్‌ తెలిపారు. ఈ విభాగాన్ని మరింత సునిశితంగా తీర్చి దిద్దడం వల్ల క్లయింట్ల వెబ్‌సైట్లలోకి అభ్యంతరకర అంశాల తాకిడి తగ్గుతుందని ఆయన అన్నారు. కంటెంట్‌ విభాగం నుంచి పాక్షికంగా వైదొలగాలన్న నిర్ణయం వల్ల తమకు ఏటా 50 కోట్ల నుంచి 55 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌లో 2,000 మందిపై వేటు!
వ్యయ నియంత్రణకు కాగ్నిజెంట్‌ తీసుకున్న ఉద్యోగుల ఉద్వాసన ప్రభావం హైదరాబాద్‌ కాగ్నిజెంట్‌ కేంద్రం పైనా పడనుంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 25,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 8,000 నుంచి 10,000 మంది ఐటీ సేవల్లో, 15,000 మంది బీపీఓ సేవల్లో ఉన్నారు. అలాగే ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వీడియోలు, కంటెంట్‌ వస్తున్నదా అనే విభాగంలోనే 500 మంది పని చేస్తున్నారని సమాచారం. వారంతా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు డిసెంబరులో పూర్తవుతాయి.
ఆ ప్రాజెక్టులు పూర్తి కాగానే ఆయా విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 2,000 మందిని ఇంటికి పంపించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌ కేంద్రంలో గతంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగుల ఉద్వాసనలు జరిగాయి. ఉద్యోగులు అప్పట్లో కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. దీంతో చాలామంది ఉద్యోగులు ముందు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.
లాభం 4.1 శాతం వృద్ధి
సెప్టెంబరు త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ 4.1 శాతం వృద్ధితో 49.7 కోట్ల డాలర్ల (రూ.3,528 కోట్లు) లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం 47.7 కోట్ల డాలర్ల (రూ.3,386 కోట్లు). మొత్తం ఆదాయం 407 కోట్ల డాలర్ల (రూ.28,897 కోట్లు) నుంచి 425 కోట్ల డాలర్లకు (రూ.30,175 కోట్లు) పెరిగింది. కాగా వచ్చే ఏడాదికి ఆదాయాల వృద్ధి అంచనాను 4.6 శాతం నుంచి 4.9 శాతానికి పెంచింది. డిసెంబరు త్రైమాసికంలో ఈ వృద్ధి 2.1 శాతం నుంచి 3.1 శాతం ఉండవచ్చునని పేర్కొంది. ప్రధానంగా డిజిటల్‌ విభాగంలో తమ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటున్నందు వల్ల రానున్న కాలంలో తమ వృద్ధి సామర్థ్యాలు పరిపూర్ణంగా సాధించగలుగుతామని, తిరిగి చారిత్రకంగా తాము అనుభవిస్తున్న స్థాయిని చేరుకోగలుగుతామని బ్రయాన్‌ హంఫ్రీస్‌ ఆశాభావం ప్రకటించారు.
ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకే…
షేర్‌ హోల్డర్ల విలువ పెంచాలన్న ఇన్వెస్టర్ల ఒత్తిడికి లొంగి వ్యయ నియంత్రణ, లాభసాటిగా లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాగ్నిజెంట్‌లో 2016 నవంబరు నాటికి 4 శాతం వాటాలున్న హెడ్జ్‌ ఫండ్‌ ఇలియట్‌ ఈ మేరకు ఒత్తిడి తెచ్చిందంటున్నారు. గత ఏడాది ఈ సంస్థ తన వాటాలను విక్రయించి కాగ్నిజెంట్‌ నుంచి వైదొలగడం కూడా ఈ నిర్ణయానికి కారణం కావచ్చునన్నది పరిశీలకుల అభిప్రాయం.
ఫేస్‌బుక్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కంటెంట్‌ విభాగంలో కాగ్నిజెంట్‌కు ఫేస్‌ బుక్‌ ప్రధాన క్లయింట్‌. కంటెంట్‌ విభాగంలో కీలక మార్పులు చేయాలన్న కాగ్నిజెంట్‌ నిర్ణయం వల్ల ఈ పరివర్తన సమయంలో తమ యూజర్ల కంటెంట్‌ సమీక్షకు, వారి భద్రతను పరిరక్షించేందుకు ఇతర భాగస్వాములతో కలిసి పని చేస్తామని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ చంద్ర తెలిపారు. ఇందులో భాగంగా తమ సమీక్షకుల సంఖ్యను పెంచడంతో పాటు టెక్సా్‌సలోని రివ్యూ సైట్‌ను కూడా అప్రమత్తం చేస్తామని చంద్ర చెప్పారు.
Courtesy Andhara Jyothy..